Telugu Global
NEWS

హైదరాబాద్ నడిబొడ్డున మరో కులోన్మాద హత్య‌

హైదరాబాద్ నగరంలో మరో కులోన్మాద హత్య జరిగింది. నాగరాజు హత్య జరిగిన కొద్ది రోజుల్లోనే మరో హత్య జరగడం ఆందోళన కలిగించే అంశం. బేగం బజార్ నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా ఈ హత్య జరగడం, ఎవ్వరూ హంతకులను ఆపడానికి ప్రయత్నించక పోవడం మరింత ఆందోళన కలిగించే అంశం. పోలీసుల కథనం ప్రకారం మహేందర్‌ పర్వాన్ అనే మార్వాడీ వ్యక్తి తన కుటుంబంతో బేగంబజార్ ప్రాంతంలోని కొల్సావాడి లో ఉంటూ హోల్ సేల్ పల్లీల వ్యాపారం చేస్తూ […]

Caste-Murder
X

హైదరాబాద్ నగరంలో మరో కులోన్మాద హత్య జరిగింది. నాగరాజు హత్య జరిగిన కొద్ది రోజుల్లోనే మరో హత్య జరగడం ఆందోళన కలిగించే అంశం. బేగం బజార్ నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా ఈ హత్య జరగడం, ఎవ్వరూ హంతకులను ఆపడానికి ప్రయత్నించక పోవడం మరింత ఆందోళన కలిగించే అంశం.

పోలీసుల కథనం ప్రకారం మహేందర్‌ పర్వాన్ అనే మార్వాడీ వ్యక్తి తన కుటుంబంతో బేగంబజార్ ప్రాంతంలోని కొల్సావాడి లో ఉంటూ హోల్ సేల్ పల్లీల వ్యాపారం చేస్తూ ఉంటాడు. అతని కుమారుడు నీరజ్ పర్వాన్ కూడా ఈ వ్యాపారంలో త‍డ్రికి తోడుగా ఉంటాడు. ఉత్తర భారత దేశానికి చెందిన ఓ యాదవ కుటుంబం కూడా ఇక్కడే స్థిరపడ్డారు. వారికి సంజన అనే కూతురు ఉంది. నీరజ్, సంజన ప్రేమించుకున్నారు. అమ్మాయి తల్లితండ్రులకు తెలిసి నీరజ్ ను అనేక సార్లు బెధిరించారు. అమ్మాయిని వదిలిపెట్టకపోతే చంపేస్తామని కూడా హెచ్చరించారు.

అయినప్పటికీ వినని సంజన, నీరజ్ ల జంట గత సంవత్సరం ఆర్యసమాజ్ లో పెళ్ళి చేసుకున్నారు. కొంత కాలం అందరికి దూరంగా బతికారు. సంజన కుటుంబ‍ం నీరజ్ పై కిడ్నాప్ కేసు పెట్టగా పోలీసులు ఇరు కుటుంబాల వారికి కౌన్సిలింగ్ కూడా చేసి పంపించారు. ఈ లోపు సంజన గర్భవతి కావడంతో మళ్ళీ వారిద్దరు బేగంబజార్ కు వచ్చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వారికి మగ శిశువు జన్మించాడు. పిల్లాడు కూడా పుట్టాక సంజన తల్లితండ్రులు ఇక ఏమీ అనక పోవచ్చని భావించారు నీరజ్, సంజనలు. అయితే కక్షతో రగిలిపోతున్న సంజన కుటుంబ సభ్యులు నీరజ్ ను చంపేదుకు ప్లాన్ వేశారు.

ఐదుగురు కలిసి ఓ గ్యాంగ్ గా ఏర్పడి నీరజ్ ను అనేక రోజులు ఫాలో అయ్యారు. శుక్రవారం రాత్రి నీరజ్ తన మామ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండగా తన ఇంటికి సమీపానికి రాగానే బైక్ లతో స్కూటీపై వస్తున్న నీరజ్ ను ఢీకొట్టారు అతను కిందపడిపోగానే అతనిపై కత్తులు, రాడ్లతో దాడి చేశారు. విచక్ష‌ణా రహితంగా పొడిచారు. రాడ్లతో తీవ్రంగా కొట్టారు. పక్కనే ఉన్న ఓ గ్రానైట్‌ రాయిని నీరజ్‌పై ఎత్తేశారు. అతను చనిపోయాడని తెలుసుకున్న తర్వాతే తాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

వందలాది మంది జనం మధ్య ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే కనీసం ఒక్కరు కూడా అడ్డుచెప్పలేదు. సెల్ ఫోన్లలో వీడియోలు తీశారు కానీ వారిని వారించే ప్రయత్నం చేయలేదు.

నీరజ హత్యకు నిరసనగా వ్యాపరస్థులు ఈ రోజు బేగంబజార్ బంద్ కు పిలిపునిచ్చారు. రోడ్డుపై ధర్నా చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మార్వాడీ సమాజ్ నాయకులు డిమాండ్ చేశారు.

మరో వైపు ఏసీపీ సతీష్‌, వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, క్రైమ్‌ టీమ్‌ పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.

First Published:  20 May 2022 10:17 PM GMT
Next Story