Telugu Global
NEWS

అభివృద్ధి వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాం- అసెంబ్లీలో సీఎం జగన్‌

అభివృద్ధి వికేంద్రీకరణకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్. ఇటీవల మూడు రాజధానుల బిల్లు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా సీఎం జగన్ మరోసారి ప్రభుత్వ నిర్ణయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రానికి రాజధానిని నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉందన్నారు. న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ అనేవి తమ పరిధిలో పనిచేస్తేనే.. మిగిలిన వ్యవస్థలన్నీ సజావుగా సాగుతాయని, లేదంటే వ్యవస్థలన్నీ […]

అభివృద్ధి వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాం- అసెంబ్లీలో సీఎం జగన్‌
X

అభివృద్ధి వికేంద్రీకరణకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్. ఇటీవల మూడు రాజధానుల బిల్లు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా సీఎం జగన్ మరోసారి ప్రభుత్వ నిర్ణయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రానికి రాజధానిని నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉందన్నారు.

న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ అనేవి తమ పరిధిలో పనిచేస్తేనే.. మిగిలిన వ్యవస్థలన్నీ సజావుగా సాగుతాయని, లేదంటే వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయని అన్నారు సీఎం జగన్. మంచి చట్టాలను తీసుకొస్తే ప్రజలు మళ్లీ అదే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని, నచ్చకపోతే తిరస్కరిస్తారని చెప్పారు. చట్టాన్నే వెనక్కి తీసుకున్న తర్వాత, దానిపై తీర్పునివ్వడం ఏంటని ప్రశ్నించారు. చట్టాలు చేసే అధికారం శాసన వ్యవస్థకే ఉంటుందన్నారు.

తీర్పునిచ్చే సందర్భంలో.. నెలరోజుల్లో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్లు, డ్రైన్లు, విద్యుత్‌ సదుపాయాలు కల్పించాలని, లక్ష కోట్లు వెచ్చించి అభివృధ్ధి చేయాలని కోర్టు సమయం నిర్దేశించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు జగన్. అలా సమయం నిర్దేశించడం కరెక్ట్ కాదన్నారాయన. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్లే రాష్ట్ర విభజన ఉద్యమం వచ్చిందని, శివరామకృష్ణన్‌ కమిటీ కూడా వికేంద్రీకరణ జరగాలని చెప్పిందని, అభివృద్ధి వికేంద్రీకరణకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

హైకోర్టు తీర్పు చూస్తే రాజ్యాంగ పరంగానే కాకుండా రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారాలను కూడా ప్రశ్నించే విధంగా ఉందని చెప్పారు జగన్. ఇటీవల రాష్ట్ర హైకోర్టు తన పరిధిని దాటినట్టు అర్థమవుతోందని, అందుకే అసెంబ్లీలో దీనిపై చర్చించాల్సి వచ్చిందని అన్నారు. రాజధాని ఎక్కడ ఉండాలన్న నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని, ఆ విషయాన్ని ఇటీవల కేంద్రం కూడా స్పష్టం చేసిందని గుర్తు చేశారు. రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ అధికారమేనంటూ ఆర్టికల్‌ 3ని కోట్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వమే హైకోర్టుకు నివేదించిందని, ఆ మేరకు అఫిడవిట్‌ కూడా దాఖలు చేసిందని చెప్పారు. హైకోర్టు తీర్పును పరిశీలిస్తే దేశ సమాఖ్య స్ఫూర్తికి, శాసనసభ అధికారాలకు పూర్తి విరుద్ధంగా ఉందని అన్నారు. రాష్ట్ర శాసనసభ అధికారాలను హరించేలా తీర్పు ఉందని, రాజ్యాంగం ప్రకారం చూసినా.. ఈ నిర్ణయంలో కేంద్రం పాత్ర ఉండదని అన్నారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా శాసన సభ అధికారాల విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోవడం సరికాదని చెప్పారు.

First Published:  24 March 2022 8:06 AM GMT
Next Story