Telugu Global
National

ఆదర్శ గ్రామమంటే ఇది....వితంతువుల కోసం సంచలన‌ తీర్మానం

వితంతువుల పట్ల మన దేశంలో ఎంత వివక్ష కొనసాగుతుందో తెలిసిందే. సాంప్రదాయాల పేరుతో వారిని చిన్న చూపు చూడటం,అగౌరవపర్చడం ప్రతి రోజూ సాగుతూ ఉంటుంది. అయితే వీటన్నింటికి స్వస్తి చెబుతూ ఓ గ్రామపంచాయితీ దేశానికే ఆదర్శంగా నిలిచే తీర్మానం చేసింది. మహా రాష్ట్ర కొల్హాపూర్ జిల్లా షిరోల్ తాలూకాలోని హెర్వాడ్ గ్రామపంచాయితీ ఓ చారిత్రాత్మకమైన తీర్మానం చేసింది. వితంతువు మంగళసూత్రం, కాలి ఉంగరం తీసేయడం, బొట్టు తీసేయడం, గాజులు పగలగొట్టడం వంటి ఆచారాలను నిషేధించాలని హెర్వాడ్ గ్రామపంచాయితీ […]

This ideal village sets an example: Sensational Judgement for widows.
X

వితంతువుల పట్ల మన దేశంలో ఎంత వివక్ష కొనసాగుతుందో తెలిసిందే. సాంప్రదాయాల పేరుతో వారిని చిన్న చూపు చూడటం,అగౌరవపర్చడం ప్రతి రోజూ సాగుతూ ఉంటుంది. అయితే వీటన్నింటికి స్వస్తి చెబుతూ ఓ గ్రామపంచాయితీ దేశానికే ఆదర్శంగా నిలిచే తీర్మానం చేసింది.

మహా రాష్ట్ర కొల్హాపూర్ జిల్లా షిరోల్ తాలూకాలోని హెర్వాడ్ గ్రామపంచాయితీ ఓ చారిత్రాత్మకమైన తీర్మానం చేసింది.

వితంతువు మంగళసూత్రం, కాలి ఉంగరం తీసేయడం, బొట్టు తీసేయడం, గాజులు పగలగొట్టడం వంటి ఆచారాలను నిషేధించాలని హెర్వాడ్ గ్రామపంచాయితీ తీర్మానించింది. పురాతన ఆచారాల వల్ల వితంతువులు సామాజిక, మతపరమైన సమావేశాలకు హాజరుకాలేకపోయే పరిస్థితిని వ్యతిరేకించింది ఈ పంచాయితీ .

ఈ గ్రామం మే 4న తీర్మానాన్ని ఆమోదించింది, దీని తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలను ‘హెర్వాడ్ మోడల్’ను అనుసరించాలని కోరుతూ ఒక సర్క్యులర్‌ను విడుదల చేసింది. వితంతువుల గౌరవాన్ని కాపాడే చట్టాన్ని రూపొందించే దిశగా ఈ గ్రామ పంచాయితీ తీర్మానం ఒక సానుకూలమైన ముందడుగు.

షోలాపూర్ జిల్లాలో సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతీరావ్ ఫూలే పేరు మీద ఉన్న ఒక సాంఘిక సంక్షేమ సంస్థకు నేతృత్వం వహిస్తున్న ప్రమోద్ జింజాడే హెర్వాడ్ మోడల్‌కు స్ఫూర్తిగా నిలిచారు. మరో ఏడు గ్రామాలు ఇలాంటి తీర్మానాలను ఆమోదించాయని ఆయన మీడియాకు తెలిపారు.

ఇటువంటి తిరోగమన పద్ధతులకు స్వస్తి పలకడానికి పంచాయితీ తీర్మానాల కంటే, చట్టం చేయడం అవసరమని ప్రమోద్ అన్నారు. ఈ విషయంపై తాను రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్ నీలం గోర్హేను కలిశానని, ఈ విషయాన్ని వర్షాకాల సమావేశాల్లో రాష్ట్ర అసెంబ్లీ ఉభయసభల్లో చర్చిస్తామ‌ని ఆయన హామీ ఇచ్చారని ప్రమోద్ చెప్పారు.

వితంతువులను సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిరోధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రమోద్ అన్నారు. దుఃఖంలో ఉండే మరణించిన వ్యక్తి భార్యతో బలవంతంగా ఇలాంటి ఆచారాలు పాటింపజేయడం దుర్మార్గమని, అలా వారికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధించాలని ఆయన సూచించారు.

రాబోయే కాలంలో చట్టాన్ని ఉల్లంఘించకుండా చూసేందుకు, 50 శాతం మంది మహిళలు సభ్యులుగా వారిలో సగం మంది వితంతువులతో కూడిన పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ ప్రతిపాదిత సభ్యులకు తప్పనిసరిగా అంత్యక్రియల ప్రక్రియలను వీడియో షూట్ చేయడానికి శిక్షణ ఇవ్వాలని, సాక్షుల వాంగ్మూలాలతో పాటు స్థానిక గ్రామ అధికారికి, పోలీసులకు లేదా మహిళా మరియు శిశు సంరక్షణ అధికారికి అందజేయాలని ఆయన అన్నారు.

హెర్వాడ్ సర్పంచ్ సూరగొండ పాటిల్ మాట్లాడుతూ.. తీర్మానం చేసినప్పటికీ వితంతువులకు సంబంధించిన తిరోగమన పద్ధతులను ఎందుకు నిర్మూలించాలో ప్రజలకు తెలియజేయడం కోసం గత ఐదు నెలల నుంచి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

కరోనావైరస్ ఫస్ట్ , సెకండ్ వేవ్ ల వల్ల అనేక మంది మరణించారని, దీనివల్ల వితంతువులు ఎదుర్కొంటున్న‌ భయంకరమైన సామాజిక పరిస్థితిని గ్రహించామ‌ని పాటిల్ చెప్పారు.

హెర్వాడ్ గ్రామ పంచాయితీ తీర్మానం మహారాష్ట్రలో ఒకరకమైన చైతన్యానికి కారణమైంది. అనేక మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు దీనిపై చట్టం తేవాలని మహా రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నాయి. ఈ గ్రామం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆశించడంలో తప్పులేదు కదా !

First Published:  21 May 2022 12:00 AM GMT
Next Story