Telugu Global
NEWS

ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణ.. ఉద్యమ కార్యాచరణ సిద్ధం..

ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ సర్కారు, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని రాష్ట్రం, కాదు ఆ బాధ్యత రాష్ట్రానిదేనంటూ కేంద్రం.. యుద్ధం మొదలు పెట్టాయి. ఇదివరకే దీనిపై పోరుబాటకు సిద్ధమయ్యారు సీఎం కేసీఆర్. తాజాగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ సిద్ధమైంది. ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణ ఎలా ఉంటుందో బీజేపీ నేతలకు చూపిస్తామంటున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు. ముందు శాంతియుత పద్ధతుల్లో.. ఉద్యమ కార్యాచరణను ఈనెల […]

ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణ.. ఉద్యమ కార్యాచరణ సిద్ధం..
X

ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ సర్కారు, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని రాష్ట్రం, కాదు ఆ బాధ్యత రాష్ట్రానిదేనంటూ కేంద్రం.. యుద్ధం మొదలు పెట్టాయి. ఇదివరకే దీనిపై పోరుబాటకు సిద్ధమయ్యారు సీఎం కేసీఆర్. తాజాగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ సిద్ధమైంది. ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణ ఎలా ఉంటుందో బీజేపీ నేతలకు చూపిస్తామంటున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు.

ముందు శాంతియుత పద్ధతుల్లో..
ఉద్యమ కార్యాచరణను ఈనెల 3న టీఆర్ఎస్ ప్రకటించబోతోంది. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా, ఏ ఒక్క వర్గానికి నష్టం కలగకుండా కేంద్రంపై ఒత్తిడి పెరిగేలా నిరసన కార్యక్రమాలు చేపడతామంటున్నారు టీఆర్ఎస్ నేతలు. ఈమేరకు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే కార్యాచరణ రూపొందించారని చెబుతున్నారు. బంద్‌ లు, రాస్తారోకోల జోలికి వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు పరీక్షల సీజన్‌ ప్రారంభమవుతుండటంతో క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలు వినూత్నంగా ఉండాలని సీఎం భావిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలంటున్నాయి.

ప్రతి ఇంటిపై నల్లజెండా..
తెలంగాణలో ప్రతి ఇంటిపై నల్ల జెండా ఎగరేయాలని పార్టీ కేడర్‌కు ఇప్పటికే టీఆర్ఎస్ అధిష్టానం నుంచి సంకేతాలు వెళ్లాయి. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీల ఇళ్లను రైతులతో కలసి ముట్టడించాలని పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలుపై బీజేపీ నేతల వైఖరి చెప్పాలంటూ ఎక్కడికెళ్తే అక్కడికి వెంబడించి నిలదీసి, నిరసన తెలపాలంటూ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ నెల 14న గద్వాల నుంచి తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్రను కేంద్ర మంత్రి అమిత్‌ షా ప్రారంభించాల్సి ఉంది. ఆ సమయానికే టీఆర్ఎస్ మొదలు పెట్టిన ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకునేలా కార్యాచరణ సిద్ధమైంది.

మలి దశలో ఢిల్లీ వేదికగా..
రాష్ట్రంలో రైతు ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ నిరసనకు దిగుతారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలంతా ఢిల్లీకి వెళ్లి నిరసనల్లో పాల్గొంటారని అంటున్నారు. రైతు సంఘాలు, భావ సారూప్య రాజకీయ పార్టీలకు చెందిన సీఎంలు, ఇతర నేతల్ని కూడా ఈ దీక్షకు ఆహ్వానిస్తారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఉత్తరాది రైతులు చేసిన ఆందోళన తరహాలోనే తెలంగాణ రైతాంగం, నేతలంతా ఢిల్లీలో తమ సత్తా చూపించాలనుకుంటున్నారు.

తెలంగాణ ఉద్యమం స్ఫురణకు తెచ్చేలా..
తెలంగాణ ఉద్యమంలో అనేక వినూత్న నిరసన రూపాలను చూపామని, ఉగాది తర్వాత మొదలయ్యే రైతు ఉద్యమంలోనూ సరికొత్త ఉద్యమ రూపాలను చూపిస్తామంటున్నారు టీఆర్ఎస్ నేతలు. వరి కొనుగోలుకు కేంద్రం దిగివచ్చేలా ఆందోళన కార్యక్రమాలు చేపడతామంటున్నారు.

First Published:  31 March 2022 9:34 PM GMT
Next Story