Telugu Global
NEWS

వైసీపీ ఎమ్మెల్సీ అరెస్ట్‌కు రంగం సిద్ధం, ట్రాక్ రికార్డూ వివాదాస్పదమే

మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. అనంతబాబును అదుపులోకి తీసుకుంటామని జిల్లా ఎస్పీ ప్రకటించారు. అయితే ఒక వైపు సుబ్రహ్మణ్యం మృతిపై కుటుంబసభ్యులు, దళిత సంఘాలు, విపక్షాలు పెద్దెత్తున ఆందోళన చేస్తున్నా.. ఎమ్మెల్సీ అనంతబాబు మాత్రం దర్జాగా వివాహాలకు హాజరవుతుండడం చర్చనీయాంశమైంది. కేసు తీవ్రత దృష్ట్యా నిపక్షపాతంగా దర్యాప్తు చేయాలని పోలీసులను ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారు. అంతకు ముందు కేసులో రాజీకి కొందరు స్థానిక […]

వైసీపీ ఎమ్మెల్సీ అరెస్ట్‌కు రంగం సిద్ధం, ట్రాక్ రికార్డూ వివాదాస్పదమే
X

మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. అనంతబాబును అదుపులోకి తీసుకుంటామని జిల్లా ఎస్పీ ప్రకటించారు. అయితే ఒక వైపు సుబ్రహ్మణ్యం మృతిపై కుటుంబసభ్యులు, దళిత సంఘాలు, విపక్షాలు పెద్దెత్తున ఆందోళన చేస్తున్నా.. ఎమ్మెల్సీ అనంతబాబు మాత్రం దర్జాగా వివాహాలకు హాజరవుతుండడం చర్చనీయాంశమైంది.

కేసు తీవ్రత దృష్ట్యా నిపక్షపాతంగా దర్యాప్తు చేయాలని పోలీసులను ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారు. అంతకు ముందు కేసులో రాజీకి కొందరు స్థానిక వైసీపీ నేతలు ప్రయత్నించగా.. సీఎంవో నుంచే ఆదేశాలు రావడంతో వారు వెనక్కు తగ్గినట్టు చెబుతున్నారు.

స్వయంగా ఎమ్మెల్సీనే కారులో శవాన్ని తీసుకుని రావడం, యాక్సిడెంట్ జరిగినట్టు ఎమ్మెల్సీ చెప్పిన ప్రాంతంలో ఎలాంటి ప్రమాదం జరలేదన్ననిర్ధారణ నేపథ్యంలో అనంతబాబు ఈ కేసులో ఇరుక్కున్నట్టుగా భావిస్తున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు ట్రాక్‌ రికార్డు కూడా తొలి నుంచి వివాదాస్పదంగానే ఉంది. గతంలో ఒకసారి ఎస్టీ సర్టిఫికెట్‌ సాధించి దాని ద్వారా ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. కానీ అప్పటి కలెక్టర్‌ గోపాలకృష్ణా ద్వివేది అతడు ఎస్టీ కాదని తేల్చడంతో ఆ ఎత్తు పారలేదు.

అనంతబాబు మేనమామ టీడీపీలో సీనియర్ నేతగా ఉండడంతో ఈయన చేసే ఆరాచకాలపై టీడీపీ కూడా పెద్దగా ప్రశ్నించేది కాదన్న విమర్శలున్నాయి. అనంత బాబు తండ్రిని కూడా నక్సల్స్ పలుమార్లు హెచ్చరించి ఆ తర్వాత హత్య చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబుపై అక్రమ కలప రవాణా, మహిళలపై వేధింపులు వంటి పలు ఆరోపణలు ఉన్నాయి.

రంపచోడవరం ఎస్టీ రిజర్వ్ కావడంతో తాను పోటీ చేసేందుకు అవకాశం లేకపోవడంతో తన చెప్పుచేతల్లో ఉండే వారిని అభ్యర్థులుగా నిలబెట్టేవారన్న ప్రచారం ఉంది. 2014లో వంతల రాజేశ్వరికి, 2019 ఎన్నికల్లో నాగులపల్లి ధనలక్ష్మికి అనంతబాబు మద్దతు ఇచ్చారు. రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఇతడి విషయంలో చూసీ చూడనట్టుగా ఉండేవన్న విమర్శలున్నాయి. ఒక పార్టీ సామాజికవర్గపరంగా మెతకవైఖరి అవలంబిస్తే.. మరో ప్రధాన పార్టీలో ఉన్న అతడి మేనమామ కారణంగా ఆ పార్టీ నుంచి పెద్దగా ఒత్తిడి ఉండేది కాదని చెబుతున్నారు. ఇక వైసీపీలో ఎమ్మెల్సీగా ఉండడంతో అతడిని తిరుగులేకుండాపోయింది.

రోడ్లు ప్రమాదంలో సుబ్రహ్మణ్యం చనిపోయాడని ఎమ్మెల్సీ నమ్మించే ప్రయత్నం చేశారని, రోడ్డు ప్రమాదమే జరగలేదని తేలిన తర్వాత ఎమ్మెల్సీ అసలు నిజాలను దాస్తున్నారన్నది స్పష్టంగా అర్థమవుతోందని.. అయినా ఇప్పటికీ పోలీసులు అనంతబాబుని అరెస్ట్ చేయకపోవడం ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. పైగా ఇంత జరుగుతుంటే ఎమ్మెల్సీ అనంతబాబు దర్జాగా, నవ్వులు చిందిస్తూ శుభకార్యాలకు హాజరవడం మృతుడి కుటుంబసభ్యుల్లో కొత్త అనుమానాలు రేకెత్తించడంతో పాటు, ఈకేసులో పోలీసులు, ప్రభుత్వం అంత సీరియస్‌గా లేకపోవడం వల్లనే ఎమ్మెల్సీ దర్జాగా, ధీమాగా తిరుగుతున్నారా అన్న అనుమానాలకు తావిస్తోంది.

First Published:  21 May 2022 9:22 PM GMT
Next Story