Telugu Global
NEWS

టీఆర్ఎస్‌తో పొత్తంటే పార్టీ నుంచి వెళ్లగొడతాం : రాహుల్ గాంధీ

వరంగల్‌లో నిర్వహించిన ‘రైతు సంఘర్షణ యాత్ర’ తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ నింపింది. గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న పార్టీలో రాహుల్ టూర్ సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. బండి సంజయ్ యాత్రతో బీజేపీ ఒకవైపు ప్రజల్లోకి వెళ్తుంటే.. కాంగ్రెస్ మాత్రం అడపా దడపా నిరసనలు, ఆందోళనలు తప్ప పెద్దగా ప్రజల వద్దకు వెళ్లింది లేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ వరంగల్ సభకు రావడం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు […]

టీఆర్ఎస్‌తో పొత్తంటే పార్టీ నుంచి వెళ్లగొడతాం : రాహుల్ గాంధీ
X

వరంగల్‌లో నిర్వహించిన ‘రైతు సంఘర్షణ యాత్ర’ తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ నింపింది. గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న పార్టీలో రాహుల్ టూర్ సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. బండి సంజయ్ యాత్రతో బీజేపీ ఒకవైపు ప్రజల్లోకి వెళ్తుంటే.. కాంగ్రెస్ మాత్రం అడపా దడపా నిరసనలు, ఆందోళనలు తప్ప పెద్దగా ప్రజల వద్దకు వెళ్లింది లేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ వరంగల్ సభకు రావడం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 17 నెలల సమయం ఉండగానే.. మానిఫెస్టోలో పెట్టబోయే ముఖ్యమైన అంశాలను కూడా రాహుల్ వెల్లడించడంతో పాటు.. ‘వరంగల్ డిక్లరేషన్’ పేరుతో చెప్పిన తొమ్మిది అంశాలు రైతులు, ప్రజలకు భరోసా నింపేలా కనిపించాయి. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఉన్న చిన్నపాటి విభేదాలను మరిచి అందరూ ఒకే వేదికపై కనిపించడం కార్యకర్తలకు పాజిటివ్ సంకేతాలను పంపింది. ముఖ్యంగా రైతులకు రూ. 2 లక్షల రుణమాఫి ఒకే సారి చేస్తానని ప్రకటించడం సభకు వచ్చిన వారికి ఆనందాన్ని నింపింది.

పొత్తులపై క్లారిటీ..
కాంగ్రెస్ పార్టీ పొత్తుల గురించి తెలంగాణలో ఎవరైనా మాట్లాడితే వాళ్లను పార్టీ నుంచి బహిష్కరిస్తామని రాహుల్ గాంధీ ఖుల్లం ఖుల్లా చెప్పేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్‌తో దోస్తీ కడుతుందని వస్తున్న వ్యాఖ్యలకు రాహుల్ ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్.. టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోదని తేల్చేశారు. టీఆర్ఎస్‌తో పొత్తు అని వ్యాఖ్యానించే వాళ్లు.. టీఆర్ఎస్, బీజేపీలో ఏ పార్టీలోకి వెళ్లినా తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ పార్టీలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించేది లేదని రాహుల్ స్పష్టం చేశారు.

సోనియమ్మ తెలంగాణ ఇవ్వకుంటే.. ఇంకో 100 ఏళ్లైనా వచ్చేది కాదు..
వరంగల్‌లో జరిగిన ‘రైతు సంఘర్షణ’ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంతా తానై నడిపించారు. సభలో సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తూనే సజావుగా సాగడానికి కృషి చేశారు. వరంగల్ డిక్లరేషన్ పేరిట 9 పాయింట్ల తీర్మానాన్ని చదివి వినిపించారు. అందులోనే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ ఒకే దఫా మాఫీ చేస్తామని చెప్పారు. అంతే కాకుండా రైతులు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం కూడా అందిస్తామన్నారు. ఈ తీర్మానాలన్నీ అక్కడ సభకు వచ్చిన ప్రజలు, రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలో జోష్ నింపాయి.

రాజగోపాల్ రెడ్డి దూరం..
కాంగ్రెస్ నేత, మునుగోలు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రైతు సంఘర్షణ యాత్రకు దూరంగా ఉన్నారు. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లు ఉంటున్న రాజగోపాల్.. కనీసం రాహుల్ సభకు అయినా వస్తారని అందరూ భావించారు. అయితే అన్న వెంకట్ రెడ్డి వచ్చినా.. రాజగోపాల్ మాత్రం దూరంగానే ఉన్నారు.

First Published:  6 May 2022 9:41 PM GMT
Next Story