Telugu Global
NEWS

పంచాయతీలకే నిధులు సరిపోవట్లేదు.. ఇప్పుడు ఎంపీడీవో వాహనాల మెయింటెనెన్స్ ఖర్చుల భారం..!

తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీలపై సరికొత్త భారం పడనున్నది. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ది పనులను ఇన్‌స్పెక్ట్ చేయడానికి వచ్చే మండల పరిషత్ డెవలెప్‌మెంట్ ఆఫీసర్ (ఎంపీడీవో)ల వాహనాల మెయింటెనెన్స్ ఖర్చులను ఆయా గ్రామ పంచాయతీలే భరించాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఈ ఉత్తర్వులు రాష్ట్ర స్థాయిలో కాకుండా ఆయా జిల్లాల డీపీవోలు జారీ చేయడం గమనార్హం. ఒక మండలానికి ఒక ఎంపీడీవో ఉంటాడు. ఆ మండలంలోని ఒక్కో నెల ఒక గ్రామ పంచాయతీ.. ఎంపీడీవోకు రూ. 20 వేలు […]

పంచాయతీలకే నిధులు సరిపోవట్లేదు.. ఇప్పుడు ఎంపీడీవో వాహనాల మెయింటెనెన్స్ ఖర్చుల భారం..!
X

తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీలపై సరికొత్త భారం పడనున్నది. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ది పనులను ఇన్‌స్పెక్ట్ చేయడానికి వచ్చే మండల పరిషత్ డెవలెప్‌మెంట్ ఆఫీసర్ (ఎంపీడీవో)ల వాహనాల మెయింటెనెన్స్ ఖర్చులను ఆయా గ్రామ పంచాయతీలే భరించాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఈ ఉత్తర్వులు రాష్ట్ర స్థాయిలో కాకుండా ఆయా జిల్లాల డీపీవోలు జారీ చేయడం గమనార్హం. ఒక మండలానికి ఒక ఎంపీడీవో ఉంటాడు. ఆ మండలంలోని ఒక్కో నెల ఒక గ్రామ పంచాయతీ.. ఎంపీడీవోకు రూ. 20 వేలు వెహికిల్ మెయింటెనెన్స్‌ కొరకు అందించాలని జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లా డీపీవోలు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయా పంచాయతీల సర్పంచ్‌లు మండిపడుతున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులతో రాష్ట్రంలోని పంచాయతీలు అభివృద్ది పనులు చేపట్టడమే కాకుండా వాటి నుంచే కార్మికుల జీతాలు, వాహనాల ఈఎంఐలు, డీజిల్, కరెంట్ బిల్లులు, విద్యుత్ దీపాల నిర్వహణ వంటి వాటికి సర్దుతున్నాయి. చాలా గ్రామ పంచాయతీల నుంచి వచ్చే ఆదాయం చాలా తక్కువ. వచ్చే నిధులు కూడా అరకొరగానే ఉంటుండటంతో కనాకష్టంగా సర్దుకుంటున్నారు. ఈ క్రమంలో అదనంగా ఎంపీడీవోల వాహనాల మెయింటెనెన్స్ పేరుతో అదనపు భారం మోపడంపై గ్రామ సర్పంచ్‌లు మండిపడుతున్నారు. చేసిన పనులకే బిల్లులు రాక సతమతం అవుతుంటే.. ఈ అదనపు భారం మోయడం తమ వల్ల కాదని తెగేసి చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైన ఎంపీడీవోలకు సర్కారే అలవెన్సులు ఇవ్వాల్సింది పోయి.. ఆ భారాన్ని పంచాయతీలపై మోపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

గ్రామాల్లో జరిగే అభివృద్ది పనులను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎంపీడీవోలపై ఉంటుంది. వారికి అవసరమైన అలవెన్సులు కలెక్టర్ల ఫండ్ నుంచి తీసి ఇవ్వాలి. అంతే కానీ ఇలా పంచాయతీలపై భారం మోపడం భావ్యం కాదని అంటున్నారు. ఇప్పటికే ఎంపీడీవో ఆఫీసులో ఉండే కంప్యూటర్ ఆపరేటర్, ఆర్‌డబ్ల్యూఎస్ పంప్ ఆపరేటర్‌లకు ప్రతీ నెల రూ. 8 వేలు, రూ. 16 వేల చొప్పున పంచాయతీల నుంచి తీసుకుంటున్నారు. దీనికి అదనంగా మరో రూ. 20 వేలంటే చాలా కష్టమని.. అసలు ఆదాయం రాని పంచాయతీల్లో సర్పంచ్‌లు అప్పులు చేసి ఇవ్వాల్సి వస్తుందని అంటున్నారు.

కాగా, రాష్ట్ర సర్కార్ నిర్ణయం మేరకే ఆయా జిల్లాల డీపీవోలు ఆ ఉత్తర్వులు ఇచ్చినట్లు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు.

ALSO READ: రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ఆ కార్డ్‌ ప్లే చేయబోతోందా?

Next Story