Telugu Global
NEWS

మూడేళ్లవుతోంది.. పసుపు బోర్డ్ సంగతేమైంది..?

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో నిజామాబాద్ లోక్ సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో పసుపు బోర్డ్ అంశం కీలకంగా మారింది. అప్పటి సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత పసుపు రైతులకు న్యాయం చేయలేకపోయారంటూ బీజేపీ ప్రచారం చేసింది. నిజామాబాద్ కి పసుపు బోర్డ్ రావాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు ధర్మపురి అరవింద్. పసుపు రైతులు బీజేపీ మాట నమ్మారు, అరవింద్ ని పార్లమెంట్ కి పంపారు. కానీ మూడేళ్లవుతున్నా నిజామాబాద్ కి పసుపు బోర్డ్ రాలేదు, పసుపు […]

మూడేళ్లవుతోంది.. పసుపు బోర్డ్ సంగతేమైంది..?
X

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో నిజామాబాద్ లోక్ సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో పసుపు బోర్డ్ అంశం కీలకంగా మారింది. అప్పటి సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత పసుపు రైతులకు న్యాయం చేయలేకపోయారంటూ బీజేపీ ప్రచారం చేసింది. నిజామాబాద్ కి పసుపు బోర్డ్ రావాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు ధర్మపురి అరవింద్. పసుపు రైతులు బీజేపీ మాట నమ్మారు, అరవింద్ ని పార్లమెంట్ కి పంపారు. కానీ మూడేళ్లవుతున్నా నిజామాబాద్ కి పసుపు బోర్డ్ రాలేదు, పసుపు రైతుల కష్టాలు తీరలేదంటూ కవిత తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఎంపీగా అరవింద్ చేతిలో ఓడిపోయిన ఆమె.. ఆ తర్వాత తెలంగాణ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కానీ నిజామాబాద్ లోక్ సభ స్థానంలో పట్టుకోసం ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

అపార్ట్ మెంట్లో స్పైస్ బోర్డ్ తో ఉపయోగం ఏంటి..?
పసుపు బోర్డ్ స్థానంలో 1.92 కోట్ల రూపాయలతో స్పైస్‌ బోర్డు తెచ్చి.. ఓ అపార్ట్‌మెంట్‌లో పెట్టారని, దానివల్ల ఎవరికీ పెద్దగా ప్రయోజనం లేదని అన్నారు ఎమ్మెల్సీ కవిత. హైస్పీడ్‌ లో అబద్ధాలు చెప్పడం తప్ప బీజేపీ నేతలు చేసిందేమీ లేదని ఆమె ధ్వజమెత్తారు. కేవలం అబద్ధాలతోనే కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారామె.

పసుపు బోర్డ్ హామీ ఏమైందని ఆమె ఎంపీ అరవింద్ ని నిలదీశారు. అరవింద్ కి ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉందని.. పసుపుబోర్డు ఎప్పుడు తెస్తారంటూ ప్రశ్నించారు. నిజామాబాద్‌ ప్రజలకు ఏం జవాబు చెబుతారని అన్నారు. మూడేళ్ల కాలంలో ఎంపీ అరవింద్ పార్లమెంట్ లో ఐదుసార్లు మాట్లాడారని, కానీ పసుపు బోర్డ్ గురించి ఒక్క పదం కూడా ఆయన మాటల్లో లేదని చెప్పారు కవిత. నిజామాబాద్ పసుపు రైతుల ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి ఢిల్లీలో తాకట్టు పెట్టిన వ్యక్తి ‘అధర్మపురి’ అరవింద్ అంటూ మండిపడ్డారు.

ఇచ్చిన హామీల గురించి ప్రయత్నాలు చేస్తారేమోనని మూడేళ్లు విడిచిపెట్టామని, ఇక విడిచిపెట్టేది లేదని అంటున్నారు కవిత. “ఢిల్లీలో మోకాళ్ల యాత్ర చేస్తారో, ఢిల్లీ నాయకుల వద్ద మోకరిల్లి పసుపు బోర్డు సాధించుకొని వస్తారో.. ఏం చేస్తారో చేయండి. బాండు పేపర్‌ లో చెప్పినట్లు పసుపు బోర్డు పట్టుకొనే రండి. లేకపోతే ఏ గ్రామానికి పోయినా అడుగడుగునా నిలదీస్తాం.” అని హెచ్చరించారు కవిత.

First Published:  4 May 2022 6:29 AM GMT
Next Story