Telugu Global
National

ఎల్ఐసీ వద్ద అనాధీనంగా రూ.21వేల కోట్లు.. ఆ సొమ్ముకి వారసులెవరు..?

ఎవరిదీ కాని స్థలాన్ని అనాధీనం అంటారు రెవెన్యూ భాషలో. ప్రస్తుతం ఎల్ఐసీ వద్ద కూడా ఇలా అనాధీనంగా ఉన్న సొమ్ము ఉంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 21,336 కోట్ల రూపాయలకు అది చేరుకుంది. గత పదేళ్లలో ఎవరూ క్లెయిమ్ చేసుకోని సొమ్ము అది. పాలసీ వేసి మరచిపోవడమో, లేక పాలసీ వివరాలు ఎవరికీ చెప్పకుండా పాలసీదారుడు చనిపోవడమో జరిగినప్పుడు ఇలాంటి క్లెయిమ్ కాని సొమ్ము సంస్థలో మిగిలిపోతుంది. పదేళ్లకోసారి ఇలా అన్ క్లెయిమ్డ్ బీమా […]

ఎల్ఐసీ వద్ద అనాధీనంగా రూ.21వేల కోట్లు.. ఆ సొమ్ముకి వారసులెవరు..?
X

ఎవరిదీ కాని స్థలాన్ని అనాధీనం అంటారు రెవెన్యూ భాషలో. ప్రస్తుతం ఎల్ఐసీ వద్ద కూడా ఇలా అనాధీనంగా ఉన్న సొమ్ము ఉంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 21,336 కోట్ల రూపాయలకు అది చేరుకుంది. గత పదేళ్లలో ఎవరూ క్లెయిమ్ చేసుకోని సొమ్ము అది. పాలసీ వేసి మరచిపోవడమో, లేక పాలసీ వివరాలు ఎవరికీ చెప్పకుండా పాలసీదారుడు చనిపోవడమో జరిగినప్పుడు ఇలాంటి క్లెయిమ్ కాని సొమ్ము సంస్థలో మిగిలిపోతుంది. పదేళ్లకోసారి ఇలా అన్ క్లెయిమ్డ్ బీమా ఖాతాల లెక్క తీస్తారు. అలా లెక్కలు వేసినప్పుడు పాలసీదారులెవరూ క్లెయిమ్ చేసుకోకుండా ఎల్ఐసీ వద్ద మిగిలిపోయిన సొమ్ము 21,336 కోట్ల రూపాయలుగా తేలింది. 2021 డిసెంబర్ చివరినాటికి క్లెయిమ్ లేని సొమ్ముగా దీన్ని పేర్కొంది ఎల్ఐసీ.

గత పదేళ్లుగా.. ఎవరూ ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేయలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 2012, ఆ తర్వాత చెల్లింపు జరగాల్సిన ఈ మొత్తాన్ని పాలసీదారులు లేదా చట్టబద్ద వారసులు క్లెయిమ్ చేయలేదు. పాలసీదారుల జాడ లేదు, కనీసం వారి వారసులు కూడా తమకు పాలసీ డబ్బులు రావాలంటూ ఎల్ఐసీని ఆశ్రయించలేదు. అంటే దాదాపుగా సెటిల్మెంట్ చేసుకోడానికి వారసులెవరూ లేరని అర్థమవుతోంది.

ఎల్ఐసీ వద్ద ఇలా క్లెయిమ్ చేయని మొత్తం 10 సంవత్సరాలకు మించిఉంటే దానిని ప్రతి ఏడాదీ.. సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ కు బదిలీ చేస్తారు. అయితే అలా బదిలీ చేసిన తర్వాత కూడా ఎవరైనా వారసులు ఆ సొమ్ము తమది అంటూ ముందుకొస్తే వారికి దాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఎల్ఐసీ సంస్థపై ఉంటుంది.

ఎల్ఐసీ దగ్గర అన్‌క్లెయిమ్ ఫండ్స్ ఇంతలా ఉండటం కొత్తేమీ కాదు. 2019 ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ.13,843.70 కోట్లు, 2020 ఆర్థిక సంవత్సరానికి రూ.16,052.65 కోట్లు, 2021 ఆర్థిక సంవత్సరం చివరికి ఈ మొత్తం రూ.18,495.32 కోట్లుగా ఉంది. 2022 ఆర్థిక సంవత్సరం లెక్కలు ఇంకా పూర్తి కాలేదు. 2021 డిసెంబర్ వరకు ఉన్న లెక్కల ప్రకారం అన్ క్లెయిమ్డ్ సొమ్ము మొత్తం 21,336 కోట్ల రూపాయలు కావడం విశేషం. ఈ భారీ మొత్తంపై ఇప్పుడు సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఈ డబ్బుతో రెండు సార్లు గగన్ యాన్ ప్రాజెక్ట్ చేపట్టవచ్చని, యాదాద్రి పునర్నిర్మాణానికి చేసిన ఖర్చు దీనికి సమానం అని పోలికలు చెబుతున్నారు నెటిజన్లు.

First Published:  12 May 2022 2:07 AM GMT
Next Story