Telugu Global
Andhra Pradesh

తిరుమలలో తొలిసారి హనుమజ్జయంతి ఉత్సవాలు.. ఎందుకంటే..?

తిరుమల క్షేత్రంలో తొలిసారిగా హనుమజ్జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించబోతున్నారు. ఇప్పటి వరకూ బేడి ఆంజనేయస్వామి, జాపాలి తీర్ధంలోనే ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు జరిగేవి. ఈసారి టీటీడీ అధికారికంగా ఉత్సవాలు జరిపేందుకు నిర్ణయించింది. ఉత్సవాల ఏర్పాట్లపై టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

TTD Organises Hanuman Jayanti celebration for the first time in Tirumala
X

తిరుమల క్షేత్రంలో తొలిసారిగా హనుమజ్జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించబోతున్నారు. ఇప్పటి వరకూ బేడి ఆంజనేయస్వామి, జాపాలి తీర్ధంలోనే ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు జరిగేవి. ఈసారి టీటీడీ అధికారికంగా ఉత్సవాలు జరిపేందుకు నిర్ణయించింది. ఉత్సవాల ఏర్పాట్లపై టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 25 నుంచి 29 వరకు హనుమజ్జయంతి ఉత్సవాలను తిరుమలలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారాయన.

తిరుమలలోని అంజనాద్రి, జాపాలి, నాదనీరాజన వేదిక, వేదపాఠశాలలో ఉత్సవాలు జరపబోతున్నారు. మే 29 ఉత్సవాల చివరి రోజున ధర్మగిరి వేద‌పాఠ‌శాల‌లో సంపూర్ణ సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం నిర్వహిస్తారు. ఉత్సవాలు మొదటిసారిగా నిర్వహిస్తున్నందున ఘనంగా జరపాలని అధికారులను ఏఈవో ఆదేశించారు. ఈ ఉత్సవాలను ఎస్వీబీసీ నాలుగు ఛానెళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు.

హనుమంతుడి జన్మస్థలంగా అంజనాద్రి పర్వతాన్ని నిర్ధారిస్తూ ఇటీవలే టీటీడీ ఓ అధ్యయన ఫలితాలను విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు తెలిపినవారికి కూడా కాస్త ఘాటుగానే బదులిచ్చింది. ఆంజనేయుడి జన్మస్థలం విషయంలో కొన్నాళ్లపాటు వివాదం కూడా నడిచింది. ఈ వివాదాలను పక్కనపెడితే.. ఇప్పుడు తొలిసారిగా తిరుమలలో హనుమజ్జయంతి ఉత్సవాలు అధికారికంగా జరపాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుమలను హనుమంతుడి జన్మస్థలంగా నిర్ధారించిన తర్వాత ఈ ఉత్సవాలను చేయడానికి టీటీడీ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.


కొండపైకి వచ్చే వాహనాలకు ఇతర గుర్తులొద్దు..


తిరుమలకు తీసుకొచ్చే వాహనాలపై రాజకీయ పార్టీల జెండాలు, నాయకుల ఫొటోలు, అన్యమత చిహ్నాలు ఉండకూడదని మరోసారి టీటీడీ విజ్ఞప్తి చేసింది. అలాంటి వాహనాలను అలిపిరి వద్దే నిలిపివేస్తామని తెలిపింది. ఇటీవల కొంతమంది అద్దె వాహనాలతో తిరుమలకు వచ్చే క్రమంలో వాహనాలపై ఉన్న అన్యమత చిహ్నాలను గుర్తించలేదు. ఆ వాహనాల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో అలిపిరి వద్దే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి కొండపైకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. భక్తులు సహకరించాలని కోరారు.

First Published:  7 May 2022 10:42 AM GMT
Next Story