Telugu Global
CRIME

ఆమెను రేప్ చేయడం నేరం.. ఆమె పేరు బహిరంగ పరచడం మరో నేరం..

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ తో నటీమణులు ఇతర మహిళా టెక్నీషియన్లు ఎంతగా ఇబ్బంది పడ్డారు, పడుతున్నారనే విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. అవకాశాల పేరుతో ఆడవారిని లొంగదీసుకోవడం అన్ని రాష్ట్రాల సినిమా ఇండస్ట్రీల్లో ఆమధ్య కలకలం రేపింది. క్యాస్టింగ్ కౌచ్ పై మహిళలు ధైర్యంగా మాట్లాడటం, ముందుకొచ్చి తమ బాధలు చెప్పుకోవడం మొదలు పెట్టాక ఈ జాడ్యం ఇక అంతమైపోతుందని అనుకున్నారంతా. కానీ మలయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబు లాంటివారు ఇంకా ఆడవారి జీవితాలతో […]

ఆమెను రేప్ చేయడం నేరం.. ఆమె పేరు బహిరంగ పరచడం మరో నేరం..
X

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ తో నటీమణులు ఇతర మహిళా టెక్నీషియన్లు ఎంతగా ఇబ్బంది పడ్డారు, పడుతున్నారనే విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. అవకాశాల పేరుతో ఆడవారిని లొంగదీసుకోవడం అన్ని రాష్ట్రాల సినిమా ఇండస్ట్రీల్లో ఆమధ్య కలకలం రేపింది. క్యాస్టింగ్ కౌచ్ పై మహిళలు ధైర్యంగా మాట్లాడటం, ముందుకొచ్చి తమ బాధలు చెప్పుకోవడం మొదలు పెట్టాక ఈ జాడ్యం ఇక అంతమైపోతుందని అనుకున్నారంతా. కానీ మలయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబు లాంటివారు ఇంకా ఆడవారి జీవితాలతో ఆడుకుంటున్నారని, అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది వుమన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC) సంస్థ. మలయాళ సినిమా నటీమణులతో కలసి ఏర్పడిన ఈ సంస్థ.. విజయ్ బాబు లాంటి వారిని ఊరికే వదిలిపెట్టకూడదని డిమాండ్ చేస్తోంది.

విజయ్ చేసిన తప్పేంటి..?
మలయాళ ఇండస్ట్రీలో నిర్మాత కమ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు విజయ్ బాబు. ఇటీవల ఇతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. విజయ్ బాబు తనని రేప్ చేశారని ఓ నటి ఎర్నాకుళం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మత్తుమందు ఇచ్చి తనను రేప్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆ కేసు విచారణలో ఉండగా.. విజయ్ బాబు పరారయ్యాడు. పోలీసులు అతనికోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో సడన్ గా ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చిన విజయ్ బాబు.. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. అదే సమయంలో తనపై ఆరోపణలు చేసిన నటి పేరుని అతను బహిరంగ పరచాడు. ఆమెపై ప్రత్యారోపణలు చేశాడు. రేప్ చేయడం నేరమైతే.. రేప్ కి గురైన బాధితురాలి పేరుని సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసేలా చెప్పడం మరో నేరం అంటూ WCC ఆరోపిస్తోంది. గతంలో కూడా విజయ్ బాబు సహనటులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో అతనిపై మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసేలా పరారీలో ఉన్న నిందితుడు ఫేస్ బుక్ లో పోస్ట్ లు పెట్టడం ఏంటని WCC సభ్యులు ప్రశ్నిస్తున్నారు.

పరారీలో ఉన్న విజయ్ బాబుపై ఎర్నాకులం సిటీ కమిషనర్ కార్యాలయంలో కేసు నమోదైంది. అదే సమయంలో.. తనపై ఫిర్యాదు చేసిన నటి గుర్తింపుని బహిరంగ పరిచినందుకు మరో సెక్షన్ కింద అతడిపై కేసు నమోదు చేస్తామని కొచ్చిన్ పోలీసులు తెలిపారు. విజయ్ బాబుపై వచ్చిన ఫిర్యాదులో వాస్తవాలున్నాయని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు పోలీసులు తెలిపారు. అతడికోసం గాలిస్తున్నామని చెప్పారు. బాధితురాలి పేరు బహిరంగ పరచడం కూడా నేరమేనని, అందుకే అతడిపై మరో కేసు నమోదు చేస్తున్నట్టు తెలిపారు.

First Published:  27 April 2022 12:14 PM GMT
Next Story