Telugu Global
Health & Life Style

మంకీ పాక్స్ అంటే ఏంటి? ఇది కొత్త వ్యాధా.. మరో పాండమిక్ వస్తుందా? నిపుణులు ఏం చెప్తున్నారు?

కోవిడ్ భయాందోళనల నుంచి ప్రపంచం పూర్తిగా బయటపడక ముందే ‘మంకీ పాక్స్’ (Monkeypox) రూపంలో మరో వ్యాధి భయపెడుతున్నది. యూరోప్, అమెరికా దేశాలను వణికిస్తూ తాజాగా మరిన్ని దేశాలకు వ్యాపించింది. ఇజ్రాయేల్, స్విట్జర్లాండ్‌లో మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. రెండు వారాల్లో 100పైగా కేసులు కేవలం 10 దేశాల్లో నమోదు కావడం ఆందోళనకరంగా మారింది. మంకీపాక్స్ కేసులు ఇలా విస్తరించడం అసాధారణమైన విషయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వ్యాఖ్యానించింది. నైజీరియా నుంచి ఇండియాకు వచ్చిన ఒక […]

మంకీ పాక్స్ అంటే ఏంటి? ఇది కొత్త వ్యాధా.. మరో పాండమిక్ వస్తుందా? నిపుణులు ఏం చెప్తున్నారు?
X

కోవిడ్ భయాందోళనల నుంచి ప్రపంచం పూర్తిగా బయటపడక ముందే ‘మంకీ పాక్స్’ (Monkeypox) రూపంలో మరో వ్యాధి భయపెడుతున్నది. యూరోప్, అమెరికా దేశాలను వణికిస్తూ తాజాగా మరిన్ని దేశాలకు వ్యాపించింది. ఇజ్రాయేల్, స్విట్జర్లాండ్‌లో మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. రెండు వారాల్లో 100పైగా కేసులు కేవలం 10 దేశాల్లో నమోదు కావడం ఆందోళనకరంగా మారింది. మంకీపాక్స్ కేసులు ఇలా విస్తరించడం అసాధారణమైన విషయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వ్యాఖ్యానించింది. నైజీరియా నుంచి ఇండియాకు వచ్చిన ఒక వ్యక్తిలో ఈ వైరస్ లక్షణాలు కనిపించడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సాధారణంగా ఆఫ్రికా, పశ్చిమ దేశాల్లో మంకీపాక్స్ సాధారణమే అయినా.. ఆసియా ఖండంలోకి ఏనాడూ ప్రవేశించలేదు. ఇప్పుడు అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో అన్ని దేశాలు అప్రమత్తం అయ్యాయి.

మంకీపాక్స్ అంటే.

మశూచి (పెద్ద అమ్మవారు, స్మాల్ పాక్స్ – Smallpox), పొంగు (చిన్నఅమ్మవారు, ఆటలమ్మ, చికెన్ పాక్స్ – Chickenpox) లాంటి ఇన్‌ఫెక్షనే ఇది. అయితే మశూచితో పోలిస్తే మంకీపాక్స్ తీవ్రత చాలా తక్కువ. 1958లో తొలిసారి ఆఫ్రికాలోని కోతుల్లో దీని గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. అయితే మనుషుల్లో మాత్రం 1970లో తొలిసారి ఈ ఇన్‌ఫెక్షన్ కనిపించింది. పశ్చిమ, మధ్య ఆఫ్ఱికా అడవుల్లో వైరస్ సోకిన జంతువుతో మనిషి కాంటాక్ట్‌లోకి వచ్చినప్పుడు వైరస్ మ్యుటేషన్ అయినట్లు గుర్తించారు. సాధారణంగా వైరస్‌లు మ్యుటేట్ అయి ఒక జంతువు నుంచి మరో జంతువుకు సోకుతుంటాయి. అలా మనిషికి కూడా సోకింది.

మంకీపాక్స్ ఎక్కువగా కోతులు, ఎలుకల్లోనే కనిపిస్తుంది. మనుషులకు సోకినా చాలా త్వరగానే నయమైపోతుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి చర్మం మీద దద్దుర్లు పుట్టుకొస్తాయి. పొక్కులుగా ప్రారంభమైం ఆ తర్వాత బొబ్బలుగా మారతాయి. అవే ఆ తర్వాత చెక్కులు కట్టి భయానకంగా కనిపిస్తాయి. ఈ వైరస్ సోకితే ముందు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, వీక్‌నెస్, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత ఐదు రోజులకు మశూచి వ్యాధిలాగా శరీరమంతా బొబ్బలు వస్తాయి. అవి తర్వాత పుండ్లుగా మారతాయి. పుండ్లు తగ్గినా.. ఆ తర్వాత చర్మంపై మచ్చలు అలాగే ఉండిపోతాయి. సాధారణంగా ఈ పుండ్లు నాలుగు వారాల్లోనే తగ్గిపోతాయి. అయితే వందల్లో ఒకరికి మాత్రమే ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

ఎలా వస్తుంది?

మనుషుల్లో ఈ వ్యాధి లాలాజలం తుంపర్ల ద్వారా, మంకీపాక్స్ బాధితులకు అతి సమీపంగా మెలిగినా, రోగులతో కలసి పడుకున్నా, దుస్తులు ముట్టుకున్నా సోకుతుంది. లైంగిక కార్యకలాపాల సమయంలో కూడా ఈ వ్యాధి వ్యాపించే అవకాశాలు ఎక్కువ. ఇటీవల సోకిన రోగుల్లో అత్యధిక మంది జననేంద్రియాల మీది, వాటి చుట్టు పక్కల ప్రాంతాల్లో కురుపులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కులు అయిన పురుషుల్లో ఎక్కువగా ఈ వ్యాధి సోకినట్లు తెలుస్తున్నది. సాధారణంగా ఈ వ్యాధి ఒక ప్రాంతానికే పరిమితం అవుతుంది. కానీ ఇటీవల ఇది పలు దేశాలకు వేగంగా విస్తరిస్తుండటంతో ఆయా ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.

ఆందోళన అవసరం లేదు

కోవిడ్ వైరస్‌లా మంకీపాక్స్ వల్ల పాండమిక్ ఏర్పడే అవకాశం లేదని తెలుస్తున్నది. ఇందుకోసం లాక్‌డౌన్లు పెట్టాల్సిన అవసరం ఉండదని నిపుణులు చెప్తున్నారు. మంకీపాక్స్ ఒక డీఎన్ఏ వైరస్ కాబట్టి ఫ్లూ, కోవిడ్ అంత వేగంగా మ్యుటేట్ కూడా కాదని అంటున్నారు. మూడు నాలుగేళ్ల క్రితం కనిపించిన మంకీపాక్స్ వైరస్ రూపాలకు ఇది చాలా దగ్గరగా ఉన్నదని, ఇప్పుడు వ్యాపిస్తున్నది పాత వాటికి మ్యుటెంట్ అని చెప్పలేమని.. అందుకు ఆధారాలు కూడా లేవని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది.

పాత తరం వారికి స్మాల్ పాక్స్ టీకాలు ఇచ్చారు. కాబట్టి ఆ టీకాలు తీసుకున్న వారికి మంకీపాక్స్ నుంచి రక్షణ లభించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఆ టీకాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఇవ్వడం వల్లే.. మంకీపాక్స్ వేగంగా విస్తరించడం లేదని కూడా అంటున్నారు. అయితే గతంలో ఎబోలా, జికా వైరస్‌లు కూడా ఇలాగే చిన్నగా మొదలై అనేక మందిని బలితీసుకున్నాయని.. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ALSO READ: వయసుని వెనక్కు తగ్గించొచ్చట! ఎలాగంటే

First Published:  23 May 2022 1:13 AM GMT
Next Story