Telugu Global
National

గుర్రంపై ఊరేగినందుకు దళితుల‌ వివాహ ఊరేగింపుపై కులోన్మాదుల దాడి

  మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలోని పిపల్యకలన్ గ్రామంలో ఆదివారం రాత్రి దళితుల వివాహ ఊరేగింపుపై అగ్రకుల గుంపు దాడికి పాల్పడింది. ఆ ఊరేగింపు భద్రత కోసం పోలీసులు మోహరించి ఉన్నప్పుడే ఈ దాడి జరగింది. ఇదే గ్రామంలో మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించి కుల, మత సమానత్వం గురించి ప్రచారం చేశారు. ఓ గిరిజన మహిళ ఇచ్చిన బెర్రీలు తిని అన్ని కులాలు సమానత్వంతో, వివక్ష లేకుండా జీవించాలని ఆయన పిలుపునిచ్చారు. […]

గుర్రంపై ఊరేగినందుకు దళితుల‌ వివాహ ఊరేగింపుపై కులోన్మాదుల దాడి
X

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలోని పిపల్యకలన్ గ్రామంలో ఆదివారం రాత్రి దళితుల వివాహ ఊరేగింపుపై అగ్రకుల గుంపు దాడికి పాల్పడింది. ఆ ఊరేగింపు భద్రత కోసం పోలీసులు మోహరించి ఉన్నప్పుడే ఈ దాడి జరగింది.

ఇదే గ్రామంలో మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించి కుల, మత సమానత్వం గురించి ప్రచారం చేశారు. ఓ గిరిజన మహిళ ఇచ్చిన బెర్రీలు తిని అన్ని కులాలు సమానత్వంతో, వివక్ష లేకుండా జీవించాలని ఆయన పిలుపునిచ్చారు.

అదే గ్రామంలో ఆదివారం రాత్రి ఈ దాడి జరిగింది. తన సోదరి వివాహానికి భద్రత కల్పించాలని దీపక్ మేఘ్వాల్ అనే వ్యక్తి పోలీసుల సహాయం కోరాడు. దాంతో పోలీసుల పహరా మధ్య ఊరేగింపు నిర్వహించారు ఆ దళిత కుటింబీకులు. అయితే పొరుగున ఉన్న ఛపెడా గ్రామం నుండి ఊరేగింపు పిపల్యకలన్ గ్రామంలో కి రాగానే ఓ గుంపు ఆ ఊరేగింపుపై రాళ్లతో దాడి చేసింది. అతిథుల కోసం ఏర్పాటు చేసిన టెంట్‌లను కూల్చివేశారు. ఆ గుంపును చెదరగొట్టడానికి, పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాల్సి వచ్చింది.

ఈ ఘటనపై రాజ్‌గఢ్ పోలీసు సూపరింటెండెంట్ ప్రదీప్ శర్మ మాట్లాడుతూ… ”ఊరేగింపు అక్కడికి చేరుకోకుండా గుంపు రాళ్ల దాడి చేయడమే కాక వివాహ వేదికకు వెళ్లే రహదారిని కూడా బ్లాక్ చేసింది. పోలీసు రక్షణలో వివాహం జరిగింది.” అని చెప్పారు.

దళితులపై దాడికి పాల్పడ్డ డాంగి కమ్యూనిటీకి చెందిన 35 మంది నిందితులలో ఐదుగురిని అరెస్టు చేసి అల్లర్లు, నేరపూరిత బెదిరింపులు, షెడ్యూల్డ్ కులం మరియు షెడ్యూల్డ్ తెగ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రెండు రోజుల క్రితం మరో దళిత కుటుంబం పెళ్లి ఊరేగింపుకు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని డాంగి వర్గానికి చెందిన ఒకరు తెలిపారు. “కానీ ఛపెడా గ్రామానికి చెందిన వరుడు రాహుల్ మేఘ్వాల్ వారిపై జరుగుతున్న వివక్ష గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, గ్రామస్తులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడని అందుకే కోపంతో ఉన్న గ్రామస్థులు అతని పెళ్లి ఊరేగింపుపై దాడి చేశారు.” అని చెప్పాడు.

చాలా కాలంగా తనకు బెదిరింపులు వస్తున్నాయని, అందుకే తనకు రక్షణ కల్పించాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని రాహుల్ మేఘ్వాల్ అన్నారు.తాను గుర్రం మీద ఊరేగినందుకే తమపై అగ్రవర్ణాల వారు దాడి చేశారని ఆయన అన్నారు.

దళితుల పెళ్ళి ఊరేగింపులపై అగ్రకులాల దాడులు ఒక్క మధ్యప్రదేశ్ కే పరిమితం కాలేదు. ఉత్తర భారతంలో అనేక రాష్ట్రాల్లో దళితుల పెళ్ళి ఊరేగింపులపై అనేక సార్లు దాడులు చేస్తున్నారు. ఇటువంటి ఘటనలపై ఎన్ని కేసులు నమోదు చేసినా, అరెస్టులు జరిగినా అగ్రకులోన్మాదులు దాడులు మాత్రం ఆపడం లేదు.

First Published:  16 May 2022 9:13 AM GMT
Next Story