Telugu Global
NEWS

ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక సంక్షోభం జగన్ ఎలా ఎదుర్కొంటారు ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‍ం అప్పుల్లో మునిగి తేలుతోంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి అప్పులు.. రోడ్లు వేయాలంటే అప్పులు.. అసలు ఏపని చేయాలన్నా అప్పులే.. చివరకు ఈ అప్పులకు వడ్డీలు కట్టడానికి కూడా అప్పులే చేయాల్సిన దుస్థితి. రాష్ట్రం విడిపోకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఉన్న అప్పు రూ. 1లక్షా 66 వేల కోట్లు అవి రెండు రాష్ట్రాలకు పంచగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ వంతుకు వచ్చిన అప్పు 86వేల‌348 కోట్ల అప్పు. రాష్ట్రం ఏర్పడిన మొదటి ఐదు సంవత్సరాల్లో అంటే […]

ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక సంక్షోభం జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‍ం అప్పుల్లో మునిగి తేలుతోంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి అప్పులు.. రోడ్లు వేయాలంటే అప్పులు.. అసలు ఏపని చేయాలన్నా అప్పులే.. చివరకు ఈ అప్పులకు వడ్డీలు కట్టడానికి కూడా అప్పులే చేయాల్సిన దుస్థితి.

రాష్ట్రం విడిపోకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఉన్న అప్పు రూ. 1లక్షా 66 వేల కోట్లు అవి రెండు రాష్ట్రాలకు పంచగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ వంతుకు వచ్చిన అప్పు 86వేల‌348 కోట్ల అప్పు. రాష్ట్రం ఏర్పడిన మొదటి ఐదు సంవత్సరాల్లో అంటే చంద్రబాబు పరిపాలనలో ఆ అప్పు 2లక్షల 59 వేల కోట్లు. అంటే దాదాపు మూడు రెట్లు అప్పులు పెంచేశారు బాబు గారు. ఇక ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం మరింతగా పెంచి 2022-23 బడ్జెట్ ప్రకారం 4 లక్షల 39 వేల‌394 కోట్లకు చేర్చింది. అంటే రాష్ట్రం విడిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అప్పు నాలుగు రెట్లకు పైగా పెరిగింది. అయితే ఇది నిజం కాదని ప్రస్తుతం రాష్ట్రానికి ఉన్న అప్పు 7 లక్షల కోట్లు ఉన్నదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇందులోని నిజానిజాలు పక్కన పెడితే చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేని పరిస్థితికి చేరుకుంది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి.

ప్రతీ నెల 10 వేల కోట్లు అప్పులు తెచ్చుకుంటే కానీ రాష్ట్రం నడవని పరిస్థితికి చేరుకుంది. ప్రభుత్వం చెప్తున్న అంచనాలకు భిన్నంగా అతి తక్కువగా ఆదాయం వస్తున్నప్పటికీ మార్చ్ 11 న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఘనంగా 2లక్షల 56 వేల 256 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశ పెట్టారు. అందులో 66 వేల కోట్లు అప్పులే. ప్రతీ సంవత్సరం అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ కు వాస్తవంగా అయ్యే ఖర్చుకు చాలా తేడా ఉంటున్నప్పటికీ ప్రభుత్వం లెక్కలను మసిపూసి మారేడు కాయ చేస్తున్నది. గత సంవత్సరం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో 83 శాతం మాత్రమే ఖర్చు జరిగింది.

కేంద్రం నుండి రావాల్సిన నిధులు సరిగా రావడం లేదు.. ఆ నిధులు రాబట్టడానికి జగన్ ప్రభుత్వం చేస్తున్నది కూడా ఏమీ లేదు. తమ పార్టీ ప్రభుత్వాలు లేని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనే ఆరోపణల నేపథ్యంలో ఏపీ పరిస్థి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు.

ఇక ఈ లోటు ను పూడ్చుకోవడానికి జగన్ ప్రభుత్వం ప్రజలపై పడుతోంది. గత సంవత్సరం రాష్ట్ర పన్నులు 57 వేల కోట్ల రూపాయలను ప్రజల ముక్కు పిండి వసూలు చేయగా ఈ సంవత్సరం 73 వేల కోట్లు వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. పన్నేతర ఆదాయం 11 వేల కోట్లు వస్తుందని లెక్కలేస్తున్నది ప్రభుత్వం. దీనికోసం ప్రభుత్వ భూములను అమ్మడమే పనిగా పెట్టుకోబోతోంది. ఇన్ని చేసినా లోటు బడ్జెట్ తప్పని స్థితి ఉంది.

ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిని కప్పి పెట్టేందుకు ప్రధానంగా అప్పులపై ఆధారపడుతోంది జగన్ ప్రభుత్వం. ప్రతి నెల అప్పులేక పోతే గడవని పరిస్థితికి చేరుకున్నప్పటికీ కళ్ళు తెరవడంలేదు ప్రభుత్వం. పైగా ఇకపై అప్పులు చేయడానికి వీలు లేదని కేంద్ర ప్రభుత్వ తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు చేసిన అప్పులకు లెక్కలు చెప్పిన తర్వాతే అప్పులు చేయడానికి ఒప్పుకుంటామని స్పష్టం చేసింది కేంద్రం . అప్పులతో కూడిన లెక్కల నివేదిక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపినప్పటికీ ఆ నివేదికను కేంద్రం తిరస్కరించి లెక్కల కట్టను తిరుగు టపాలో ఏపీకి పంపించింది. సరైన లెక్కలతో సహా ఫైనాన్స్ కార్యదర్శి స్వయంగా ఢిల్లీకి రావాలని కేంద్రం హుకుం జారీ చేసింది. కారణమేంటో తెలియదు కానీ ఆ కార్యదర్శి సెలవు మీద వెళ్ళిపోయాడు.

అప్పులు చేసి, ఆ అప్పులకు వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పులు చేసి.. ఈ అప్పులకు వడ్డీలకోసం మళ్ళీ మళ్ళీ అప్పులు చేసే ఏ రాష్ట్రమైనా కేంద్రం మద్దతు లేకుండా గట్టెక్కడం కష్టం. మరి జగన్ ప్రభుత్వ ఈ పరిస్థితిని ఏలా ఎదుర్కోబోతోంది ? కేంద్రం తనకు పట్టనట్టు వ్యవహరిస్తే రాష్ట్రాల పరిస్థితి ఏంటి ?

First Published:  11 May 2022 1:11 AM GMT
Next Story