Telugu Global
NEWS

నాకూ జైలు జీవితం రాసి పెట్టి ఉందేమో!- జేసీ దివాకర్‌ రెడ్డి

చాలా రోజుల తర్వాత మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మైక్ పట్టారు. చంద్రబాబు అనంతపురం జిల్లాలో నిర్వహిస్తున్న బాదుడే బాదుడే కార్యక్రమంలో జేసీ తనదైన శైలిలో ప్రసంగించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలందరికీ తండ్రిలాంటి వాడని.. అలాంటి వ్యక్తిని మూడేళ్ల క్రితం జనమంతా కలిసి బాదేశారని జేసీ ఆవేదన చెందారు. ఆ తప్పు కారణంగా ఇప్పుడు మనమంతా సర్వనాశనం అయిపోయామన్నారు. గాంధీ గొప్ప వారని.. అలాంటి వ్యక్తి కుమారులు సారాయి తాగి నడిరోడ్డుపై పొర్లాడారని, తండ్రి మంచి […]

నాకూ జైలు జీవితం రాసి పెట్టి ఉందేమో!- జేసీ దివాకర్‌ రెడ్డి
X

చాలా రోజుల తర్వాత మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మైక్ పట్టారు. చంద్రబాబు అనంతపురం జిల్లాలో నిర్వహిస్తున్న బాదుడే బాదుడే కార్యక్రమంలో జేసీ తనదైన శైలిలో ప్రసంగించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలందరికీ తండ్రిలాంటి వాడని.. అలాంటి వ్యక్తిని మూడేళ్ల క్రితం జనమంతా కలిసి బాదేశారని జేసీ ఆవేదన చెందారు. ఆ తప్పు కారణంగా ఇప్పుడు మనమంతా సర్వనాశనం అయిపోయామన్నారు. గాంధీ గొప్ప వారని.. అలాంటి వ్యక్తి కుమారులు సారాయి తాగి నడిరోడ్డుపై పొర్లాడారని, తండ్రి మంచి వాడు కావొచ్చు, విత్తనం మంచిది కావొచ్చు.. అది కంప చెట్టుగా మారితే ఏం ఉపయోగం అని ప్రశ్నించారు.

ఎవరికి కష్టమైనా, నష్టమైనా వైఎస్‌ గురించి తాను కొన్ని విషయాలు చెప్పాల్సి ఉందని… వైఎస్ మంచి పనులు చేశారని కితాబిచ్చారు. ఉచిత విద్యుత్‌తో పాటు అందరి ప్రాణాలు కాపాడేందుకు ఆరోగ్య శ్రీని తెచ్చారని అందుకే ఇప్పటికీ ప్రజలు వైఎస్‌ను మరిచిపోలేకపోతున్నారన్నారు. తాను, వైఎస్ మంచి స్నేహితులమని… గతంలో ఇద్దరం అనేక సార్లు ఒంటరిగా కూర్చుని మాట్లాడుకునే వారమని… అలాంటి సమయంలో జగన్‌ మూర్ఖుడు, ఎవరు చెప్పినా వినే రకం కాదని వైఎస్‌ తన వద్ద చెప్పి వాపోయారన్నారు.

వైసీపీ పెట్టే ముందు పార్టీలో చేరాల్సిందిగా తన వద్దకు జగన్ మనుషులను పంపారన్నారు. తనకూ కాస్త కులాభిమానం ఉందని.. దాంతో వైసీపీలో చేరితే ఎలా ఉంటుందని ఒక నిమిషం ఆలోచించానని.. కానీ ఆ తర్వాత వైఎస్‌ మాటలు గుర్తుకు వచ్చి వైసీపీలో చేరలేదన్నారు.

జగన్‌కు ముద్దులు తెలుసూ, గుద్దులూ తెలుసన్నారు. సుబ్రమణ్యం అన్న, సుబ్రమణ్యం అన్న నీవే నన్ను నడిపించాలి అన్న అంటూ మాట్లాడిన జగన్.. ఒకరోజు ఎడమ కాలితో తంతే సీఎస్‌గా ఉన్న వ్యక్తి వెళ్లి కుర్చీ కూడా లేని బాపట్ల కేంద్రంలో పడ్డారన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్‌ పరిస్థితీ అదేనన్నారు. పోలీసులపై తనకు గొంతు వరకు కోపం ఉండేదని… కానీ ఆలోచిస్తే పోలీసుల ఇష్టపూర్వకంగా ఏమీ రాష్ట్రంలో ఆరాచకం చేయడం లేదని, కేవలం ఉద్యోగాలు కాపాడుకునేందుకు, పై నుంచి వస్తున్న ఒత్తిడి తలొగ్గే అన్యాయాలకు పాల్పడుతున్నట్టుగా అనిపిస్తోందన్నారు. సీఎస్‌, డీజీపీ లాంటి వారినే ఎడమ కాలితో తంతుంటే ఇక కింది స్థాయి అధికారులు ఏం ప్రతిఘటిస్తారని వ్యాఖ్యానించారు.

తాను ఇప్పటి వరకు ఎన్నడూ జైలు ముఖం చూడలేదని, ఇటీవలే తనపైనా ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని… చూస్తుంటే జగన్‌ పాలనలో తనకూ జైలు జీవితం రాసి పెట్టి ఉందేమో అనిపిస్తోందన్నారు జేసీ దివాకర్ రెడ్డి. అలా జరిగినా దానికి సిద్ధపడే ఉన్నానన్నారు.

కేసులు పెట్టడం, జైలుకు పంపడం, బెదిరించడమే కాకుండా ప్రత్యర్థుల ఆర్థిక వనరులపైనా జగన్ గురి పెడుతున్నారని దివాకర్ రెడ్డి విమర్శించారు. తాను టీడీపీని తొలి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చిన వాడినేనని… రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ పూర్తిగా చచ్చిపోవడంతో టీడీపీ, వైసీపీ అనే రెండు ఆప్షన్లు మాత్రమే మిగిలాయన్నారు. ఇద్దరు నాయకులను పోల్చి చూసినప్పుడు… జగన్‌ కంటే చంద్రబాబు వెయ్యి రెట్లు బెటర్ అనిపించిందన్నారు. చంద్రబాబులోనూ లోపాలు ఉండవచ్చు కానీ.. చెబితే సరిచేసుకునే తత్వం ఉందన్నారు. మూర్ఖుడైన జగన్‌కు మాత్రం ఎవరైనా సలహాలు ఇస్తే వీడూ నాకు సలహాలు ఇచ్చేవాడేనా అని భావిస్తారని జేసీ చెప్పారు. ప్రజలు ఈసారి ఓటేసే ముందు తమ జీవితాలే కాకుండా, తమ పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి ఓటేయాలన్నారు జేసీ దివాకర్ రెడ్డి.

First Published:  21 May 2022 12:53 AM GMT
Next Story