భారత్ లో అసూయపరులు ఎక్కువ-రవిశాస్త్రి
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో తనకుతానే సాటిగా నిలిచే భారత మాజీ కెప్టెన్ కమ్ చీఫ్ కోచ్ రవిశాస్త్రి మరోసారి తన మనసు విప్పారు. నోటికి పూర్తిస్థాయిలో పనిచెప్పారు. 2014 నుంచి 2021 వరకూ భారత క్రికెట్ కు చీఫ్ కోచ్ గా వ్యవహరించడంతో పాటు..అత్యంత విజయవంతమైన శిక్షకుడిగా రికార్డుల మోత మోగించిన రవిశాస్త్రి..లండన్ నుంచి వెలువడే..ద గార్డియన్ వార్తాపత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను ఏకరువు పెట్టారు. భారత్ లో మనుషులతీరే అంత.. క్రికెట్ శిక్షకుడిగా […]
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో తనకుతానే సాటిగా నిలిచే భారత మాజీ కెప్టెన్ కమ్ చీఫ్ కోచ్ రవిశాస్త్రి మరోసారి తన మనసు విప్పారు. నోటికి పూర్తిస్థాయిలో పనిచెప్పారు. 2014 నుంచి 2021 వరకూ భారత క్రికెట్ కు చీఫ్ కోచ్ గా వ్యవహరించడంతో పాటు..అత్యంత విజయవంతమైన శిక్షకుడిగా రికార్డుల మోత మోగించిన రవిశాస్త్రి..లండన్ నుంచి వెలువడే..ద గార్డియన్ వార్తాపత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను ఏకరువు పెట్టారు.
భారత్ లో మనుషులతీరే అంత..
క్రికెట్ శిక్షకుడిగా తనకు ఎలాంటి డిగ్రీలు లేవని, కనీసం లెవెల్ -1, లెవెల్ -2 లాంటి డిప్లమాలు సైతం లేవని..అయినా తాను భారతజట్టు ప్రధానశిక్షకుడిగా వ్యవహరించానని గర్వంగా చెప్పుకొన్నారు.
తాను కోచ్ గా పదవీబాధ్యతలు చేపట్టినప్పుడు..ఓ అసూయపరుల గ్యాంగ్..తన వైఫల్యాలను కోరుకొందని గుర్తు చేసుకొన్నారు. భిన్నజాతులు, మతాలతో కూడిన వైవిధ్యభరితమైన భారత్ లో అసూయపరులు ఎక్కువేనని.. ఎదుటివారి బాగు కోరేవారు చాలా తక్కువమంది ఉంటారని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు. అయినా తాను ఎదుటివారిని పట్టించుకోకుండా తన పనిని తాను చేసుకొంటూ పోయానని తెలిపారు.
మన వ్యతిరేకులను, చెడుకోరుకొనేవారిని పట్టించుకొంటే ఏదీసాధించలేమని, పురోగతి సాధించలేమని వివరించారు.
మాటలే విజయానికి మెట్లు..
క్రికెట్ శిక్షకుడుగా రాణించాలంటే, ఆశించిన ఫలితాలు రాబట్టాలంటే..మాటలే ముఖ్యమని, ఆటగాళ్ల నుంచి ఓ కోచ్ గా తాను ఏమి ఆశిస్తున్నానో.. వారు ఏమనుకొంటున్నారో తెలుసుకు తీరాలని, దానికి అనుగుణంగానే పనితీరు ఉండాలని రవిశాస్త్రి చెప్పారు. మనం ఏది సాధించాలన్నా రాజీలేని పోరాటం చేయాలని, కొన్నిసందర్బాలలో మొండిగా వ్యవహరించాలని సూచించారు. ఆస్ట్ర్రేలియా లాంటి దిగ్గజజట్టును ఆస్ట్ర్రేలియాగడ్డపై భారతజట్టు రెండుసార్లు ఓడించి సిరీస్ విజయాలు సాధించడం వెనుక..జట్టు సభ్యుల్లో తాను పాదుకొల్పిన ఆత్మవిశ్వాసం, పోరాటపటిమ ఉన్నాయని, ఏ జట్టుకైనా..
వారసత్వం, తమదైన శైలిలో పనితీరు ఉండితీరాలని స్పష్టం చేశారు. విదేశీగడ్డపై ప్రత్యర్థిజట్టును రెండుసార్లు ఆలౌట్ చేయడం ద్వారా 20 వికెట్లు పడగొట్టాలంటే.. బౌలర్ల ఫిట్ నెస్ అత్యుత్తమస్థాయిలో ఉండితీరాలని, స్లెడ్జింగ్ ను ఆయుధంగా వాడుకొని ప్రత్యర్థిజట్లను మానసికంగా దెబ్బతీసే కంగారూలను అదే వ్యూహంతో తాము దెబ్బకొట్టామని, వాళ్లు ఒకటంటే..మనం మూడు అనాలని తన ఆటగాళ్లకు నూరిపోసినట్లు రవిశాస్త్రి తెలిపారు. క్రికెట్ రిటైర్మెంట్ తరువాత రవిశాస్త్రి 24 సంవత్సరాలపాటు వాఖ్యాతగా వ్యవహరించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నారు.