Telugu Global
NEWS

జ‌గ‌న్ అంటే ఇష్టం.. పార్టీలో క‌ష్టం

గన్నవరం వైసీపీ నాయకత్వ బాధ్యతల విషయాన్ని అటో ఇటో తేల్చేందుకు వైసీపీ నాయకత్వం సిద్ధమైంది. ఇక్కడ మూడు గ్రూపులున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావ్ ఇటీవల సైలెంట్ అయిపోయారు. ఎక్కువగా హైదరాబాద్‌కు పరిమితం అయ్యారు. ఇక వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావు మధ్య నాయకత్వ బాధ్యతల కోసం ఫైట్ నడుస్తోంది. గడప గడపకు కార్యక్రమంలో వల్లభనేని వంశీ పాల్గొంటుండగా.. దుట్టా వర్గం మౌనంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇరుపక్షాలను వైసీపీ నాయకత్వం తాడేపల్లికి […]

జ‌గ‌న్ అంటే ఇష్టం.. పార్టీలో క‌ష్టం
X

గన్నవరం వైసీపీ నాయకత్వ బాధ్యతల విషయాన్ని అటో ఇటో తేల్చేందుకు వైసీపీ నాయకత్వం సిద్ధమైంది. ఇక్కడ మూడు గ్రూపులున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావ్ ఇటీవల సైలెంట్ అయిపోయారు. ఎక్కువగా హైదరాబాద్‌కు పరిమితం అయ్యారు. ఇక వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావు మధ్య నాయకత్వ బాధ్యతల కోసం ఫైట్ నడుస్తోంది.

గడప గడపకు కార్యక్రమంలో వల్లభనేని వంశీ పాల్గొంటుండగా.. దుట్టా వర్గం మౌనంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇరుపక్షాలను వైసీపీ నాయకత్వం తాడేపల్లికి పిలిపించింది. దుట్టా, ఆయన అల్లుడు శివభరత్ రెడ్డితో చర్చలు జరిపారు వైసీపీ పెద్దలు. అయితే వంశీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని దుట్టా స్పష్టం చేశారు.

వల్లభనేని వంశీలో కలిసి పనిచేయడం సాధ్యం కాదని దుట్టా అల్లుడు శివభరత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో జగన్‌పైనా వంశీ నోటికొచ్చినట్టు మాట్లాడారని ఆయన గుర్తు చేస్తున్నారు. ఆస్తులు కాపాడుకునేందుకే వంశీ వైసీపీలోకి వచ్చారు. వైసీపీలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ కార్యకర్తలను వంశీ వేధిస్తున్నారని శివభరత్ రెడ్డి ఆరోపించారు.

పార్టీ పెద్దలతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన దుట్టా రామచంద్రరావు.. తాము చెప్పాల్సిందిగా చెప్పామని.. మరోసారి పిలుస్తామన్నారని వెల్లడించారు. గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనకపోవడాన్ని మీడియా ప్రశ్నించగా.. మూడేళ్లుగా తాము యాక్టివ్‌గా లేని మాట వాస్తవమేనని చెప్పారు. కేవీపీ తనకు క్లాస్ మేట్ అయినప్పటికీ.. జగన్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రోజే తామూ రాజీనామా చేసి వైఎస్‌ కుటుంబం వెంట నడిచామన్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక వల్లభనేని వంశీని తీసుకొచ్చారన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోన్ చేసి వంశీని పార్టీలోకి తీసుకుంటున్నాం.. ఆయనకు పార్టీలో గౌరవం ఇవ్వాలి అంటే సరేనని చెప్పామన్నారు.

కానీ ఇటీవల వల్లభనేని వంశీ పోకడలు మారిపోయాయన్నారు. 12ఏళ్లుగా వైసీపీ కోసం పనిచేసిన వారిని పక్కన పడేసి టీడీపీ నుంచి తన వెంట వచ్చిన టీడీపీ కార్యకర్తలకు గ్రామాల్లో నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తున్నారని దుట్టా చెప్పారు. అసలైన వైసీపీ వారిని వెనక్కు నెట్టేశారన్నారు. అందుకే ఇమడలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఆత్మగౌరవం దెబ్బతిన్న తర్వాత పని చేసే మనస్తత్వం తమది కాదన్నారు.

వైఎస్‌ కుటుంబం ఎక్కడ ఉన్నా ఆ కుటుంబానికి ఉడతా భక్తిగా, సాయంగా ఉండాలనే తాము వచ్చాము గానీ..అవమానాలు భరిస్తూ మరొకరి వెంట తిరగాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ఎలాంటి అవమానాలు జరిగాయి అని ప్రశ్నించగా.. చాలానే జరిగాయి ఇప్పుడు వాటిని బయటకు చెప్పుకోలేమంటూ సమాధానం ఇచ్చారు దుట్టా రామచంద్రరావు.

First Published:  19 May 2022 8:48 PM GMT
Next Story