Telugu Global
National

బాబ్బాబు.. ఆఫీసులకు రండి.. బతిమిలాడుకుంటున్న కంపెనీలు..

వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అలవాటైన తర్వాత ఉద్యోగులంతా ఇంటి దగ్గరనుంచి పనిచేసేందుకు బాగా అలవాటు పడ్డారు. ఆఫీస్ పనివేళలు లేవు, ట్రాఫిక్ జంజాటాలు లేవు, టిఫిన్ బాక్స్ లు, క్యారియర్లు అసలే లేవు. హెల్తీ ఫుడ్, హెల్తీ లైఫ్ అనుకుంటూ కుటుంబంతో సమయం గడుపుతూ పనిచేసుకుంటున్నారు. ఇప్పుడు సడన్ గా వారందర్నీ ఆఫీసులకి పిలిస్తే వస్తారా? ఇప్పటికే కొన్ని ఐటీ కంపెనీలు వారంలో రెండు రోజులు రండి చాలు అంటూ ఆఫర్లిస్తున్నాయి, మరికొన్ని కంపెనీలు కనీసం […]

బాబ్బాబు.. ఆఫీసులకు రండి.. బతిమిలాడుకుంటున్న కంపెనీలు..
X

వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అలవాటైన తర్వాత ఉద్యోగులంతా ఇంటి దగ్గరనుంచి పనిచేసేందుకు బాగా అలవాటు పడ్డారు. ఆఫీస్ పనివేళలు లేవు, ట్రాఫిక్ జంజాటాలు లేవు, టిఫిన్ బాక్స్ లు, క్యారియర్లు అసలే లేవు. హెల్తీ ఫుడ్, హెల్తీ లైఫ్ అనుకుంటూ కుటుంబంతో సమయం గడుపుతూ పనిచేసుకుంటున్నారు. ఇప్పుడు సడన్ గా వారందర్నీ ఆఫీసులకి పిలిస్తే వస్తారా? ఇప్పటికే కొన్ని ఐటీ కంపెనీలు వారంలో రెండు రోజులు రండి చాలు అంటూ ఆఫర్లిస్తున్నాయి, మరికొన్ని కంపెనీలు కనీసం వారంలో ఒక్కసారైనా ఆఫీస్ మొహం చూసి వెళ్లండి అంటూ బతిమిలాడుకుంటున్నాయి. ఆఫీస్ లో రకరకాల సౌకర్యాలు కల్పించే గూగుల్ సైతం.. ఉద్యోగుల‌ను ఆఫీసుల బాట ప‌ట్టించేందుకు కిందామీదా పడుతోంది. ఆఫీస్ లకు వచ్చే వారికి ఉచిత ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను ఆఫర్ చేస్తోంది గూగుల్.

యాపిల్ ఉద్యోగులు ససేమిరా..?
యాపిల్ కంపెనీలో ఉద్యోగం చాలామంది కల. కానీ క‌రోనా మ‌హ‌మ్మారితో రెండేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న యాపిల్ సంస్థ ఉద్యోగులు.. సడన్ గా ఆఫీస్ కి రమ్మనే సరికి ఉద్యోగమే మానేసేందుకు సిద్ధమవుతున్నారు. సోషల్ నెట్ వర్క్ యాప్ బ్లైండ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. యాపిల్ ఉద్యోగుల్లో 76శాతం మంది ఇంటి దగ్గరనుంచే పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. ఆఫీస్ రావడం కంపల్సరీ అంటే మాత్రం వేరే కంపెనీ వెదుక్కుంటామని చెబుతున్నారు.

ఈనెల 23నుంచి ఆఫీస్ కి రావాలని, వారానికి క‌నీసం మూడు రోజులు ఆఫీసు నుంచి ప‌నిచేయాల‌ని యాపిల్ సంస్థ ఉద్యోగుల‌ను కోరింది. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ఈమేరకు ఉద్యోగులందరికీ రిట‌న్ టు ఆఫీస్ పాల‌సీని పంపించారు. కానీ ఉద్యోగులు మాత్రం ససేమిరా అంటున్నారు. ట్రాఫిక్ జంజాటం లేకుండా, ఇంటి వాతావరణంలో పనిచేయడం తమకు బాగుందని, ఆఫీస్ కి రాలేమని ఈమెయిల్స్ పంపుతున్నారు. కావాలంటే ఇంటినుంచే మరింత కష్టపడతామని చెబుతున్నారట. ఆఫీస్ కి రావడం తప్పనిసరి అయితే మాత్రం ఉద్యోగం మానేస్తామని తేల్చి చెబుతున్నారట. ఈ నేపథ్యంలో యాపిల్ సంస్థ కూడా ఉద్యోగులను బతిమిలాడుకోవడం మినహా ఇంకేం చేయలేకపోతోంది. దాదాపు ఐటీ కంపెనీలన్నీ వారానికి రెండు రోజుల పాలసీతో మెల్లగా ఆఫీస్ వర్క్ ని అలవాటు చేయాలని చూస్తున్నాయి.

First Published:  4 May 2022 5:24 AM GMT
Next Story