Telugu Global
National

పేదరికాన్ని జయించి.. కష్టాలు అధిగమించి.. భారత హాకీ మెరుపుతీగ ముంతాజ్ !

భారత మహిళా హాకీలోకి ఉత్తరప్రదేశ్ లోని నిరుపేద కుటుంబం నుంచి ఓ మెరుపుతీగ దూసుకొచ్చింది. దక్షిణాఫ్రికా వేదికగా ముగిసిన 2022 ప్రపంచ జూనియర్ మహిళల హాకీలో ప్రకంపనలు సృష్టించింది. ప్రపంచ అత్యుత్త‌మ క్రీడాకారిణి అవార్డు గెలుచుకొని దేశానికే గర్వకారణంగా నిలిచింది. 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ముంతాజ్ జీవితం వడ్డించిన విస్తరి ఏమాత్రం కాదు.. భారత హాకీతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అవినాభావ సంబంధం ఉంది. పురుషుల, మహిళల విభాగాలలో ఎందరో గొప్ప గొప్ప క్రీడాకారులను […]

పేదరికాన్ని జయించి.. కష్టాలు అధిగమించి.. భారత హాకీ మెరుపుతీగ ముంతాజ్ !
X

భారత మహిళా హాకీలోకి ఉత్తరప్రదేశ్ లోని నిరుపేద కుటుంబం నుంచి ఓ మెరుపుతీగ దూసుకొచ్చింది. దక్షిణాఫ్రికా వేదికగా ముగిసిన 2022 ప్రపంచ జూనియర్ మహిళల హాకీలో ప్రకంపనలు సృష్టించింది. ప్రపంచ అత్యుత్త‌మ క్రీడాకారిణి అవార్డు గెలుచుకొని దేశానికే గర్వకారణంగా నిలిచింది. 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ముంతాజ్ జీవితం వడ్డించిన విస్తరి ఏమాత్రం కాదు.. భారత హాకీతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అవినాభావ సంబంధం ఉంది. పురుషుల, మహిళల విభాగాలలో ఎందరో గొప్ప గొప్ప క్రీడాకారులను అందించిన ఘనత ఉంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నుంచి అంతర్జాతీయ మహిళాహాకీ తెరమీదకు వచ్చిన టీనేజ్ సంచలనం ముంతాజ్ ఖాన్ గురించే ఇప్పుడు అందరూ చర్చించుకొంటున్నారు.

పేదరికాన్ని జయించి..
ఒలింపిక్స్ లో మనదేశానికి ఎనిమిది బంగారు పతకాలు సంపాదించిపెట్టిన భారత హాకీ క్రీడలో ఓ వెలుగు వెలిగిన చాంపియన్ క్రీడాకారుల కథలు, వెతలు ఒకేతీరుగా ఉంటాయి. అయితే నవతరం యువతి ముంతాజ్ జీవితమూ దానికి భిన్నమైనది ఏమాత్రం కాదు. లక్నో నగరంలోని తోప్ కానా బజార్ ప్రాంతంలో నివసించే తొమ్మిదిమంది సభ్యుల ఓ నిరుపేద కుటుంబంలో నాలుగో సంతానమే ముంతాజ్ ఖాన్. ఆమె తల్లిదండ్రులు హపీజ్ ఖాన్, కైజర్ జహాన్ తమ కుటుంబాన్ని పోషించడానికి కూరగాయల బండినే నమ్ముకొన్నారు. రెండుపూటలా కడుపునిండా భోజనం లేకున్నా తన ఆరుగురు తోబుట్టువులతో కలసి పెరిగిన ముంతాజ్ కు బాల్యం నుంచి ఆటలంటే చెప్పలేని ఇష్టం. వీధివీధి తిరుగుతూ కూరగాయలు అమ్మే తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూనే పదేళ్ల వయసులోనే హాకీస్టిక్ చేతబట్టింది.

రహస్యంగా సాధన..
హాకీ ఫీల్డ్ లో ముంతాజ్ మెరుపువేగంతో పరుగెడుతూ స్టిక్ తో బంతిని నియంత్రించిన తీరు చూసిన అక్కడి శిక్షకుడు ముచ్చటపడిపోయారు. అమ్మానాన్నలకు తెలియకుండా రహస్యంగా సాధన చేస్తూ వచ్చిన ముంతాజ్ కు లక్నోలోని కేడీ సింగ్ బాబు స్టేడియంలోని స్పోర్ట్స్ హాస్టల్ లో చేరే అవకాశం వచ్చింది. అయితే అమ్మనాన్నలు తీవ్రంగా నిరుత్సాహపరచినా.. తన అక్క ప్రోద్భలంతో దరఖాస్తు పూర్తి చేసి.. హాస్టల్ లో ప్రవేశం సంపాదించింది. ఓవైపు చదువు, మరోవైపు హాకీలో సాధన చేయటంలో ముంతాజ్ సఫలమయ్యింది. స్పోర్ట్స్ హాస్టల్ జీవితం పదేళ్ల చిన్నారిలో పట్టుదలను పెంచింది. హాకీ ఆటలో రాణించాలన్న తపన ముందుకు తీసుకువెళ్లింది. కొద్దిమాసాల శిక్షణతోనే ఉత్తరప్రదేశ్ సబ్ జూనియర్ జట్టులో చోటు సంపాదించింది. సబ్ జూనియర్ స్థాయిలో సత్తా చాటుకోడం ద్వారా యూపీ జూనియర్ జట్టులో కీలక సభ్యురాలిగా మారిపోయింది. ఛ‌త్తీస్ ఘడ్ వేదికగా జరిగిన 2014 జూనియర్ నేషనల్స్ లో పాల్గొనే అవకాశం దక్కినా వయసు తక్కువంటూ ముంతాజ్ ను పక్కనపెట్టారు. అయినా నిరాశపడకుండా తన సాధన కొనసాగించింది. 2017లో నిర్వహించిన జాతీయ జూనియర్ శిక్షణ శిబిరంలో పాల్గొనడం ద్వారా ముంతాజ్ తన ఆటకు మరింత పదును పెట్టుకొంది.

బంగారు పతకంతో..
2018 లో జరిగిన ప్రపంచ యువజన ఒలింపిక్స్ లో భాగంగా నిర్వహించిన హాకీ (ఫైవ్- ఏ- సైడ్ )లో బంగారు పతకం సాధించడంతో ముంతాజ్ జీవితమే మారిపోయింది. తమ కూతురు సాధించిన ఘనతను చూసి కుటుంబసభ్యులు మురిసిపోయారు. దక్షిణాఫ్రికాలోని పోచెఫ్స్ స్ట్రోమ్‌ వేదికగా జరిగిన 2022 ప్రపంచ జూనియర్ మహిళల హాకీ పోటీలలో పాల్గొనే అవకాశం ముంతాజ్ కు దక్కింది. సెమీఫైనల్లో చోటు కోసం జరిగిన పోటీలో దక్షిణ కొరియాను 3-0తో చిత్తు చేయడంలో ముంతాజ్ ప్రధానపాత్ర వహించింది. కాంస్య పతకం కోసం ఇంగ్లండ్ తో జరిగిన పోరులో ముంతాజ్ రెండుగోల్స్ సాధించినా భారత్ కు 2-5 తో ఓటమి తప్పలేదు. భారత్ నాలుగోస్థానంతో సరిపెట్టుకొన్నా ముంతాజ్ కు అత్యుత్తమ ప్లేయర్ అవార్డు దక్కింది. రానున్న రోజుల్లో ముంతాజ్ ఇదేజోరు కొనసాగించగలిగితే..భారత సీనియర్ జట్టులో చోటుతో పాటు..ఇండియన్ రైల్వేస్ లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించడం ఖాయంగా కనిపిస్తోంది.

First Published:  15 May 2022 1:55 AM GMT
Next Story