Telugu Global
NEWS

కోటి ఇచ్చాడు.. కేఏ పాల్‌కు జెడ్ కేటగిరి ఇస్తామన్నారు- మత్తయ్య

తెలంగాణలో కేఏ పాల్‌ చేస్తున్న హడావుడిపై క్రైస్తవ సంఘాల నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి లాభం చేసేలా కేఏ పాల్ డ్రామా ఆడుతున్నారని ఆలిండియా దళిత క్రైస్తవ సంఘాల సమైఖ్య అధ్యక్షుడు జెరూసలేం మత్తయ్య ఆరోపించారు. కేఏ పాల్ సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న సభను అడ్డుకుని తీరుతామన్నారు. క్రైస్తవులెవరూ ఆ సభకు వెళ్లవద్దని మత్తయ్య విజ్ఞప్తి చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. సదరు ప్రభుత్వం ద్వారా క్రైస్తవులు మంచి పనులు చేయించుకుంటున్నారని, కేఏ పాల్‌ […]

కోటి ఇచ్చాడు.. కేఏ పాల్‌కు జెడ్ కేటగిరి ఇస్తామన్నారు- మత్తయ్య
X

తెలంగాణలో కేఏ పాల్‌ చేస్తున్న హడావుడిపై క్రైస్తవ సంఘాల నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి లాభం చేసేలా కేఏ పాల్ డ్రామా ఆడుతున్నారని ఆలిండియా దళిత క్రైస్తవ సంఘాల సమైఖ్య అధ్యక్షుడు జెరూసలేం మత్తయ్య ఆరోపించారు. కేఏ పాల్ సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న సభను అడ్డుకుని తీరుతామన్నారు. క్రైస్తవులెవరూ ఆ సభకు వెళ్లవద్దని మత్తయ్య విజ్ఞప్తి చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. సదరు ప్రభుత్వం ద్వారా క్రైస్తవులు మంచి పనులు చేయించుకుంటున్నారని, కేఏ పాల్‌ వల్ల ఇప్పుడు క్రైస్తవులకు నష్టం జరుగుతోందన్నారు.

కేఏ పాల్‌కు తల్లిదండ్రులు పెట్టిన పేరు కిలారి ఆనంద్ అయితే.. ఇప్పుడు ఆయన కిలాడి అపహాస్యం పాల్‌గా మారిపోయారన్నారు. అడిగిన 48 గంటల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇవ్వడం, ఇక్కడ గవర్నర్‌ అపాయింట్‌మెంట్ ఇవ్వడం ఇవన్నీ చూస్తుంటే.. టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్న క్రైస్తవ ఓటు బ్యాంకును చీల్చి బీజేపీకి మంచి చేసేందుకు కేఏ పాల్ కుట్ర చేస్తున్నట్టుగా ఉందని మత్తయ్య విమర్శించారు.

కేంద్ర హోంశాఖ కార్యాలయంలోని ఒక అధికారి.. పాల్‌ నుంచి కోటి రూపాయలు తీసుకుని.. జెడ్ కేటగిరి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని ఆ విషయం తమకు తెలిసిందని మత్తయ్య చెప్పారు. జెడ్‌ కేటగిరి భద్రత ఇస్తారన్న ఉద్దేశంతో రెండు కోట్లు పెట్టి కాన్వాయ్ వాహనాలను కూడా పాల్ సిద్ధం చేసుకుంటున్నారని మత్తయ్య చెప్పారు.

2019 ఎన్నికల్లోనూ ఇలాగే ఏపీలో వైసీపీని దెబ్బతీసేందుకు, టీడీపీకి అనుకూలంగా కేఏ పాల్ రహస్య ఒప్పందంతో పనిచేశారని మత్తయ్య ఆరోపించారు. గతంలో తాను కాపుని, పవన్ కల్యాణ్ తమ్ముడు కాపు అని చెప్పిన కేఏ పాల్ కావాలంటే కాపులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసుకోవాలి గానీ.. క్రైస్తవులను అడ్డుపెట్టుకుని మాత్రం రాజకీయాలు చేయవద్దని మత్తయ్య హెచ్చరించారు. ధోరణి మార్చుకోకపోతే చాలా తీవ్ర పరిణామాలుంటాయని పాల్‌ను హెచ్చరించారు.

క్రైస్తవులపై దాడులు జరిగితే తాను రక్షణగా వస్తానని చెబుతూ క్రైస్తవుల మభ్యపెట్టేందుకు ఈ సభ పెడుతున్నారని.. తనతో ఫోటో దిగేందుకు వచ్చే క్రైస్తవ ప్రతినిధుల నుంచి ఒక్కో ఫోటోకు 50వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేస్తున్న వ్యక్తి కేఏ పాల్ అని విమర్శించారు. తనుతో ఫోటో దిగేందుకు 144 దేశాధ్యక్షులే కోరుకుంటారని, అలాంటి తనతో ఫోటో దిగాలంటే డబ్బులు చెల్లించాలని పాల్ వసూలు చేస్తున్నారని మత్తయ్య ఆరోపించారు.

First Published:  17 May 2022 9:24 PM GMT
Next Story