Telugu Global
NEWS

మమ్మీ హయాంలో డమ్మీతో పాలన.. అది కాంగ్రెస్ కాదు, స్కాంగ్రెస్..

ఇటీవల ఎన్డీఏ సర్కారుని ఎన్పీఏ సర్కారు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని స్కాంగ్రెస్ అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పై పంచ్ ల వర్షం కురిపించారు కేటీఆర్. కాంగ్రెస్ హయాంలో ఏ టు జెడ్‌ అన్ని కుంభ‌కోణాలే అని, ఆకాశంలో ఎగిరే అగ‌స్టా హెలికాప్ట‌ర్, స్పెక్ట్ర‌మ్ నుంచి మొద‌లు పెడితే.. పాతాళంలో దొరికే బొగ్గు వ‌ర‌కు అన్నీ కుంభ‌కోణాలే అని కేటీఆర్ […]

మమ్మీ హయాంలో డమ్మీతో పాలన.. అది కాంగ్రెస్ కాదు, స్కాంగ్రెస్..
X

ఇటీవల ఎన్డీఏ సర్కారుని ఎన్పీఏ సర్కారు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని స్కాంగ్రెస్ అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పై పంచ్ ల వర్షం కురిపించారు కేటీఆర్. కాంగ్రెస్ హయాంలో ఏ టు జెడ్‌ అన్ని కుంభ‌కోణాలే అని, ఆకాశంలో ఎగిరే అగ‌స్టా హెలికాప్ట‌ర్, స్పెక్ట్ర‌మ్ నుంచి మొద‌లు పెడితే.. పాతాళంలో దొరికే బొగ్గు వ‌ర‌కు అన్నీ కుంభ‌కోణాలే అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.

ఒక్క ఛాన్స్ అంటూ రాహుల్ విచిత్రంగా మాట్లాడుతున్నారని, తెలుగు ప్రజలు ఆ పార్టీకి 10 ఛాన్స్ లు ఇచ్చారని మండిపడ్డారు కేటీఆర్. మమ్మీ గారి హయాంలో డమ్మీ గారితో పాలన చేసింది మీరే కదా అని ప్రశ్నించారు. ఆనాడు ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చించేసిన రాహుల్ గాంధీ .. రిమోట్ కంట్రోల్ పాలన గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. “నువ్వు ఏం తెల్వ‌నోనివి. రాసిస్తే చ‌దివి పోయే వ్య‌క్తివి. అభం శుభం తెలియ‌ని అమాయ‌కుడివి, అజ్ఞానివి.. అంత‌కే ఉంటే మంచిదం”టూ రాహుల్ పై సెటైర్లు వేశారు కేటీఆర్.

హైదరాబాద్ బిర్యానీకోసమే వస్తున్నారా..?
ఢిల్లీనుంచి వచ్చే రాజకీయ పర్యాటకులు, హైదరాబాద్ బిర్యానీ తిని వెళ్లిపోతారని, అలాంటి వారు తెలిసి, తెలియకుండా ఏవేవోమాట్లాడతారని, వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్. రైతుల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్.. ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో రైతు బీమా ఉందో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు కేసీఆర్ లేకపోతే.. టీపీసీసీ, టీబీజేపీ ఎక్కడిదని ప్రశ్నించారు. విమర్శలు చేయడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని, తెలంగాణ ఉద్యమ సమయంలోనూ చాలా మాట్లాడారంటూ ఆయన గుర్తు చేశారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిలా కాకుండా రాజు లాగా పరిపాలిస్తున్నారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కూడా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. “యువ‌రాజు అని నిన్ను పిలుస్తారు. నీ ముత్తాత మోతీ లాల్ నెహ్రూ నుంచి మొద‌లుపెడితే జ‌వ‌హ‌ర్ లాలా నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, త‌ర్వాత నువ్వు.. రాజ‌రికం మాదిరిగా ఉన్నారు. మీరు ఇక్క‌డికి వ‌చ్చి రాజులు అని మాట్లాడ‌టం స‌రికాదు. ఒక వేళ కేసీఆర్ నియంత అయితే.. పొద్దున లేస్తే తిట్టుడు ప్రోగ్రామ్ పెట్టుకునే వారు ఇక్క‌డే ఉండేవారా? ఈ ఆట‌లు సాగుతాయా?” అని ప్ర‌శ్నించారు కేటీఆర్. టీఆర్ఎస్‌ తో పొత్తు పెట్టుకోబోమని కాంగ్రెస్ అంటోందని, అసలు ఈ దేశంలో కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకునే పార్టీ ఉందా అని ఎద్దేవా చేశారు.

First Published:  7 May 2022 7:20 AM GMT
Next Story