Telugu Global
NEWS

ధోనీ శరణు..శరణు.. జడేజా సారధ్య‌ సన్యాసం.. మహీకే మళ్లీ చెన్నై పగ్గాలు!

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరోసారి.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పగ్గాలు చేపట్టాడు. ప్రస్తుత సీజన్ మొదటి ఎనిమిది మ్యాచ్ ల్లో నాలుగుసార్లు విజేత చెన్నైకి కెప్టెన్ గా వ్యవహరించిన ఆల్ రౌండర్ జడేజా వరుస వైఫల్యాల తరువాత సారధ్య‌ సన్యాసం స్వీకరించాడు. నాయకుడుగా వ్యవహరించడం ఇక తన వల్ల కానేకాదని జట్టు యాజమాన్యానికి తెలిపాడు. ప్రస్తుత సీజన్ చివరి ఆరు లీగ్ మ్యాచ్ ల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు […]

ధోనీ శరణు..శరణు.. జడేజా సారధ్య‌ సన్యాసం.. మహీకే మళ్లీ చెన్నై పగ్గాలు!
X

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరోసారి.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పగ్గాలు చేపట్టాడు. ప్రస్తుత సీజన్ మొదటి ఎనిమిది మ్యాచ్ ల్లో నాలుగుసార్లు విజేత చెన్నైకి కెప్టెన్ గా వ్యవహరించిన ఆల్ రౌండర్ జడేజా వరుస వైఫల్యాల తరువాత సారధ్య‌ సన్యాసం స్వీకరించాడు. నాయకుడుగా వ్యవహరించడం ఇక తన వల్ల కానేకాదని జట్టు యాజమాన్యానికి తెలిపాడు. ప్రస్తుత సీజన్ చివరి ఆరు లీగ్ మ్యాచ్ ల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మహేంద్రసింగ్ ధోనీ తిరిగి నాయకత్వ బాధ్యతలు వహిస్తాడంటూ.. ఫ్రాంచైజీ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.

కెప్టెన్ గా రవీంద్ర జడేజా ఫ్లాప్ షో..!
ఐపీఎల్- 15వ సీజన్ ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. రవీంద్ర జడేజా సారధిగా ప్రారంభించింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టైటిల్ నిలుపుకోడానికి బరిలోకి దిగిన చెన్నైజట్టు గత ఎనిమిది రౌండ్లలో ఆరు పరాజయాలు చవిచూసింది. 10 జట్ల లీగ్ టేబుల్ ఆఖరి నుంచి రెండోస్థానంలో నిలిచింది.
ఆటగాడిగా, కెప్టెన్ గా జడేజా జంట వైఫల్యాలు చవిచూడటం జట్టును పీకలోతు కష్టాలలో కూరుకుపోయేలా చేసింది. చెన్నై జట్టుకు వెన్నెముక లాంటి జడేజా మొదటి 8 రౌండ్ల మ్యాచ్ ల్లో 5 వికెట్లు పడగొట్టడంతో పాటు 112 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కెప్టెన్ గా ఎనిమిది మ్యాచ్ ల్లో 2 విజయాలు, 6 పరాజయాల రికార్డును మూటగట్టుకొన్నాడు.

చేతులు కాలాక..
చెన్నై ఫ్రాంచైజీ పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లుగా తయారయ్యింది. అంతగా అనుభవం లేని జడేజా చేతికి పగ్గాలు అప్పగించి భారీమూల్యమే చెల్లించింది. ప్లే ఆఫ్ రౌండ్ చేరాలంటే చెన్నైజట్టు మిగిలిన ఆరుకు ఆరురౌండ్లు నెగ్గితీరాల్సిన పరిస్థితిలో కెప్టెన్సీని తిరిగి ధోనీకి అప్పగించింది. ఆల్ రౌండర్ గా తన ఆటతీరు మెరుగుపరచుకోడానికి, ఆట పైనే దృష్టి కేంద్రీకరించడానికి వీలుగా తాను నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు.. జట్టు యాజమాన్యానికి జడేజా తెలపడంతో నాయకత్వ భారాన్ని ధోనీ మరోసారి మోయాల్సి వస్తోంది.

తిరుగులేని సారధి మహేంద్రసింగ్ ధోనీ..
ఐపీఎల్ గత 14 సీజన్లలో చెన్నైజట్టు నాలుగుసార్లు ధోనీ నాయకత్వంలోనే విజేతగా నిలిచింది. అంతేకాదు.. మరో నాలుగుసార్లు రన్నరప్ గా నిలవడం ద్వారా..అత్యంత విజయవంతమైన రెండుజట్లలో ఒకటిగా నిలిచింది. ఇక..కెప్టెన్ గా ధోనీపేరుతో ఉన్న రికార్డులు అన్నీఇన్నీకావు. కెప్టెన్ గా ఐపీఎల్ లో అత్యధిక పరుగులు, కెప్టెన్ గా అత్యధిక మ్యాచ్ లు, 40 సంవత్సరాల 262 రోజుల వయసులో అర్ధశతకం బాదిన ఆటగాడి రికార్డులు ధోనీ పేరుతోనే ఉన్నాయి. అంతేకాదు.. ధోనీ నాయకత్వంలోనే అత్యధికసార్లు ప్లేఆఫ్ రౌండ్ చేరిన జట్టుగా, అత్యధిక ఫైనల్స్ ఆడినజట్టుగా చెన్నై రికార్డుల్లో చేరింది. ఐపీఎల్ చరిత్రలో 200 మ్యాచ్ లు ఆడిన తొలి ఆటగాడి ఘనతను సైతం ధోనీ దక్కించుకొన్నాడు. కూల్ కూల్ ధోనీ మిగిలిన ఆరురౌండ్ల పోటీలలో చెన్నైని అజేయంగా నిలపడం ద్వారా..ప్లే ఆఫ్ బెర్త్ అందించగలడా?..ధోనీ మాటల్లో చెప్పాలంటే.. క్రికెట్ లో ఏదీ అసాధ్యం కాదు. తుదివరకూ పోరాడే జట్టుకు మాత్రమే ఆఖరు బంతి విజయం సాధించే అవకాశం ఉండి తీరుతుంది.

First Published:  1 May 2022 1:05 AM GMT
Next Story