Telugu Global
National

కాంగ్రెస్ దారిలో బీజేపీ

సైద్ధాంతికంగా రెండు పార్టీలు ఉత్తర, దక్షిణ ధృవాలు. కానీ రాజకీయంగా రెండూ రెండే. తేడా లేదు. కాంగ్రెస్ పార్టీకి విరుద్ధ భావజాలంతో పనిచేసే బీజేపీ చేస్తున్నదేమిటి? బీజేపీ కూడా సరిగ్గా కాంగ్రెస్ ‘చెప్పుల్లో’ కాళ్ళుపెట్టి ప్రయాణిస్తున్నది. ముఖ్యమంత్రులను ఎడా పెడా మార్చిపారేసి కాంగ్రెస్ పూర్వ రికార్డులను తిరగ రాయాలనుకుంటున్నది. గుజరాత్, ఉత్తరాఖండ్, కర్నాటక, త్రిపుర రాష్ట్రాల ముఖ్యమంత్రులను మార్చేశారు. శాసనసభ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కూడా మార్చాలనుకున్నా ఆర్ఎస్ఎస్ వంటి హిందుత్వ […]

కాంగ్రెస్ దారిలో బీజేపీ
X

సైద్ధాంతికంగా రెండు పార్టీలు ఉత్తర, దక్షిణ ధృవాలు. కానీ రాజకీయంగా రెండూ రెండే. తేడా లేదు. కాంగ్రెస్ పార్టీకి విరుద్ధ భావజాలంతో పనిచేసే బీజేపీ చేస్తున్నదేమిటి? బీజేపీ కూడా సరిగ్గా కాంగ్రెస్ ‘చెప్పుల్లో’ కాళ్ళుపెట్టి ప్రయాణిస్తున్నది. ముఖ్యమంత్రులను ఎడా పెడా మార్చిపారేసి కాంగ్రెస్ పూర్వ రికార్డులను తిరగ రాయాలనుకుంటున్నది. గుజరాత్, ఉత్తరాఖండ్, కర్నాటక, త్రిపుర రాష్ట్రాల ముఖ్యమంత్రులను మార్చేశారు. శాసనసభ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కూడా మార్చాలనుకున్నా ఆర్ఎస్ఎస్ వంటి హిందుత్వ సంస్థల ఒత్తిడి కారణంగా చివరి నిముషంలో ఆ నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్ ఉపసంహరించుకున్నది.

గతంలో తరచూ ముఖ్యమంత్రులను మారుస్తుందన్న అపవాదు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సొంతం.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1978-83 మధ్య కాలంలో ఒక టర్మ్ లోనే మర్రి చెన్నారెడ్డి,అంజయ్య, భవనం వెంకట్రామిరెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రులయ్యారు.1989-94 టర్మ్ లో అదే పరిస్థితి ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి పనిచేశారు.డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అత్యంత శక్తివంతమైన నాయకుడు కనుక 2004 నుంచి 2009 లో మరణించే వరకు వరకు ఆయనే సీఎంగా కొనసాగగలిగారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మారని టరం వైఎస్ హయాం ఒక్కటే. వైఎస్ దుర్మరణం తర్వాత కూడా కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులు ఏపీని పాలించారు.

ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను తరచూ మార్చేవారు. పార్టీ అధిష్ఠానం అడుగులకు మడుగులొత్తకపోతే ముఖ్యమంత్రులను రాత్రికి రాత్రి మార్చేసేవారు.ఢిల్లీ నుంచి పరిశీలకులు సీల్డ్ కవర్‌తో రాష్ట్ర రాజధానికి వెళ్లడం, శాసనసభ్యులతో సంప్రదింపుల నాటకం ఆడడం, చివరకు అధిష్ఠానం అనుకున్న వ్యక్తి పేరును ప్రకటించేవారు. 1971–1977, 1980–89ల మధ్య ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులను కాంగ్రెస్ అధిష్ఠానం 9 సార్లు మార్చింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాజస్థాన్, గుజరాత్, బిహార్ తదితర రాష్ట్రాల్లోనూ ఇదే తతంగం కొనసాగింది. ఈ సంస్కృతి వల్ల పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ 1977లో కాంగ్రెస్ నుంచి నిష్క్రమించి తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారు.మహారాష్ట్రలో శరద్ పవార్ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు.ఉత్తరప్రదేశ్ లో కాన్షీరామ్ బహుజనసమాజ్ పార్టీ ఏర్పాటు తర్వాత సామాజిక సమీకరణాలు పూర్తిగా మారిపోయినవి. కాంగ్రెస్ పార్టీ తన తప్పిదాలు, వైఫల్యాలు, ఆధిపత్య పోకడలతో గుజరాత్, బీహార్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లలో పత్తా లేకుండా పోయింది.

ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ సంస్కృతిని వంటబట్టించుకుంటున్నది.ఆ పార్టీ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ ను తొలగించి పుష్కర్ సింగ్ దామీకి పట్టంగట్టింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్పను మార్చి బొమ్మైకి కట్టబెట్టారు. యడియూరప్పకు కావలసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఆర్ బొమ్మై వారసుడు బసవరాజు బొమ్మైకి ముఖ్యమంత్రి పదవి వరించింది.యడ్యూరప్ప నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.జనసంఘ్ కాలం నుంచి వివిధ హోదాల్లో సేవలందించి, బిజెపితో దశాబ్దాల అనుబంధాన్ని పెనవేసుకున్న కాకలుతీరిన నాయకుడు యడియూరప్ప.వాజ్ పెయి, అడ్వానీ తరంలో ఒక్కొక్కరికీ ఉద్వాసనల పర్వంలో భాగంగా యడియూరప్పకు సాగనంపారు.

గుజరాత్ ముఖ్యమంత్రి పదవి లభించే సంగతి భూపేంద్ర పటేల్ కు చివరి క్షణం వరకు తెలియదు. బిజెపి శాసనసభా పక్ష సమావేశంలో ఢిల్లీ నుంచి వచ్చిన పార్టీ పరిశీలకులు ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తారని భూపేంద్ర ఊహించని సన్నివేశం.భూపేంద్ర పటేల్‌ను అతి రహస్యంగా ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి పదవి నుంచి ఆకస్మికంగా దిగవలసి వస్తుందని విజయ్ రూపానీకి కూడా తెలియదు.ఆ మేరకు ప్రధాని మోడీ,కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు.

ఒక జాతీయపార్టీ పూర్తిగా ఒక వ్యక్తి చేతుల్లో ‘బందీ’గా మారితే రాష్ట్రాల్లో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఎంత బూటకంగా మారుతుందో ఇదివరకు ఇందిరాగాంధీ చూపారు.ఇప్పుడు మోడీ హయాంలో ఆ పరిస్థితిని చూస్తున్నాం.1982లో హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టులో నాట్ ఏపీ ముఖ్యమంత్రి అంజయ్యను రాజీవ్‌గాంధీ ఎట్లా అవమానించారో ప్రధాని మోదీ పార్లమెంట్‌లో చెప్పారు. ఆ తర్వాత కూడా అనేక ప్రసంగాల్లో కాంగ్రెస్ సంస్కృతికి లోను కావద్దని బీజేపీ కార్యకర్తలకు మోడీ హితవు చెప్పారు. ఏడు దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిన సంస్కృతిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎనిమిదేండ్లలోనే సంవత్సరాల పాలనలో సంపూర్ణంగా అలవరచుకున్నారు.

మూడుసార్లు ముఖ్యమంత్రులను ఎంపిక చేసి గుజరాత్ ప్రజలపై రుద్దిన తీరు కాంగ్రెస్ సంస్కృతి కాక మరేమవుతుంది? పార్టీ శాసనసభ్యుల అభిప్రాయానికి విలువ లేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నియమితుడయ్యే వ్యక్తికి ప్రజాదరణ ఉండాలని, బలమైన,అనుభవం గల,అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడయి ఉండాలని ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ భూపేంద్ర పటేల్ నియామకానికి కొద్దిసేపటి ముందు అన్నారు. ఆయన ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.పలు మంత్రిత్వశాఖల్ని నిర్వహించిన అనుభవం ఉన్నది. కానీ నితిన్ పటేల్‌కు సీఎం పదవి వరించలేదు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి , మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ అనుయాయుడు భూపేంద్ర పటేల్‌ను పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి కీలక అంశాలపై స్వంత నిర్ణయాలు తీసుకోలేరని, ఆయన ఢిల్లీ పెద్దల్ని సంప్రదించాల్సిందే అని గుజరాత్ లోని ఉన్నతాధికారులు చెబుతున్న మాట. భూపేంద్ర పటేల్ కూడా రబ్బరు స్టాంప్ ముఖ్యమంత్రి. అంజయ్యను అవమానించి, తొలగించడం వల్ల తెలుగు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టు విమర్శించిన మోదీకి గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో గుజరాతీల ఆత్మగౌరవం గుర్తురాలేదు. మన్మోహన్ సింగ్‌ను కీలుబొమ్మ ప్రధానమంత్రిగా విమర్శలు గుప్పించిన వాండ్లే ‘కీలుబొమ్మ ముఖ్యమంత్రుల’ను నియమిస్తుండడం ఒక విషాదం. ఉత్తరాఖండ్‌లో నాలుగునెలల్లో ఇద్దరు ముఖ్యమంత్రుల్ని మార్చారు. అస్సాంలో సర్బానంద సోనోవాల్ స్థానంలో హిమంత బిశ్వాస్‌ను నియమించారు.శాసనసభ్యుల అభిప్రాయసేకరణ జరపకుండా’ తమ మనిషి ‘ ని ముఖ్యమంత్రిగా నియమించే సంస్కృతి బీజేపీలో వేగంగా విస్తరిస్తున్నది.

మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఢిల్లీలో బిజెపి అధిష్టానాన్ని ఖాతరు చేయలేదు.తాను ఢిల్లీ పీఠాన్ని అధిష్టించిన తర్వాత ‘సర్వం తానే అయి’ వ్యవహరిస్తున్నారు.అసోంలో బిజెపిని రెండోసారి ప్రజలు ఎన్నుకున్నారు. మోదీ అస్సాం బిజెపి శాసనసభా పార్టీ అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా సోనోవాల్ బదులు హిమంత బిశ్వాస్ శర్మను ముఖ్యమంత్రిగా నియమించారు. హిమంత బిశ్వాస్ శర్మ కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన తిరుగుబాటు నాయకుడు.

రాష్ట్రాల్లో బిజెపిని బలోపేతం చేసిన ముఖ్యమంత్రులలో మధ్యప్రదేశ్,రాజస్థాన్,గోవా,కర్ణాటక,బీహార్ లకు చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే, మనోహర్ ఫరిక్కర్, యడ్యూరప్ప,సుశీల్ మోడీ వంటి వారు పాపులర్ నాయకులు.అయితే వీరంతా ఆడ్వాణీ ప్రోత్సహించిన నాయకులు.మోదీ ప్రధాని అయ్యాక వారి ‘పట్టు’ను నీరుకార్చే ప్రయత్నం చేశారు.ప్రత్యామ్నాయంగా బలమైన, ప్రతిభ గల ప్రజా నాయకులను నియమించకుండా తమ ‘విధేయుల’క పదవులిస్తున్నారు.గుజరాత్‌లో మోదీ విధేయురాలు ఆనందీబెన్ పటేల్ ‘పటీదార్ల’ ఉద్యమంతో తప్పుకోవలసి వచ్చింది. విజయ్ రూపానీ కొవిడ్ రెండో ప్రభంజనం సమయంలో అసమర్థ ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు. జార్ఖండ్‌లో రఘుబర్ దాస్ అధికారం కోల్పోయారు.ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించకుండా తానే ప్రధాన సారథిగా ప్రచారరంగంలోకి దిగడం పూర్వ కాంగ్రెస్ ‘ఫార్ములా’.గెలిస్తే క్రెడిట్ మోడీది.ఓటమిపాలయితే స్థానిక నాయకత్వ వైఫల్యం!!

కాగా కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ,రాజీవ్ హయాం తర్వాత ‘హైకమాండ్’ బలంగా లేకపోయినా స్థానిక నాయకత్వ బలం వల్ల ఆ పార్టీ నిలదొక్కుకోగలుగుతోంది.బీజేపీలోనూ మోదీ హవా ఆయన ఆకర్షణ కొనసాగినంత కాలమే.రాష్ట్రాల్లో బలహీనులు, కీలుబొమ్మ నాయకులను ప్రోత్సహిస్తే అధిష్టానం బలహీనమైనప్పుడు సరిగ్గ ఇప్పుడు కాంగ్రెస్ ఎదుర్కుంటున్న సంక్షోభ పరిస్థితి బీజేపీకి కూడా నిస్సందేహంగా ఎదురవుతుంది.

First Published:  15 May 2022 10:32 PM GMT
Next Story