Telugu Global
National

అదానీ సేవలో కాంగ్రెస్ కూడా....!

చత్తీస్ గడ్ సూరజ్ పూర్ జిల్లాలో అదానీ మైనింగ్ ప్రాజెక్టు కోసం హస్డియో అటవీ ప్రాంతంలో దాదాపు 841 హెక్టార్ల అడవిలో విస్తరించి ఉన్న 2,00,000 కంటే ఎక్కువ చెట్లను నరికివేసేందుకు సిద్దమయ్యింది ప్రభుత్వం. అందులో కొంత అడవిని నరికి వేశారు కూడా. ఈ ప్రాజెక్టుకు వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది. లక్షలాది మంది ఆదివాసులు నిర్వాసితులవుతారు. ఈ కారణాలరీత్యానే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 2015 లో ఈ ప్రాజెక్టును వ్యతిరేకించారు. ఎన్నికలకు ముందు. ఈ […]

అదానీ సేవలో కాంగ్రెస్ కూడా....!
X

చత్తీస్ గడ్ సూరజ్ పూర్ జిల్లాలో అదానీ మైనింగ్ ప్రాజెక్టు కోసం హస్డియో అటవీ ప్రాంతంలో దాదాపు 841 హెక్టార్ల అడవిలో విస్తరించి ఉన్న 2,00,000 కంటే ఎక్కువ చెట్లను నరికివేసేందుకు సిద్దమయ్యింది ప్రభుత్వం. అందులో కొంత అడవిని నరికి వేశారు కూడా. ఈ ప్రాజెక్టుకు వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది. లక్షలాది మంది ఆదివాసులు నిర్వాసితులవుతారు. ఈ కారణాలరీత్యానే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 2015 లో ఈ ప్రాజెక్టును వ్యతిరేకించారు. ఎన్నికలకు ముందు. ఈ పాజెక్టును అడ్డుకోవడానికి ప్రజలతో కలిసి తాను నిలబడతానని హామీ ఇచ్చారు. ఎన్నికలు అయిపోయాయి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అదానీ కోస‍ం అడవి నరకడానికి సిద్దమైంది.

ఛత్తీస్‌గఢ్‌, సూరజ్‌పూర్ జిల్లాలో స్థానిక మహిళలు హస్దియో అరణ్యంలో మైనింగ్ ప్రాజెక్ట్ కోసం నరికేస్తున్నచెట్లను కౌగిలించుకునే ప్రచారోద్యమాన్ని ప్రారంభించారు.

ఏప్రిల్ 6న పర్సా ఈస్ట్ కేట్ బేసెన్ బొగ్గు గనుల రెండవ దశకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తుది క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత సుర్జాపూర్ జిల్లాలో చెట్ల నరికివేత మొదలైంది. రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ యాజమాన్యంలో ఉన్న రెండు ప్రాజెక్టులు అదానీ గ్రూప్ నిర్వహణలో వున్నాయి.

అటవీ అధికారులు, జిల్లా పరిపాలనాధికారులు చెట్లను నరికివేయబోతున్నారని జనార్దన్‌పూర్ గ్రామంలోని స్థానిక మహిళలకు సమాచారం తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకుని చెట్లను కౌగిలించుకుని తమ నిరసనను తెలిపారు. స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడం చూసిన వెనక్కి వెళ్లిపోయిన అధికారులు తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి వచ్చి సుమారు 300 చెట్లను నరికివేశారు,ʹ అని ఛత్తీస్‌గఢ్ బచావో ఆందోళన్ కన్వీనర్ అలోక్ శుక్లా చెప్పారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గ్రామంలో ప్రజలు చాలా కాలంగా నిరసనలు చేస్తున్నారని, మార్చి 2 నుండి నిరవధిక నిరసనలు చేస్తున్నారు. ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా, సర్గుజా, సూరజ్‌పూర్ జిల్లాల్లో హస్డియో అటవీ ప్రాంతం 1,70,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ఇది ఒక ప్రసిద్ధ వలస కారిడార్, ఏనుగులు గణనీయమైన సంఖ్యలో వున్నాయి. ఇది మహానదికి అతిపెద్ద ఉపనది అయిన హస్డియో నది పరివాహక ప్రాంతం కూడా. దాదాపు 840 ఎకరాల దట్టమైన అడవులు నాశనమై, ఈ ప్రాంతంలోని జీవవైవిధ్యంపై ప్రభావం చూపుతాయి. 2009లో ఈ ప్రాంతాన్ని మైనింగ్ చేయకూడని ప్రాంతంగా (No-Go Zone) కేంద్రం ప్రకటించినప్పటికీ, ఆ విధానం ఖరారు కాకపోవడంతో మైనింగ్ కొనసాగింది.

మూడు గ్రామాలకు చెందిన 80 శాతం మంది గ్రామస్తులు అడవిని నాశనం కాకూడదని అటవీ భూమిని మళ్లించడానికి యిస్తామన్న నష్టపరిహారాన్ని కూడా అంగీకరించలేదు. గత మూడు సంవత్సరాలుగా, పర్సా బొగ్గు బ్లాక్‌లోని బాధిత సంఘాలు నకిలీ గ్రామసభల సమస్యను క్రమం తప్పకుండా వెలుగులోకి తెస్తున్నాయి. బాధిత సముదాయం అంతా 2019 డిసెంబర్ నుంచి 75 రోజుల పాటు ధర్నాలో కూచుని, రాయ్‌పూర్‌కు 300 కి.మీ పాదయాత్రను నిర్వహించి, అడవి నరకటానికి అనుమతి నివ్వడానికి ఆధారపడిన నకిలీ గ్రామసభ సమ్మతి లేఖపై చర్య తీసుకోవాలని సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్, కలెక్టర్, ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, గవర్నర్ అనుసియా ఉయికేలను కోరారు. స్థానికుల ఒత్తిడి కారణంగా ప్రాజెక్ట్ క్లియరెన్స్ ఇవ్వడానికి అధికారులు గ్రామసభలను ఒప్పించలేక, రహస్య సమావేశం నిర్వహించి, సమ్మతి పత్రాలపై సంతకం చేయమని సర్పంచ్లు, గ్రామ పెద్దలను ఒత్తిడి చేశారు.

నకిలీ గ్రామ సభల వ్యవహారంపై విచారణ జరపాలని గవర్నర్‌ ఆదేశించారు. గ్రామసభ లేఖలు నకిలీవి అయినప్పుడు, ప్రభుత్వం స్థానికులతో మాట్లాడి వారి వాఙ్మూలంను తీసుకోవాలి. కానీ, ఇప్పటివరకు, ఈ విషయంపై దర్యాప్తు చేయలేదు. భూపేష్ బఘెల్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తాజా అనుమతులను ప్రాసెస్ చేయడానికి తొందరపడుతోంది.

గ్రామ సభల అనుమతి లేకుండా , గ్రామస్తులకు తెలియకుండా అడవిని నరికివేసే ప్రక్రియను రాష్ట్రప్రభుత్వం వేగవంత చేసింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో 300 చెట్లను కోల్పోయిన గ్రామస్థులు ఇప్పుడు రాత్రిపూట నిఘా ఉంచాలని, ఇతరులతో ఫోన్‌ సంపర్కంలో వుండాలనుకుంటున్నారు. పగటిపూట ప్రజలు ఉండడం గమనించిన అధికారులు చెట్ల నరికివేతను ఆపారు. ”కానీ ఇప్పుడు రాత్రిపూట అడవిని నరికి వేస్తారేమోనని భయంగా ఉంది. కొంతమందిమి యిక్కడనే వుండి, వారు గొడ్డళ్లతో రాగానే మిగతా వాళ్ళకి తెలియచేస్తాం. చెట్లు నరికేందుకు వస్తున్నారని స్థానికులకు అధికారులు ఎలాంటి సమాచారం యివ్వలేదు, ప్రజలు నిరసన తెలిపితే కనక అధికారులు వారికి నచ్చచెప్పి వెనక్కు వెళ్ళేలా చేయాలనుకున్నారు. ఈ అడవి ఇక్కడి ఆదివాసీలకు జీవనాధారం. ఎట్టి పరిస్థితులలోనైనా రక్షించుకొంటాం. మా సమ్మతి లేకుండా ఈ ప్రాజెక్ట్‌‌కు క్లియరెన్స్ యిచ్చారు. కానీ వారిని ముందుకు వెళ్లనీయం’ʹ అని గ్రామస్తులు అంటున్నారు.

మరో వైపు దేశవ్యాప్తంగా పర్యావరణ స్పృహ ఉన్నవాళ్ళు ‘సేవ్ హస్దేవ్’ అనే నినాదంతో ఉద్యమాన్ని మొదలు పెట్టారు. తాను ఇచ్చిన హామీని రాహుల్ గాంధీ నిలబెట్టుకోవాలని స్థానిక ప్రజలే కాక పర్యవరణవేత్తలు కోరుతున్నారు.

అదానీ కోసం బీజేపీ దేశాన్ని దోచి పెడుతోందని ఆరోపణలు గుప్పిస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలో ఉన్న చోట అదానీ కోసం ప్రజలను నిర్వాసితులను చేయడం, అడవిని నరికి పర్యావరణాన్ని నాశనం చేయడమేంటని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు.

First Published:  18 May 2022 1:18 AM GMT
Next Story