Telugu Global
International

ఇమ్రాన్ స్థానంలో పాకిస్తాన్ కి ఆపద్ధర్మ ప్రధానిగా గుల్జార్ అహ్మద్..

పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ని పదవినుంచి దించేయడానికి ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నం మరో మలుపు తిరిగింది. ఇమ్రాన్ ఖాన్ పై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఖాసిమ్ సూరి తిరస్కరించడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఆదేశ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే.. ఆపద్ధర్మ ప్రధాని అంటూ కొత్త వ్యూహం రచించారు ఇమ్రాన్ ఖాన్. తనపై వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జాతీయ […]

ఇమ్రాన్ స్థానంలో పాకిస్తాన్ కి ఆపద్ధర్మ ప్రధానిగా గుల్జార్ అహ్మద్..
X

పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ని పదవినుంచి దించేయడానికి ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నం మరో మలుపు తిరిగింది. ఇమ్రాన్ ఖాన్ పై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఖాసిమ్ సూరి తిరస్కరించడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఆదేశ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే.. ఆపద్ధర్మ ప్రధాని అంటూ కొత్త వ్యూహం రచించారు ఇమ్రాన్ ఖాన్. తనపై వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆపద్ధర్మ ప్రధాని బాధ్యతలు చేపట్టడం అనివార్యమైంది. ఒకరకంగా ఇది ఇమ్రాన్ ఖాన్ పై వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నమే. ఇమ్రాన్ ని నేరుగా పదవీచ్యుతుడిని చేయకుండా ఆయనపై సింపతీ పెంచే ప్రయత్నం చేశారు అధ్యక్షుడు అల్వీ. జాతీయ అసెంబ్లీని రద్దు చేసి, ఆపద్ధర్మ ప్రధాని పదవికి పేర్లను సూచించాల్సిందిగా ఇమ్రాన్‌ ఖాన్ తోపాటు, ప్రతిపక్ష నాయకుడు షెహబాజ్‌ షరీఫ్‌ కి కూడా అధ్యక్షుడు లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించిన ఇమ్రాన్‌.. పాక్‌ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గుల్జార్‌ అహ్మద్‌ పేరును ప్రతిపాదించారు. గుల్జార్ ని ఆపద్ధర్మ ప్రధానిగా ప్రకటిస్తూ, అప్పటి వరకూ ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా కొనసాగుతారని ఆదేశాలిచ్చారు పాక్ అధ్యక్షుడు అల్వీ.

సభలో నాటకీయ పరిణామాలు..
ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ పై అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్‌ ఖాసిమ్‌ సూరి తిరస్కరించిన తర్వాత పాక్ జాతీయ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌) నాయకుడు, మాజీ స్పీకర్‌ సర్దార్‌ అయాజ్‌ సాదిక్‌ అధ్యక్షతన ప్రతిపక్ష నేతలు సభ నిర్వహించారు. ఇమ్రాన్‌ పై విపక్ష నాయకుడు షెహబాజ్‌ షరీఫ్‌ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 197 ఓట్లతో తీర్మానం ఆమోదం పొందినట్లు అయాజ్‌ సాదిక్‌ ప్రకటించారు. అధికార పక్షం లేకుండా, అసలు సభాపతే లేకుండా ఇలా ప్రైవేట్ అసెంబ్లీ పెట్టాయి ప్రతిపక్షాలు.

సుప్రీం కోర్టులో బంతి..
పాకిస్తాన్ లోని రాజకీయ సంక్షోభానికి సుప్రీంకోర్టు శుభం కార్డు వేస్తుందనే ఆశ కొందరిలో ఉంది. డిప్యూటీ స్పీకర్‌ అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడాన్ని, ప్రధాని సిఫార్సుతో దేశాధ్యక్షుడు జాతీయ అసెంబ్లీని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు ఉమ్మడిగా సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశాయి. దీనిపై ఈరోజు కూడా విచారణ జరుగుతుంది. సుప్రీం తీర్పుతో రాజకీయ సంక్షోభం సమసిపోతుందా లేక ఆపద్ధర్మ ప్రధాని నేతృత్వంలో మరికొన్నాళ్లు పాక్ లో రాజకీయ వేడి కొనసాగుతుందా అనేది తేలిపోతుంది.

First Published:  4 April 2022 9:06 PM GMT
Next Story