Telugu Global
Cinema & Entertainment

మూవీ రివ్యూ " ఆర్ఆర్ఆర్

నటీనటులు : రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్, ఒలివ, అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ , శేఖర్, రాజీవ్ కనకాల తదితరులు సంగీతం : కీరవాణి సినిమాటోగ్రఫీ : సెంథిల్ ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్ మాటలు : సాయి మాధవ్ బుర్రా ఆర్ట్ డైరెక్టర్ : సబు సిరిల్ కథ : విజయేంద్ర ప్రసాద్ నిర్మాణం : డి.వి.వి.దానయ్య కథనం-దర్శకత్వం : రాజమౌళి రేటింగ్ – 3/5 రాజమౌళి అంటేనే ఎమోషన్స్. […]

మూవీ రివ్యూ  ఆర్ఆర్ఆర్
X

నటీనటులు : రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్, ఒలివ, అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ , శేఖర్, రాజీవ్ కనకాల తదితరులు
సంగీతం : కీరవాణి
సినిమాటోగ్రఫీ : సెంథిల్
ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
మాటలు : సాయి మాధవ్ బుర్రా
ఆర్ట్ డైరెక్టర్ : సబు సిరిల్
కథ : విజయేంద్ర ప్రసాద్
నిర్మాణం : డి.వి.వి.దానయ్య
కథనం-దర్శకత్వం : రాజమౌళి
రేటింగ్ – 3/5

రాజమౌళి అంటేనే ఎమోషన్స్. సిల్వర్ స్క్రీన్ పై హై-ఎమోషన్స్ పండించగల దిట్ట జక్కన్న. అతడి ట్రేడ్ మార్క్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఎమోషనల్ డ్రామాగా ఆర్ఆర్ఆర్ తెరకెక్కి ఉంటుందని ప్రేక్షకులు అంచనా వేశారు. వాళ్ల అంచనాలు నిజమే. కాకపోతే బాహుబలి ఫ్రాంచైజీతో పోలిస్తే మాత్రం కొద్దిగా నిరాశ తప్పదు.

బాహుబలి సినిమాలో యాక్షన్ ఉంది. కానీ అందులో కూడా ఎమోషన్ ఉంది. అందుకే భాషలతో సంబంధం లేకుండా అంత పెద్ద హిట్టయింది. ఆర్ఆర్ఆర్ లో కూడా ఎమోషన్ ఉంది. కానీ యాక్షన్ దాన్ని డామినేట్ చేసింది. జక్కన్న అభిమానులతో పాటు, ప్రేక్షకులు కొద్దిగా నిరాశచెందే అంశం ఇదే. సినిమా అంతా బాగుంది, ఏదో వెలితి, మనసుకు హత్తుకోవడం లేదెందుకు? దానికి కారణం ఎమోషన్ పాళ్లు తగ్గడమే

ఇది మినహాయిస్తే, ఆర్ఆర్ఆర్ లో వంక పెట్టడానికేం లేదు. అద్భుతమైన విజువల్స్. మీరు ఇప్పటివరకు సినిమా చూడకపోతే కచ్చితంగా బిగ్ స్క్రీన్ లోనే ఈ సినిమా చూడండి. జక్కన్న అంత అద్భుతంగా చెక్కాడు ఈ సినిమాని. సరే.. జక్కన్న పనితనం గురించి చెప్పుకోబోయే ముందు, సినిమా అసలు సమీక్షలోకి వెళ్లేముందు.. బ్రీఫ్ గా కథ ఏంటో ఓ లుక్కేద్దాం..

1920, ఢిల్లీ బ్యాక్ డ్రాప్ లో కథ మొదలవుతుంది. నాలుగేళ్ల నుంచి రాజమౌళి చెబుతున్నట్టు ఇందులో స్వతంత్ర ఉద్యమ ఛాయలు తక్కువ, ఫ్రెండ్ షిప్, రివెంజ్ ఛాయలు ఎక్కువగా ఉన్నాయి. గోండులకు అండగా ఉంటాడు కొమురం భీమ్. వాళ్ల తెగ నుంచి మల్లి అనే చిన్నారిని స్కాట్ దొర ఎత్తుకెళ్తాడు. ఆమెను విడిపించి తన గూడెంకు తీసుకెళ్లేందుకు ఢిల్లీకి వెళ్తాడు భీమ్. అదే ఢిల్లీలో బ్రిటిష్ అండర్ లో పోలీస్ గా పనిచేస్తుంటాడు రామారావు. స్కాట్ పై దాడికి వచ్చాడనే సమాచారం అందుకున్న బ్రిటిషర్లు, భీమ్ ను పట్టిస్తే, ప్రమోషన్ ఇస్తామని రామారావుకు ఆఫర్ ఇస్తారు. భీమ్ కోసం మఫ్టీలో తిరుగుతున్న రామారావు, అతడని తెలియకుండానే అతడితో స్నేహం చేస్తాడు. ఇద్దరూ బాగా కలిసిపోతారు. కట్ చేస్తే, తను వెదుకుతున్న వ్యక్తి ఇతడే అని తెలుసుకున్న రామారావు డ్యూటీ ఫస్ట్ అంటూ భీమ్ ను అరెస్ట్ చేస్తాడు.

అయితే తర్వాత తన తప్పు తాను గ్రహించి భీమ్ ను ఉరిశిక్ష నుంచి తప్పిస్తాడు. అదే సమయంలో మల్లిని కూడా విడిపిస్తాడు. దీన్ని దేశద్రోహం కింద పరిగణించి రామారావును అరెస్ట్ చేస్తారు బ్రిటిషర్లు. అతడికి ఉరిశిక్ష అమలు చేస్తారు. రామారావు కాబోయే భార్య సీత ద్వారా, రామారావు అసలు లక్ష్యాన్ని, ఆశయాన్ని తెలుసుకున్న భీమ్… తన స్నేహితుడు రామారావు కోసం తిరిగి ఢిల్లీకి వెళ్తాడు. ఇద్దరూ కలిసి ఎలా బ్రిటిష్ ఎంపైర్ ను కూల్చారు, స్కాట్ ను అంతమొందించారు అనేది బ్యాలెన్స్ స్టోరీ.

ఇప్పుడు మనం ఎలాగైతే చెప్పుకున్నామో.. ఆర్ఆర్ఆర్ సినిమాలో నెరేషన్ కూడా అలానే ఉంది. ఆ నెరేషన్ సినిమాకు మైనస్ అయింది. ఉదాహరణకు బాహుబలినే తీసుకుంటే, పార్ట్-1లో బాహుబలిని కట్టప్ప చంపేస్తాడు. అదో పెద్ద షాక్. పార్ట్-2లో అలాంటివి మరిన్ని షాక్ ఇచ్చే సన్నివేశాలున్నాయి. రాజమౌళి గత సినిమాలు ఛత్రపతి, సింహాద్రి లాంటి సినిమాల్లో కూడా అలాంటి షాకింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ కు వచ్చేసరికి మాత్రం ఆ ‘షాక్’ మిస్సయింది. అంతా మనం అనుకుంటున్నట్టుగానే స్క్రీన్ ప్లే సాగింది. రాజమౌళి లాంటి దర్శకుడి నుంచి ఊహించే నెరేషన్ మాత్రం కాదిది. కనీసం 2-3 చోట్ల ఆశ్చర్యపరుస్తాడని ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశ మిగిలింది. ఈసారి నెరేషన్ కంటే, గ్రాండియర్ విజువల్స్, భారీతనం, యాక్షన్ ఎపిసోడ్స్ పై రాజమౌళి ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఇది సరైన ఎత్తుగడ కాదనిపిస్తుంది.

ఫస్టాఫ్ చాలా సాదాసీదాగా మొదలవుతుంది. ముందుగా గోండు ప్రాంతం, ఆ తర్వాత రామరావు ఇంట్రో, ఆ తర్వాత భీమ్ ఇంట్రో.. ఆ తర్వాత పాప కోసం ఢిల్లీ వెళ్లడం.. ఇలా ఫ్లాట్ గా సాగుతుంది నెరేషన్. ఇక్కడ స్క్రీన్ ప్లే మాత్రమే సాదాసీదా. తెరపై విజువల్, చిరు-తారక్ ఇంట్రో సీన్లు మాత్రం నభూతో అన్నట్టు ఉన్నాయి. అసలు భీమ్ ఎవరో గుర్తించి, అతడ్ని అరెస్ట్ చేయడంతో ఇంటర్వెల్ ట్విస్ట్ పడుతుంది. ఇది పూర్తిగా రాజమౌళి మార్కుతో సాగుతుంది. ఇంటర్వెల్ ఫైట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అదొక అద్భుతం.

సెకండాఫ్ మళ్లీ ఊహించినట్టుగానే మొదలవుతుంది. ఎన్టీఆర్ అరెస్ట్, రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్, సీత ఎపిసోడ్, క్లైమాక్స్ ఇలా వరుసగా ఇటుకలు పేర్చినట్టు నెరేషన్ సాగిపోతుంది. సెకండాఫ్ లో ఉన్నంతలో కొమురం భీముడో అనే సాంగ్ తో పాటు వచ్చే ఎపిసోడ్, క్లైమాక్స్ మాత్రమే ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ క్రేజ్ ను లెక్కవేసుకోలేదని, వాళ్ల స్క్రీన్ టైమ్ చూడలేదని, కేవలం పాత్రల్ని మాత్రమే చూశానని చెప్పుకొచ్చిన రాజమౌళి.. సినిమాలో మాత్రం ఆ లెక్కలన్నీ వేశాడు. హీరోలిద్దరికీ ఎలివేషన్లు సమానంగా పంచాడు. ఫస్టాఫ్ లో తారక్ తో పులి ఫైట్ పెట్టిన రాజమౌళి, సెకండాఫ్ లో రామారావు పాత్రను అమాంతం లేపాడు. అలా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు.

పెర్ఫార్మెన్స్ పరంగా చరణ్, తారక్ లో ఎవరు బెస్ట్ అని చెప్పడానికి వీల్లేదు. ఇద్దరూ ఇద్దరే. ఇద్దరూ తమ కెరీర్ బెస్ట్ ఇచ్చారు. శ్రియ, సముత్తర ఖని, అజయ్ దేవగన్, అలియాభట్, రాహుల్ రామకృష్ణ తమ పాత్రల మేరకు మెప్పించారు. టెక్నికల్ గా కూడా సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంది. సబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్, సెంధిల్ సినిమాటోగ్రఫీ, సాయిమాధవ్ మాటలు, కీరవాణి సంగీతం అన్నీ ఉన్నతంగా ఉన్నాయి.

దర్శకుడిగా రాజమౌళి మరోసారి తన మార్క్ చూపించాడు. అతడి బలం ఏంటో ఈ సినిమా చూస్తే మరోసారి అర్థమౌతుంది. ఓ సీన్ ను రాజమౌళి కంటే బాగా మరో దర్శకుడు తీయలేడేమో అనిపిస్తుంది. ఎమోషన్ ను జక్కన్న కంటే బలంగా ఎవ్వరూ చూపించలేరేమో అనిపిస్తుంది. అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఈ సినిమా వరకు ఎమోషన్స్, నెరేషన్ విషయంలో రాజమౌళి తడబడ్డాడు. సెకెండాఫ్ పై మిక్స్ డ్ టాక్ రావడానికి ఇదే కారణం.

ఓవరాల్ గా అద్భుతమైన విజువల్స్, ఎన్టీఆర్-చరణ్ మెస్మరైజింగ్ యాక్టింగ్, యాక్షన్ విజువల్స్ కోసం ఆర్ఆర్ఆర్ సినిమాను ఓసారి చూడొచ్చు.

Next Story