Telugu Global
NEWS

ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎల్లో అలర్ట్.. పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక..

‘అసని’ తుపాను ప్రభావం ఉత్తరాంధ్రపై గట్టిగా ఉండే అవకాశముంది. ఇప్పటికే ఇది తీవ్ర తుపానుగా మారింది. విశాఖకు ఆగ్నేయంగా 670కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మంగళవారం రాత్రికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ఈ తీవ్ర తుపాన్ ప్రవేశిస్తుందని, అప్పటికి దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గంటకు 19 కిలోమీటర్ల వేగంతో దిశను మార్చుకుంటూ.. ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం వెంబడి తుపాను ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఒడిశాకు తీవ్ర ముప్పు.. ఉత్తరాంధ్రకు […]

ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎల్లో అలర్ట్.. పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక..
X

‘అసని’ తుపాను ప్రభావం ఉత్తరాంధ్రపై గట్టిగా ఉండే అవకాశముంది. ఇప్పటికే ఇది తీవ్ర తుపానుగా మారింది. విశాఖకు ఆగ్నేయంగా 670కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మంగళవారం రాత్రికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ఈ తీవ్ర తుపాన్ ప్రవేశిస్తుందని, అప్పటికి దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గంటకు 19 కిలోమీటర్ల వేగంతో దిశను మార్చుకుంటూ.. ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం వెంబడి తుపాను ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ చెబుతోంది.

ఒడిశాకు తీవ్ర ముప్పు.. ఉత్తరాంధ్రకు తప్పని ముప్పు..
ఒడిశా తీరం మీద ‘అసని’ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా, అదే సమయంలో ఉత్తరాంధ్రలో కూడా తుపాను అల్లకల్లోలం సృష్టించే అవకాశాలున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని ప్రభావంతో ఇప్పటికే గంటకు 100 నుంచి 125 కి.మీ గరిష్ట వేగంతో గాలులు వీస్తున్నాయి. ఏపీలో ఉన్న అన్ని పోర్టుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

పదో తేదీ రాత్రికి ప్రభావం..
ప్రస్తుతం కోస్తా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమైంది. బాపట్ల జిల్లానుంచి ఉత్తరాంధ్ర వరకు గత రాత్రి ఈదురు గాలులు, వర్షాలతో తీవ్ర నష్టం జరిగింది. ఉద్యాన పంటల రైతులు పంట నష్టంతో దిగాలు పడ్డారు. పదో తేదీ రాత్రికి దీని ప్రభావం స్పష్టంగా కనపడుతుందని, తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు అధికారులు. సహజంగా వేసవిలో వచ్చే తుపానులు తీరాన్ని దాటేలోపే దిశ మార్చుకుని వెళ్లిపోతుంటాయి. ప్రస్తుతం ‘అసని’ తుపాను కూడా అలా దిశ మార్చుకుంటుందా, లేక తీరందాటి విరుచుకు పడుతుందా అనేది అనుమానంగా ఉంది.

రాష్ట్రంలో నలుగురు మృతి
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో గోడకూలి ఒకరు, తాటిచెట్టు పడిపోయి ఇద్దరు చనిపోయారు. వీరిలో ఒకరు గ్రామ వాలంటీర్ కావడం గమనార్హం. కోనసీమ జిల్లా రావులపాలెం మండలానికి చెందిన మరో వ్యక్తి కూడా గోడ కూలి మృతి చెందారు. తుపాను ప్రభావం తప్పిపోయే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

First Published:  9 May 2022 1:18 AM GMT
Next Story