Telugu Global
Others

గొడవలు వద్దు అని చెప్పిన కాసేపటికే..

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడం అనేది తర్వాత సంగతి. ముందు ఈ నాయకుల మధ్య విభేదాలు ఎప్పుడు సమసిపోతాయా అని ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని నాయకులే స్వయంగా చెబుతుంటారు. కానీ ఆ స్వేచ్ఛను ఇష్టానుసారం వాడేసి.. పార్టీ పరువు తీస్తున్నారని సీనియర్లపై క్యాడర్ మండిపడుతున్నారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తూ […]

గొడవలు వద్దు అని చెప్పిన కాసేపటికే..
X

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడం అనేది తర్వాత సంగతి. ముందు ఈ నాయకుల మధ్య విభేదాలు ఎప్పుడు సమసిపోతాయా అని ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని నాయకులే స్వయంగా చెబుతుంటారు. కానీ ఆ స్వేచ్ఛను ఇష్టానుసారం వాడేసి.. పార్టీ పరువు తీస్తున్నారని సీనియర్లపై క్యాడర్ మండిపడుతున్నారు.

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తూ పార్టీ కార్యకర్తల్లో ఊపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే సీతక్క, చైర్ పర్సన్ మల్లు భట్టి విక్రమార్క ప్రజల్లో కనపడుతున్నారు. కానీ మిగిలిన సీనియర్ నాయకులు మాత్రం మీడియా మైకుల ముందు తప్ప క్షేత్రస్థాయి పర్యటనలు మర్చిపోయారు. ఇటీవల కాలంలో పార్టీ సీనియర్లు ఎవరికి వారు అనే చందంగా మారిపోయినట్లు విమర్శలు వస్తున్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్, జగ్గారెడ్డి వంటి సీనియర్లు మీడియా ముందే సొంత పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. రోజు రోజుకూ విభేదాలు ఎక్కువ అవుతుండటంతో అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది.

పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో కలిసి మాట్లాడారు. సీనియర్లు అందరూ విభేదాలు వీడి తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలని సూచించాడు. పార్టీలో కొట్లాడుకోవడం కాదు అధికారంలోకి రావడానికి టీఆర్ఎస్, బీజేపీలతో కొట్లాడండి. ప్రజా సమస్యలపై పోరాడండి అని గట్టిగా క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. ఇగోలతో పార్టీ పరువును బజారుకు ఈడ్చొద్దని.. ఏవైనా ఉంటే పరిష్కరించుకోవాలని సూచించాడు. పరిష్కారం కానీ సమస్యలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చాడు.

రాహుల్‌తో జరిగిన సమయావేశంలో అందరూ తమ బాధలను ఏకరువు పెట్టారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి సీనియర్లు ఈ భేటీలో ఉన్నారు. మీటింట్ అయిపోయిన తర్వాత రాహుల్ గాంధీ ఎవరితోనూ ఏకంతంగా భేటీ కాలేదు. అందరినీ ముందు పెట్టుకొని మాత్రమే మాట్లాడాడు. కలిసి ఉండండని చెప్పి భేటీ ముగించాడు.

అలా మీటింగ్ ముగిసి బయటకు వచ్చాక.. కాంగ్రెస్ నాయకులు మళ్లీ మొదటికి వచ్చారు. అందరూ కలసి మీడియాతో మాట్లాడుతుండగానే.. కోమటిరెడ్డి అక్కడి నుంచి అసంతృప్తిగా వెళ్లిపోయాడు. రాహుల్ గాంధీ కలిసుండమని చెప్పి ఐదు నిమిషాలు కాకముందే కాంగ్రెస్ నాయకుల తీరు మరోసారి బయటపడింది. గొడవలు వద్దు అని చెప్పినా.. సీనియర్ల చెవికి మాత్రం ఎక్కనట్లే కనపడింది. ఇలా అయితే అధికారంలోకి రావడం కాదు కదా.. క్యాడర్‌ను కూడా కాపాడుకోలేరని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

First Published:  5 April 2022 1:11 AM GMT
Next Story