Telugu Global
Health & Life Style

ఈ వార్నింగ్ బెల్స్ చెవికెక్కించుకుంటే.. షుగర్ వ్యాధిని ముందే పసిగట్టొచ్చు..

షుగర్ అనేది నయం కాని వ్యాధి. కానీ దాన్ని ముందుగానే పసిగట్టి, మందులు తీసుకుంటే మాత్రం దానితో ఎలాంటి ప్రమాదం ఉండదు. 40 ఏళ్లు దగ్గరికి వచ్చే సమయంలో ప్రతి వ్యక్తినీ షుగర్ పలకరించే అవకాశం ఉంది. అప్పటికే జరగరాని నష్టం జరిగి ఆ తర్వాత షుగర్ ని కనిపెట్టడం కంటే.. ముందుగానే ప్రమాదాన్ని పసిగడితే మాత్రం నష్టాన్ని తాత్కాలికంగా తప్పించుకోవచ్చు, ఆహార, జీవన శైలిలో మార్పులు చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపొచ్చు. సంకేతాలివే.. ఎలాంటి అనారోగ్యం […]

ఈ వార్నింగ్ బెల్స్ చెవికెక్కించుకుంటే.. షుగర్ వ్యాధిని ముందే పసిగట్టొచ్చు..
X

షుగర్ అనేది నయం కాని వ్యాధి. కానీ దాన్ని ముందుగానే పసిగట్టి, మందులు తీసుకుంటే మాత్రం దానితో ఎలాంటి ప్రమాదం ఉండదు. 40 ఏళ్లు దగ్గరికి వచ్చే సమయంలో ప్రతి వ్యక్తినీ షుగర్ పలకరించే అవకాశం ఉంది. అప్పటికే జరగరాని నష్టం జరిగి ఆ తర్వాత షుగర్ ని కనిపెట్టడం కంటే.. ముందుగానే ప్రమాదాన్ని పసిగడితే మాత్రం నష్టాన్ని తాత్కాలికంగా తప్పించుకోవచ్చు, ఆహార, జీవన శైలిలో మార్పులు చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపొచ్చు.

సంకేతాలివే..
ఎలాంటి అనారోగ్యం లేకపోయినా ముందు జాగ్రత్తగా తరచూ వైద్య పరీక్షలు చేయించుకునే వారు చాలా తక్కువమంది ఉంటారు. షుగర్ వ్యాధి జాడను వారంతా ముందే పసిగట్టే అవకాశముంది. ఇక మిగతవారంతా బాగా ముదిరిపోయాక మాత్రమే మధుమేహం తమను పట్టి పీడిస్తుందనే విషయం గమనిస్తారు. ఆలోగా జరగాల్సిన నష్టం జరిగిపోవచ్చు. అయితే ముందస్తు లక్షణాలపై కాస్త దృష్టిపెడితే మాత్రం షుగర్ వ్యాధి ముప్పుని ముందుగానే పసిగట్టవచ్చని చెబుతున్నారు నిపుణులు.

ఆకలి పెరగడం..
ఆకలి అనేది ఆరోగ్యవంతమైన లక్షణం. కానీ తగినంత ఆహారం తీసుకున్నా కూడా ఇంకా ఆకలిగా ఉండటం మాత్రం అనారోగ్యానికి సంకేతం, ముఖ్యంగా షుగర్ వ్యాధికి అది ముందస్తు హెచ్చరిక. షుగర్ వ్యాధిగ్రస్తుల శరీరంలోని గ్లూకోజ్ శక్తిగా మారే అవకాశం తక్కువ. అందుకే వారు తిన్న తర్వాత కూడా నీరసంగా అనిపిస్తుంది. ఆకలి వేస్తుంది. ఈ లక్షణం ఉంటే వెంటనే షుగర పరీక్ష చేయించుకోవడం మంచిది.

కంటిచూపు దెబ్బతినడం..
సహజంగా వయసుతోపాటు పెరిగే చత్వారం వేరు, షుగర్ వల్ల వచ్చే కంటి సమస్యలు వేరు. వీటిని వేర్వేరుగా గమనించగలిగితే షుగర్ వ్యాధి వచ్చిన విషయాన్ని గుర్తించవచ్చు. కంటిచూపు మందగించితే.. దాన్ని కంటి సమస్యగానే భావించకూడదు. షుగర్ పరీక్ష చేయిస్తే అసలు విషయం బయటపడే అవకాశముంటుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం కంటి చూపు తీవ్రంగా దెబ్బతింటుంది. దీన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారు.

చేతులు, కాళ్ల వాపు..
రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే అది రక్త ప్రసరణను కూడా దెబ్బతీస్తుంది. ఫలితంగా చేతులు, కాళ్లు తిమ్మిరిగా మారతాయి. కొన్నిసార్లు చేతులు, కాళ్లలో అసాధారణ వాపు కనిపిస్తుంది. ఈ తిమ్మిరులు, వాపు చాలాకాలం కొనసాగితే షుగర్ పరీక్ష చేయించుకోవాలి.

చికాకు, నీరసం..
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వ్యక్తి ఉన్నట్టుండి చికాకు, విసుగు ప్రదర్శిస్తున్నాడంటే షుగర్ వ్యాధి అని అనుమానించొచ్చు. శారీరక అలసటతోపాటు, మానసిక అలసట కూడా దీనివల్ల వస్తుంది. మానసిక ఇబ్బందులు కూడా తలెత్తే ప్రమాదం ఉంది.

సడన్ గా బరువు తగ్గడం..
వయసు వచ్చేకొద్దీ బరువు పెరగడం సహజం. కానీ ఒక్కోసారి సడన్ గా బరువు తగ్గుతుంటారు. బరువు తగ్గితే మంచిదే కదా అనుకో కూడదు. దీనికి కారణం ఏంటో కనిపెట్టగలగాలి. షుగర్ ఎక్కువగా ఉంటే బరువు తగ్గే అవకాశముంది. శరీరంలోని గ్లూకోజ్ ని రక్తం శోషించుకోదు కాబట్టి.. ఎంత తిన్నా బరువు పెరగరు. సడన్ గా బరువు తగ్గితే షుగర్ పరీక్ష చేయించుకోవడం మంచిది.

నయంకాని గాయాలు..
షుగర్ వ్యాధి ఉన్న వారికి గాయాలు త్వరగా నయం కావు. షుగర్ వ్యాధి వస్తే రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. శరీరంలోకి ప్రవేశించే రోగకణాలను చంపే శక్తి తక్కువగా ఉంటుంది. దానివల్ల గాయాలు త్వరగా మానవు. ఇది కూడా షుగర్ వ్యాధిని ముందే గుర్తించగల లక్షణం.

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే షుగర్ పరీక్ష చేయించుకోవాలి. లేదా 40 ఏళ్లు దాటిన తర్వాత తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటుండాలి. అప్పుడే షుగర్ ని సరైన సమయంలో గుర్తించగలం, సరైన వైద్యం తీసుకుని దాని ప్రభావాన్ని తగ్గించగలం.

First Published:  8 May 2022 5:53 AM GMT
Next Story