Telugu Global
NEWS

ఆ సిద్ధాంతాలను నమ్మితే ప్రమాదం- ఉండవల్లి

ఊహించని విధంగా దేశంలో పరిణామాలు మారుతున్నాయని.. మతం పేరుతో జరుగుతున్న విభజన చూస్తుంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. విజయవాడలో జరిగిన మీట్ ది ప్రెస్‌ కార్యక్రమంలో దేశం, రాష్ట్రంలోని పరిస్థితులపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. మతం విషయంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వారు తొలి నుంచి ఒకే విధానంతో ఉన్నారని.. వారిని చూసి ఆశ్చర్యం కలగడం లేదని.. కానీ కాంగ్రెస్‌లో పుట్టిపెరిగిన […]

ఆ సిద్ధాంతాలను నమ్మితే ప్రమాదం- ఉండవల్లి
X

ఊహించని విధంగా దేశంలో పరిణామాలు మారుతున్నాయని.. మతం పేరుతో జరుగుతున్న విభజన చూస్తుంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. విజయవాడలో జరిగిన మీట్ ది ప్రెస్‌ కార్యక్రమంలో దేశం, రాష్ట్రంలోని పరిస్థితులపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. మతం విషయంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వారు తొలి నుంచి ఒకే విధానంతో ఉన్నారని.. వారిని చూసి ఆశ్చర్యం కలగడం లేదని.. కానీ కాంగ్రెస్‌లో పుట్టిపెరిగిన వారు కూడా బీజేపీలోకి వెళ్తున్నారని అదే ఆశ్చర్యంగా ఉందన్నారు. అసలు నేతలకు ఐడియాలజీతో పట్టింపేలేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం ఉంది, ఏదో ఒక పదవి వస్తుందన్న ఉద్దేశంతోనే బీజేపీలోకి నేతలు వెళ్తున్నారు.

మసీదుల దగ్గర తవ్వితే శివలింగాలు వస్తున్నాయంటున్నారని.. నదీతీరం వెంట రాజమండ్రిలో 10 అడుగులు తవ్వినా అలాంటి విగ్రహాలు బయటపడతాయని.. ఇంకా లోతుకు తవ్వితే బౌద్దరామాలు ఉంటాయని, ఇంకా తవ్వితే జైనమతస్తుల విగ్రహాలు ఉంటాయన్నారు. టచ్‌ మీ నాట్‌ విధానంలో హిందూమతం వెళ్తోంది ఇది సరైనది కాదని వివేకానందుడే చెప్పారని గుర్తుచేశారు. ఇతర మతాలు అందరినీ కలుపుకుంటుంటే మనం మాత్రం దూరం పెడుతున్నామని.. అందుకే చాలా మంది ఇతర మతాల్లోకి వెళ్లిపోయారన్నారు.

పాకిస్తాన్ జిన్నా తండ్రి కూడా రఘువంశానికి చెందిన రాజపుత్రుడని.. అతడు చేపల వ్యాపారం చేయడంతో రాజపుత్రుల నుంచి బహిష్కరించి అవమానిస్తే.. దాన్ని చూసి తట్టుకోలేక జిన్నా ఇస్లాంలోకి వెళ్లిపోయారని ఉండవల్లి వివరించారు. ఆ హిస్టరీని ఆధారంగా చేసుకునే జిన్నా కుమార్తె కూడా తన తండ్రికి ఇస్లాం చట్టం వర్తించదని.. కాబట్టి కుమార్తెనైన తనకు బొంబాయిలోని జిన్నాకు చెందిన బంగ్లా దక్కుతుందంటూ కేసు కూడా వేశారని ఉండవల్లి గుర్తుచేశారు.

నరేంద్రమోడీ ఆర్థిక రంగం, విదేశీ విధానం, రక్షణ రంగంలోనూ విఫలమయ్యారని, వాటిపై దృష్టి పెట్టకుండా ఈ మతం గొడవ ఏంటని ఉండవల్లి ప్రశ్నించారు. చైనా మ‌న‌ భూమి ఆక్రమిస్తే దానిపై ఎందుకు మాట్లాడడం లేదని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామే ప్రశ్నించారన్నారు. చివరకు ఎల్‌ఐసీని అమ్ముదామన్నా.. షేర్లు కొనేందుకు ఎవడూ ముందుకు రావడం లేదన్నారు. అన్ని రంగాల్లో విఫలమవుతూ మతాన్ని ప్రజల్లోకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలను నమ్మితే ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ఏకాకులవుతారని ఉండవల్లి హెచ్చరించారు.

ప్రపంచవ్యాప్తంగా కోటి 20 లక్షల మంది భారతీయులు ఉన్నారని.. అమెరికాలో మన భారతీయులు మిగిలిన దేశాల నుంచి వచ్చిన వారి కంటే అత్యంత ధనవంతులుగా ఉన్నారన్నారు. ఇలాంటి సమయంలో ఇక్కడ మనం మతం ఆధారంగా దాడులు చేస్తే.. విదేశాల్లో ఉన్న మన భారతీయులకు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు.

మనుధర్మశాస్త్రంలో బ్రహ్మణుడు ఎంత పెద్ద తప్పు చేసినా ఏమీ చేయకూడదని, ఊరి నుంచి వెలివేయాలని మాత్రమే రాశారన్నారు. బహుశా ఇప్పుడున్న షెడ్యూల్డ్‌ కులాల వారంతా అలా అప్పట్లో వెలివేయబడ్డ బ్రహ్మణులై ఉంటారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

ఆస్ట్రేలియా పక్కన ఉన్న దేశంలోని ప్రజల డీఎన్‌ఏతో మన భారతీయుల డీఎన్‌ఏలు కలుస్తున్నాయన్నారు. ఈ దేశంలో కుల ప్రభావం తగ్గే కొద్దీ దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. మన్మోహన్‌ సింగ్ హయాంలో విద్యుత్ ఉత్పత్తిని ఐదు రెట్లు పెంచారని.. ఈ ప్రభుత్వం వచ్చాక మాత్రం లోటులోకి వెళ్లిపోయిందన్నారు.

ఏపీ వరకు మూడు ప్రధాన పార్టీలు బీజేపీకే వంతపాడుతున్నాయని విమర్శించారు. అసలు మూడు పార్టీలు కనీసం బీజేపీని ప్రశ్నించలేని పరిస్థితి ఎందుకొచ్చిందని ప్ర‌శ్నించారు. స్థాయికి మించి జగన్‌ అప్పులు తెచ్చి పంచుతున్నది నిజమేని, సంక్షోభంలోకి వెళ్తోందీ నిజమని.. ఇప్పుడు జగన్‌ను వ్యతిరేకిస్తున్న పార్టీలు తాము అధికారంలోకి వస్తే ఈ పథకాలన్నీ అమలు చేయబోమని చెప్పగలరా అని ఉండవల్లి ప్రశ్నించారు. రాష్ట్రం కంటే కేంద్రంలో అప్పుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. 70ఏళ్లలో చేసిన అప్పుల కంటే ఈ ఎనిమిదేళ్లలోనే ఎక్కువ అప్పు కేంద్రం చేసిందని గుర్తు చేశారు.

కేవలం చారిటీ ఆధారంగా ప్రజలు ఓట్లు వేస్తారని తాను అనుకోవడం లేదని, ప్రజలు అభివృద్ధి, గవర్నెన్స్‌ విధానాన్ని కూడా చూస్తారన్నారు. పంపకాల విషయంలో ఏ పార్టీకి కూడా ఇది తప్పు.. తామొస్తే ఆపేస్తామని చెప్పే దమ్ము లేదన్నారు. నాలుగేళ్లలో ధరలు మాత్రం నాలుగు రెట్లు పెరిగిపోయాయన్నారు. జగన్‌ ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి మధ్య తేడా పెద్దగా కనిపించడం లేదన్నారు.

2014 నుంచి రెడ్డి, కమ్మ మధ్య స్పష్టమైన డివిజన్‌ వచ్చిందన్నారు. టీడీపీ హయాంలో పదవులు, అవార్డులు అన్నీ కమ్మ వారికే ఉండేవని, ఇప్పుడు కీలకమైన పదవులన్నీ రెడ్లకే ఇస్తున్నారన్నారు. నామమాత్రంగా ఇతర వర్గాలకు రాజ్యసభ, మంత్రి పదవులు ఇచ్చామని చెబుతున్నా నడిపేది అంతా వారేనన్నారు.

టీడీపీ, వైసీపీ, జనసేన అనేవి ప్రైవేట్‌ కంపెనీలనీ..ఆయా పార్టీల్లో అధినేతలు అనుకున్నవే జరుగుతాయని, వారి మాట విన్నవారే ఆ పార్టీలో ఉంటారన్నారు. టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయనిపిస్తోందన్నారు. టీడీపీ- జనసేన కలిస్తే జగన్‌మోహన్ రెడ్డికి టఫ్‌ ఫైటే ఉంటుందన్నారు. షర్మిల తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారు తనకు తెలియదు గానీ.. అక్కడ ఆమె నెగ్గడం చాలా కష్టమన్నారు.

నేరస్వభావం ఉన్న వ్య‌క్తులను ప్ర‌జ‌లే అంగీకరిస్తున్నారని.. కాబట్టి వారిని రాజకీయాల్లో లేకుండా చేయడం కష్టమన్నారు. అసాంఘిక శక్తులు, నేరస్వభావం ఉన్న వ్యక్తులు.. తమ వద్ద ఉన్న వారి కోసం ఏస్థాయికి వెళ్తారని.. ఆ తీరు నచ్చి కూడా వారి వెంట చాలా మంది ఉంటారని వ్యాఖ్యానించారు. చివరకు రాజమండ్రిలో ఒక న్యాయమూర్తి కూడా భూమి వివాదం వస్తే ఒక రౌడీని సంప్రదించారని ఉండవల్లి చెప్పారు. జడ్జి స్థానంలో ఉండి రౌడీ దగ్గరకు రావడం ఏంటి అంటే.. పోలీసులతో ఇవన్నీ కావు, ఈ రౌడీ ఒకసారి వెళ్లి కనిపిస్తే అవతలివాడు భయపడతారని జడ్జి చెప్పారని ఉండవల్లి వివరించారు.

First Published:  24 May 2022 3:38 AM GMT
Next Story