Telugu Global
National

డిమాండ్ పెరిగింది.. అమ్మకాలు తగ్గాయ్..

డిమాండ్ పెరిగితే సప్లై కూడా పెరగాలి. కానీ ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ లో కార్లకు డిమాండ్ పెరగడమే కానీ సప్లై పెరగడంలేదు. ముందు ముందు మరింత డిమాండ్ పెరుగుతుంది, దానికి తగ్గట్టు రేటు కూడా పెరుగుతుందనే అంచనాలున్నా ఇప్పటికిప్పుడు నచ్చిన మోడల్ కారు కొనుక్కోవడం మాత్రం కస్టమర్లకు అసాధ్యంగా మారింది. కరోనా తర్వాత మారిన అంతర్జాతీయ పరిణామాలతో చిప్ లకు కొరత రావడం, కార్ల విడిభాగాలకు డిమాండ్ పెరగడం, తయారీ మందగించడంతో భారత మార్కెట్ కూడా ఇబ్బందులు […]

డిమాండ్ పెరిగింది.. అమ్మకాలు తగ్గాయ్..
X

డిమాండ్ పెరిగితే సప్లై కూడా పెరగాలి. కానీ ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ లో కార్లకు డిమాండ్ పెరగడమే కానీ సప్లై పెరగడంలేదు. ముందు ముందు మరింత డిమాండ్ పెరుగుతుంది, దానికి తగ్గట్టు రేటు కూడా పెరుగుతుందనే అంచనాలున్నా ఇప్పటికిప్పుడు నచ్చిన మోడల్ కారు కొనుక్కోవడం మాత్రం కస్టమర్లకు అసాధ్యంగా మారింది. కరోనా తర్వాత మారిన అంతర్జాతీయ పరిణామాలతో చిప్ లకు కొరత రావడం, కార్ల విడిభాగాలకు డిమాండ్ పెరగడం, తయారీ మందగించడంతో భారత మార్కెట్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంది. మూలిగే నక్కపై తాటిపండు లాగా ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల చిప్ లు, సెమీ కండక్టర్ల కొరత మరింత పెరిగింది. దీంతో మరోసారి వాహన రంగంలో అమ్మకాలు నిదానించాయి.

గరిష్టంగా రెండేళ్లు వేచి చూడాల్సిందే..
కొత్త కార్ల మోడల్స్ ని అట్టహాసంగా మార్కెట్ లో ప్రవేశపెడుతున్నా.. డిమాండ్ తగ్గట్టు వాటిని సప్లై చేయడం మాత్రం పెద్ద పెద్ద కంపెనీలకు తలకు మించిన భారంగా మారుతోంది. గతంలో ఏ కారు కావాలన్నా డబ్బుంటే నిమిషాల్లో డెలివరీ ఇచ్చేసే పరిస్థితి. కొత్త మోడల్ కావాలంటే నెలరోజులకంటే ఎక్కువ ఆలస్యమయ్యేది కాదు. కానీ ఇప్పుడు డిమాండ్ ఉన్న మోడల్ కారు కావాలంటే మినిమమ్ 4 నెలలు ఆగాలి. కొన్ని రకాల కార్లకోసం గరిష్టంగా రెండేళ్లు టైమ్ చెబుతున్నారట షోరూమ్ యజమానులు.

ప్రత్యామ్నాయం లేదా..?
కరోనాతో లాక్‌ డౌన్‌ వల్ల చిప్ లు, సెమీ కండక్టర్ల ఉత్పత్తి పడిపోయింది. ఇటీవల ఆంక్షలు ఎత్తివేసినా ఆ కొరత ప్రభావం కొనసాగుతూనే ఉంది. కొవిడ్‌ సమయంలోనే అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విడిభాగాల తయారీలో ప్రముఖ కంపెనీలను కూడా అమెరికా బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కార్ల తయారీ మరింత ఆలస్యం అయింది. ప్రస్తుతం పరిస్థితి మరింత మెరుగుపడ్డా.. గిరాకీ ఎక్కువగా ఉండటంతో.. దానికి తగ్గట్టు సప్లై లేకపోవడంతో కార్ల డెలివరీ ఆలస్యమవుతోంది. సెమీకండక్టర్ల తయారీకి ఉపయోగించే పల్లాడియం, రోడియం, ప్లాటినం వంటి లోహాలను రష్యా ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. నియోన్‌ గ్యాస్‌ సరఫరాలో ఉక్రెయిన్ ది మొదటి స్థానం. ఇప్పుడీ రెండు దేశాల మధ్య యుద్దంతో వాటి ధరలు భారీగా పెరిగాయి. ఇక అల్యూమినియం, ఇతర లోహాల ధరలు కూడా రికార్డ్ స్థాయికి చేరడంతో పరిస్థితి మరింత దిగజారింది. అయితే దీనికి ప్రత్యామ్నాయం మాత్రం ఇంకా దొరకలేదు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా చిప్ లు, సెమీ కండక్టర్ల తయారీని స్థానికంగా చేపట్టినా స్వయం సమృద్ధి సాధించడానికి ఇంకా కొన్నేళ్లు పడుతుంది. దీంతో ప్రస్తుతం వాహనరంగం ముఖ్యంగా కార్ల బిజినెస్ ఇబ్బందుల్లో పడింది.

First Published:  26 March 2022 10:32 PM GMT
Next Story