Telugu Global
NEWS

బాబుకు పవన్ కావాలి.. కానీ బీజేపీ వద్దు.. ఈ పొత్తు పొడిచేదెట్లా?

రాజకీయాల్లో అపర చాణుక్యుడు అనిపించుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. ఉమ్మడి ఏపీలో 9 ఏళ్లు, విడిపోయిన తర్వాత మరో ఐదేళ్ల పాటు సీఎం పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ఇప్పుడు చాలా గందరగోళంగా తయారయ్యింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధాటికి కేవలం 23 సీట్లకు పరిమితం అయిన బాబు.. 2024 ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్నారు. 70 ఏళ్ల పైబడిన వయసులో […]

బాబుకు పవన్ కావాలి.. కానీ బీజేపీ వద్దు.. ఈ పొత్తు పొడిచేదెట్లా?
X

రాజకీయాల్లో అపర చాణుక్యుడు అనిపించుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. ఉమ్మడి ఏపీలో 9 ఏళ్లు, విడిపోయిన తర్వాత మరో ఐదేళ్ల పాటు సీఎం పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ఇప్పుడు చాలా గందరగోళంగా తయారయ్యింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధాటికి కేవలం 23 సీట్లకు పరిమితం అయిన బాబు.. 2024 ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్నారు. 70 ఏళ్ల పైబడిన వయసులో ఆయన తిరిగి సీఎం పదవి చేపట్టాలనే ఆశ కంటే.. కొడుకు నారా లోకేష్‌కు రాజకీయ భవిష్యత్ ఇవ్వాలనే లక్ష్యమే అందులో కనపడుతున్నది.

అయితే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే సత్తా ఏ మాత్రం లేదు. గతంలో వచ్చిన గెలుపులన్నీ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జరిగినవే. రాష్ట్రం విడిపోయిన తర్వాత బీజేపీ, జనసేనతో కలసి పోటీ చేశారు. కానీ, ప్రస్తుతం బీజేపీకి బాబు దూరంగా వెళ్లిపోయారు. బాబు వెళ్లిపోయాడు అనడం కంటే బీజేపీ అధిష్టానమే అతడిని దూరం పెట్టింది. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన బాబుకు ఇప్పుడు ప్రధాని అపాయింట్‌మెంట్ దొరకడం కూడా కష్టంగా మారింది. గత ఎన్నికల్లో బీజేపీకి దూరంగా ఉన్న సీబీఎన్.. ఈసారి ఆ పార్టీ వైపు చూడరనే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కానీ, అదే సమయంలో బాబుకు పవన్ కల్యాణ్‌తో అవసరం ఉన్నది. జనసేనతో పొత్త పెట్టుకోవడం ద్వారా భారీగా సీట్లను గెలుచుకోవచ్చనే ఆశలో బాబు ఉన్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ పదే పదే.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తాం. అందుకు అన్ని పార్టీలను కలుపుకొని పోతాము అని వ్యాఖ్యానిస్తున్నారు. నిన్నకాక మొన్న చంద్రబాబు కూడా పవన్ వ్యాఖ్యలను సమర్థించేలా విపక్షాలన్నీ ఏకమవ్వాల్సిన సమయం వచ్చిందనే రీతిలో వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ-జనసేన పొత్తు ఖాయమే అని ఇరు పార్టీ కార్యకర్తలు భావించారు.

రెండో రోజే యూటర్న్
పొత్తులపై మాట్లాడిన చంద్రబాబు రెండో రోజే తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో పొత్తులు ఉండాలని చెప్పిన ఆయనే.. కాకినాడ సభలో మాత్రం నేను అలా అనలేదని చెప్పుకొచ్చారు. జగన్ సర్కారును ఓడించడానికి ప్రజలంతా ఏకమవ్వాలని నేను అన్నానని, దాన్ని మీడియా వక్రీకరించిందని మాట మార్చారు. రెండు రోజుల్లో వేర్వేరు ప్రకటనలతో ఇరుపార్టీల్లో గందరగోళం నెలకొన్నది. ఇంకోవైపు చంద్రబాబు వచ్చి తనతో డైరెక్ట్‌గా మాట్లాడితే మాత్రం పొత్తు గురించి ఆలోచిస్తానని పవన్ అంటున్నారు.

జనసేన అధినేతతో పొత్తుకోసం బీజేపీ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ పార్టీతో తమకు పొత్తు ఉంటుందని బీజేపీ నేతలే బాహాటంగా ప్రకటనలు చేస్తున్నారు. ఈ విషయంలోనే చంద్రబాబు కాస్త సందిగ్దంలో ఉన్నట్లు తెలుస్తున్నది. బీజేపీ లేని జనసేనతో అయితే పొత్తు పెట్టుకుంటాం కానీ, బీజేపీతో కలిస్తే మాత్రం దూరంగా ఉంటామని సన్నిహితులతో బాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. జనసేనాని ప్రస్తుతానికి ఇరు పార్టీలకు సమానదూరంలో ఉన్నారు. అయితే జనసైనికులు మాత్రం బీజేపీ కంటే టీడీపీతో పొత్తు ఉంటేనే లాభిస్తుందని అనుకుంటున్నారు.

ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని స్వయంగా ప్రభుత్వ సలహాదారే వ్యాఖ్యానించిన నేపథ్యంలో త్వరగా పొత్తుల విషయం తేల్చాలని జనసేన, టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ క్లారిటీ వస్తే ఎన్నికలకు ధైర్యంగా బరిలోకి దిగవచ్చని అనుకుంటున్నారు. మరి చంద్రబాబు, పవన్ ఈ విషయంలో ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

First Published:  9 May 2022 9:57 PM GMT
Next Story