Telugu Global
NEWS

పూజారా.. పరుగుల నగారా!.. 28 ఏళ్ల అజార్ రికార్డు సమం

భారత క్రికెట్ నయావాల్ చతేశ్వర్ పూజారా..ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్లో సెంచరీల మోత, పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. గత 28 సంవత్సరాలుగా భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ పేరుతో చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును సమం చేయగలిగాడు. వైఫల్యాలను అధిగమించి.. జోస్ బట్లర్, జానీ బెయిర్ స్టో లాంటి పలువురు ఇంగ్లిష్ స్టార్ క్రికెటర్లు భారీ కాంట్రాక్టులపై ఐపీఎల్ లీగ్ లో ఆడుతుంటే.. భారత క్రికెట్ నయావాల్, టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పూజారా మాత్రం.. ఐపీఎల్ అవకాశం […]

పూజారా.. పరుగుల నగారా!.. 28 ఏళ్ల అజార్ రికార్డు సమం
X

భారత క్రికెట్ నయావాల్ చతేశ్వర్ పూజారా..ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్లో సెంచరీల మోత, పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. గత 28 సంవత్సరాలుగా భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ పేరుతో చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును సమం చేయగలిగాడు.

వైఫల్యాలను అధిగమించి..
జోస్ బట్లర్, జానీ బెయిర్ స్టో లాంటి పలువురు ఇంగ్లిష్ స్టార్ క్రికెటర్లు భారీ కాంట్రాక్టులపై ఐపీఎల్ లీగ్ లో ఆడుతుంటే.. భారత క్రికెట్ నయావాల్, టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పూజారా మాత్రం.. ఐపీఎల్ అవకాశం లేకపోడంతో.. ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్లో ఆడుతూ తిరిగి గాడిలో పడుతున్నాడు. గత ఏడాది కాలంగా జరిగిన టెస్టు సిరీస్ ల్లో భారత ప్రధాన ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందిన పూజారా..స్థాయికి తగ్గట్టుగా రాణించలేక, వరుస వైఫల్యాలతో..టెస్టుజట్టులో స్థానం కోల్పోయాడు. ఐపీఎల్ 15వ సీజన్ మెగా వేలంలో టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పూజారాను కొనుగోలు చేయటానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. కనీసం 2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్ కు పూజారాను ఎంపిక చేసుకోలేదు. దీంతో..గాడితప్పిన తన ఆటతీరును మెరుగుపరచుకోడానికి వీలుగా ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్లో ససెక్స్ జట్టు తో కాంట్రాక్టు కుదుర్చుకొన్నాడు. ప్రస్తుత 2022 కౌంటీ టోర్నీలో పూజారా ఇప్పటికే రెండో డబుల్ సెంచరీ సాధించాడు. పూజారా డబుల్ తో ససెక్స్ జట్టు 538 పరుగుల భారీస్కోరు నమోదు చేయగలిగింది.

నాడు అజార్.. నేడు పూజారా!
కౌంటీలీగ్ లో భాగంగా డర్హౌం జట్టుతో జరిగిన పోటీలో ససెక్స్ తరపున పూజారా 203 పరుగులతో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. గతవారం డెర్బీషైర్ కౌంటీతో జరిగిన పోరులో 201 పరుగులు సాధించిన పూజారా.. ఈ క్రమంలో 28 సంవత్సరాల క్రితం హైదరాబాదీ మణికట్టు మాంత్రికుడు మహ్మద్ అజారుద్దీన్ నెలకొల్పిన రికార్డును సమం చేయగలిగాడు. ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్ ల్లో పూజారా 6 (15), 201* (387), 109 (206), 12 (22), 203 (334) స్కోర్లు నమోదు చేశాడు. 1991లో లెస్టర్ షైర్ జట్టుతో జరిగిన పోరులో 212 పరుగులు, 1994లో దర్హౌం పైన 205 పరుగులతో అజార్, డెర్బీషైర్ జట్టు సభ్యుడిగా ద్విశతకాలు నమోదు చేశాడు. ఆ తర్వాత 28 సంవత్సరాలకు చతేశ్వర్ పూజారా సైతం అదేస్థాయి ఆటతీరుతో రెండు డబుల్ సెంచరీలతో వారెవ్వా అనిపించుకొన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పూజారా పేరుతో 15 డబుల్ సెంచరీలు ఉన్నాయి. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 13 ద్విశతకాలతో పూజారా తర్వాతి స్థానంలో ఉన్నాడు.

First Published:  1 May 2022 2:34 AM GMT
Next Story