Telugu Global
CRIME

నిందితుడే బాధితుడయ్యాడు.. పోలీసుల చేతిలో మోసపోయాడు..

ఓ కేసులో నిందితుడిగా రిమాండ్ కి వెళ్లొచ్చిన వ్యక్తి.. చివరకు పోలీసుల చేతిలో మోసపోయిన వైనం ఇది. రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో ఆయన సెల్ ఫోన్, క్రెడిట్, డెబిట్ కార్డులు తీసుకున్న పోలీసులు అతడిని దారుణంగా మోసం చేశారు. నిందితుడి వస్తువులను జాగ్రత్తగా తిరిగి అప్పగించాల్సిన వారు.. వాటిని సొంత అవసరాలకు వాడుకున్నారు. ఐదున్నర లక్షల రూపాయలు నిందితుడి బ్యాంక్ అకౌంట్లనుంచి అక్రమంగా కాజేశారు. అసలేంటి ఈ కేసు..? ట్రాన్స్ పోర్ట్ లారీలను టార్గెట్ చేసుకుని, […]

నిందితుడే బాధితుడయ్యాడు.. పోలీసుల చేతిలో మోసపోయాడు..
X

ఓ కేసులో నిందితుడిగా రిమాండ్ కి వెళ్లొచ్చిన వ్యక్తి.. చివరకు పోలీసుల చేతిలో మోసపోయిన వైనం ఇది. రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో ఆయన సెల్ ఫోన్, క్రెడిట్, డెబిట్ కార్డులు తీసుకున్న పోలీసులు అతడిని దారుణంగా మోసం చేశారు. నిందితుడి వస్తువులను జాగ్రత్తగా తిరిగి అప్పగించాల్సిన వారు.. వాటిని సొంత అవసరాలకు వాడుకున్నారు. ఐదున్నర లక్షల రూపాయలు నిందితుడి బ్యాంక్ అకౌంట్లనుంచి అక్రమంగా కాజేశారు.

అసలేంటి ఈ కేసు..?
ట్రాన్స్ పోర్ట్ లారీలను టార్గెట్ చేసుకుని, ప్రయాణికుల్లా నటించి ఆ లారీల్లో ఎక్కి, చివరకు డ్రైవర్, క్లీనర్ ని బెదిరించి వస్తువులతోపాటు వాహనాన్ని తీసుకుని పారిపోయే ఓ ముఠాని ఫిబ్రవరిలో రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. 30 లక్షల రూపాయల విలువ చేసే 192 టైర్లను ఆ ముఠా దొంగిలించింది. తమిళనాడులో టైర్ల లోడుతో బయలుదేరిన లారీని మధ్యలో ఆపి హర్యానాకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఎక్కారు. సరిగ్గా లారీ తెలంగాణ బోర్డర్ దాటిన తర్వాత తుపాకులతో బెదిరించి వాహనాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. డ్రైవర్, క్లీనర్ ని తన్ని తరిమేశారు. ఆ తర్వాత బేగంబజార్ లోని టైర్ల వ్యాపారి కమల్ కబ్రాకు ఆ టైర్లు మారు బేరానికి అమ్మేశారు. అయితే దొంగతనం చేసినవారితోపాటు, దొంగ సొమ్ము కొన్న నేరానికి కమల్ కబ్రాని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ కి తరలించారు. ఈ క్రమంలో కమల్ కబ్రా ఫోన్, వ్యాలెట్, అందులోని కార్డులన్నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కమల్ కబ్రా పెద్ద వ్యాపారి, అతని క్రెడిట్, డెబిట్ కార్డులతోపాటు, ఫోన్ కూడా దొరకడంతో పోలీసులు విచారణ కోసం అంటూ పాస్ వర్డ్ చెప్పించుకున్నారు. ఆ తర్వాత అసలు పని మొదలు పెట్టారు. విడతలవారీగా మొత్తం 5.5 లక్షల రూపాయలు అతని ఖాతాల్లోనుంచి విత్ డ్రా చేశారు. అంతా ఒకేచోట కాకుండా.. తెలంగాణలోని పలు ప్రాంతాలతోపాటు, పక్క రాష్ట్రాల్లో కూడా డబ్బులు విత్ డ్రా చేయడం, కార్డులతో వస్తువులు కొనడం అన్నీ చేశారు. రిమాండ్ నుంచి విడుదలై వచ్చిన కమల్ తన బ్యాంకు ఖాతాలను చెక్ చేసే సరికి అసలు విషయం బయటపడింది. నిందితుడిగా తాను జైలు లోపలికి వెళ్లొచ్చే సరికి బాధితుడిగా మారిపోయానంటూ వాపోయాడు కమల్. పోలీసులే నేరస్థులు కావడంతో.. కమల్ కి న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.

First Published:  11 May 2022 12:36 AM GMT
Next Story