Telugu Global
Cinema & Entertainment

తెలుగు దర్శకులు అటు.. తమిళ దర్శకులు ఇటు..!

ఒక భాషలో దూసుకుపోతున్న దర్శకుడితో మిగతా భాషల్లో కూడా సినిమాలు చేయించడం మొదటి నుంచి ఉంది. ఏళ్లు గడిచినా ఈ పంథా ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం పలువురు తెలుగు దర్శకులు తమిళ హీరోలతో సినిమాలు చేస్తుండగా, తమిళ దర్శకులు కూడా తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్నారు. మున్నా సినిమాతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమైన వంశీ పైడిపల్లి ఆ తర్వాత వరుసగా అగ్రహీరోలతో సినిమాలు చేస్తూ టాప్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన దిల్ రాజు […]

తెలుగు దర్శకులు అటు.. తమిళ దర్శకులు ఇటు..!
X

ఒక భాషలో దూసుకుపోతున్న దర్శకుడితో మిగతా భాషల్లో కూడా సినిమాలు చేయించడం మొదటి నుంచి ఉంది. ఏళ్లు గడిచినా ఈ పంథా ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం పలువురు తెలుగు దర్శకులు తమిళ హీరోలతో సినిమాలు చేస్తుండగా, తమిళ దర్శకులు కూడా తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్నారు. మున్నా సినిమాతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమైన వంశీ పైడిపల్లి ఆ తర్వాత వరుసగా అగ్రహీరోలతో సినిమాలు చేస్తూ టాప్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నాడు.

ప్రస్తుతం ఈయన దిల్ రాజు నిర్మాణంలో తమిళ అగ్ర హీరో విజయ్ తో ఒక సినిమా ప్రారంభించాడు. రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో తమిళంలో పేరు తెచ్చుకున్న విజయ్ తెలుగులో ఒక డైరెక్ట్ మూవీలో నటించడం ఇదే తొలిసారి. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలిప్రేమ సినిమాతో వరుణ్ తేజ్ తో ప్రేమ కథ చేసిన యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ప్రముఖ తమిళ కథానాయకుడు ధనుష్ తో ‘సార్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొన్ని షెడ్యూళ్లను కూడా పూర్తి చేసుకుంది.

జాతి రత్నాలు సినిమాతో బిగ్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ అనుదీప్ కూడా మరో తమిళ ప్రముఖ హీరో శివ కార్తికేయన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇక తెలుగులో మొదటి నుంచి తమిళ డైరెక్టర్ల హవా కొనసాగుతూనే ఉంది. కొన్నేళ్ల కిందటి వరకు తమిళ దర్శకులతో సినిమాలు చేసేందుకు తెలుగు హీరోలు ఆసక్తి చూపేవారు.

2000 దశకంలో తెలుగులో తమిళ డైరెక్టర్ల హవా బాగా సాగింది. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు తెలుగులో తమిళ దర్శకులకు అంత డిమాండ్ లేదు. అయినప్పటికీ కొందరు తమిళ దర్శకులతో తెలుగు హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం తమిళ మాస్ చిత్రాల దర్శకుడు లింగుస్వామితో ది వారియర్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై తెలుగులో భారీగానే అంచనాలు ఉన్నాయి.

ఇక తమిళ అగ్ర దర్శకుడు శంకర్ తెలుగులో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఒక భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. తెలుగులో ఎక్కడికి పోతావు చిన్నవాడా, టైగర్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన తమిళ డైరెక్టర్ వీఐ ఆనంద్ ఇప్పుడు తెలుగులో మరో సినిమా చేస్తున్నాడు. యువ హీరో సందీప్ కిషన్ తో కలిసి ఊరి పేరు భైరవకోన అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు, రామారావు ఆన్ డ్యూటీ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత ఆయన ప్రముఖ తమిళ డైరెక్టర్ బాలాజీ మోహన్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఇలా తెలుగు దర్శకులు పలువురు తమిళ హీరోలతో సినిమాలు చేస్తుండగా, తమిళ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్నారు.

First Published:  16 May 2022 8:07 AM GMT
Next Story