Telugu Global
NEWS

"సర్కారు వారి పాట"కు మద్దతుగా రంగంలోకి జగన్ మీడియా

మహేష్‌ బాబు హీరోగా వచ్చిన సర్కారు వారి పాట చిత్రం.. జగన్ ప్రత్యర్థులకు టార్గెట్‌గా మారింది. ఈ సినిమా కథ జగన్‌ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునేలా, డైలాగులు పవన్‌ కల్యాణ్‌ను హేళన చేసేలా ఉన్నాయంటూ ఒక వర్గం మీడియా తొలి రోజు నుంచే ప్రచారం మొదలుపెట్టింది. ”నేను విన్నాను.. నేను ఉన్నాను” అన్న డైలాగ్‌ గతంలో జగన్‌ ఎక్కువగా చెప్పే వారు. ఆ డైలాగ్‌ను ఈ సినిమాలో మహేష్‌ బాబుతో చెప్పించడంతో జగన్ ప్రత్యర్థులకు మరింత కోపం […]

సర్కారు వారి పాటకు మద్దతుగా రంగంలోకి జగన్ మీడియా
X

మహేష్‌ బాబు హీరోగా వచ్చిన సర్కారు వారి పాట చిత్రం.. జగన్ ప్రత్యర్థులకు టార్గెట్‌గా మారింది. ఈ సినిమా కథ జగన్‌ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునేలా, డైలాగులు పవన్‌ కల్యాణ్‌ను హేళన చేసేలా ఉన్నాయంటూ ఒక వర్గం మీడియా తొలి రోజు నుంచే ప్రచారం మొదలుపెట్టింది. ”నేను విన్నాను.. నేను ఉన్నాను” అన్న డైలాగ్‌ గతంలో జగన్‌ ఎక్కువగా చెప్పే వారు. ఆ డైలాగ్‌ను ఈ సినిమాలో మహేష్‌ బాబుతో చెప్పించడంతో జగన్ ప్రత్యర్థులకు మరింత కోపం తెప్పించింది.

ఈ నేపథ్యంలో సినిమా విడుదలైన తొలిరోజే ఒక మీడియా సంస్థ.. సర్కారు వారి పాట సినిమా ప్లాప్ అంటూ ప్రచారం చేసింది. పైగా సీఎం జగన్‌ను కలిసిన ముగ్గురు హీరోల సినిమాలు విఫలమయ్యాయంటూ రాధేశ్యామ్, ఆచార్య, సర్కారు వారి పాట చిత్రాల పేర్లను చెప్పింది. సోషల్ మీడియాలోనూ ఇదే తరహా ప్రచారం నడిచింది. ఈ ప్రచారానికి వ్యతిరేకంగా జగన్‌ మీడియా చానల్‌ చర్చ పెట్టింది.

సీఎంను కలిస్తే సినిమా ప్లాప్‌ అని ఎలా చెబుతారని ఆ చానల్ ప్రశ్నించింది. చర్చా కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర పరిశ్రమ వ్యక్తులు వారి అభిప్రాయాలను పంచుకున్నారు.

వీరశంకర్.. దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు..
మీడియా తప్పు చేస్తే మరో మీడియా ఎత్తిచూపదు. దానిపై చర్చ పెడుతున్నందుకు సాక్షికి అభినందనలు. సర్కారు వారి పాట చిత్రానికి తొలిరోజే 42 కోట్లు వచ్చింది. సాయంత్రమే వ్యతిరేకంగా కథనం వేశారు. అంటే ముందుగానే కథనం సిద్ధం చేసుకున్నట్టుగా ఉంది. ముందే కథనం రెడీ చేసుకుని వేయడమే కాకుండా.. ముఖ్యమంత్రిని కలవడం వల్లే మూడు సినిమా ప్లాప్‌ అయ్యాయి అని చెప్పడం సిల్లీగా ఉంది. మరి రాజమౌళి కూడా కలిశారు కదా. ఆర్‌ఆర్‌ఆర్‌ విజయవంతమైంది కదా. వైసీపీతో పడకపోతే సున్నితమైన సినిమాను టార్గెట్ చేయడం ఏంటి ?. హీరోల మధ్య గొడవపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మంచి ఉద్దేశంతో వచ్చిన సినిమాను ప్రోత్సహించాలే కానీ.. సీఎంను కలిస్తే ఫెయిల్ అవుతుందని మీడియా ప్రచారం చేయడం సరికాదు. తొలి రోజే 42 కోట్లు వచ్చిన సినిమా ఫ్లాప్‌ అని ఎలా చెబుతారు?

ఖాదర్‌ గోరి, అలిండియా కృష్ణ, మహేష్‌బాబు ఫ్యాన్స్‌ అసోసియేషన్
ప్రతి ఒక్కరూ సినిమా బాగుంది అంటున్నారు. ఎల్లో మీడియా కావాలని ముందు నుంచే సీఎంను కలిస్తే ఇలా అవుతుందని ప్రచారం చేయడం సిగ్గుచేటు. విష ప్రచారం చేస్తున్నారు. మహేష్‌బాబు అభిమానులు అన్ని పార్టీల్లో ఉన్నారు. సినిమాను సినిమాగానే చూస్తాం. ఇతర హీరోల అభిమానులు పరస్పరం ట్రోల్ చేసుకోవడం మానుకోవాలి.

ఎన్వీ ప్రసాద్, ఫిల్మ్ చాంబర్ మాజీ ప్రెసిడెంట్
తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదుగుతున్న సమయంలో ఇలాంటి విష ప్రచారం దురదృష్టకరం. సీఎం జగన్‌ను కలిసిన వారి మూడు సినిమాలను టార్గెట్‌గా చేసుకుని ఇలాంటి ప్రచారం చేయడం సరికాదు. కేజీఎఫ్‌ నిర్మాతలు కూడా సీఎంను కలిశారు. ఆ సినిమా భారీ హిట్‌ అయింది. ఏబీఎన్‌ చానల్‌ ఇలా ప్రచారం చేయడం సరికాదు. పవన్‌ కల్యాణ్ సినిమా విషయంలో సకాలంలో టికెట్ల ధరల పెంపు నిర్ణయం రాలేదన్న అభిప్రాయం, బాధ కొందరిలో ఉంది. కొవిడ్‌ సమయంలో కష్టపడి సినిమాలు తీస్తే మూడు సినిమాల పేర్లు చెబుతూ మరీ సీఎంను కలవడం వల్లనే అవి ఫెయిల్ అయ్యాయని ప్రచారం చేయడం సరికాదు. ఇలాంటి ప్రచారాన్ని చిత్రపరిశ్రమల సమిష్టిగా ఖండించాల్సిన అవసరం ఉంది.

First Published:  15 May 2022 3:40 AM GMT
Next Story