Telugu Global
National

హిజాబ్ కేసులో అత్యవసర విచారణకు సుప్రీం నో..

విద్యా సంస్థల్లో హిజాబ్ ధారణపై కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుని విద్యార్థులు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ ని అత్యవసరంగా విచారణకు స్వీకరించాలంటూ న్యాయవాది చేసిన విన్నపాన్ని సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. దీన్నిసంచలనం చేయొద్దంటూ వ్యాఖ్యానించింది. హిజాబ్‌ వ్యవహారంపై అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరించడం ఇది రెండోసారి. మైనార్టీ విద్యార్థుల తరపున సీనియర్‌ న్యాయవాది దేవదత్‌ కామత్‌ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాల కారణంగా విద్యార్థులకు పరీక్షలకు […]

హిజాబ్ కేసులో అత్యవసర విచారణకు సుప్రీం నో..
X

విద్యా సంస్థల్లో హిజాబ్ ధారణపై కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుని విద్యార్థులు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ ని అత్యవసరంగా విచారణకు స్వీకరించాలంటూ న్యాయవాది చేసిన విన్నపాన్ని సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. దీన్నిసంచలనం చేయొద్దంటూ వ్యాఖ్యానించింది. హిజాబ్‌ వ్యవహారంపై అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరించడం ఇది రెండోసారి.

మైనార్టీ విద్యార్థుల తరపున సీనియర్‌ న్యాయవాది దేవదత్‌ కామత్‌ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాల కారణంగా విద్యార్థులకు పరీక్షలకు హాజరు కాలేకపోతున్నారని, వారంతా విద్యా సంవత్సరం నష్టపోయే ప్రమాదం ఉందని, అందుకే ఈ పిటిషన్ ని వెంటనే విచారణకు స్వీకరించాలని న్యాయవాది దేవదత్ సుప్రీంను కోరారు. గతంలో అత్యవసర విచారణ అవసరం లేదన్న సుప్రీం, హోలీ సెలవుల తర్వాత విచారణ చేపడతామంది, కేసు వాయిదా వేసింది. దీంతో మరోసారి సుప్రీంను విచారణకోసం అభ్యర్థించారు లాయర్ దేవదత్. విద్యార్థులకు మార్చి 28నుంచి పరీక్షలు ఉంటాయని, హిజాబ్ లేకుండా తరగతి గదిలోకి అనుమతించకపోతే ఒక సంవత్సరం నష్టపోతారని కోర్టుకు తెలిపారు. ఈ అభ్యర్థనపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. పిటిషన్ కు, పరీక్షలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. హిజాబ్ పిటిషన్లపై విచారణకు నిర్దిష్ట తేదీని చెప్పేందుకు నిరాకరించారు. దీనిని సంచలనం చేయవద్దు అని సూచించారు.

హిజాబ్ కేసులో తీర్పునిచ్చిన కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ రితూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ దీక్షిత్, జస్టిస్ ఖాజీ జైబున్నీసా కు వై కేటగిరీ భద్రత కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కర్నాటక తీర్పుని మైనార్టీ నేతలు స్వాగతించలేదు. కొంతమంది విద్యార్థులు హిజాబ్ లేకుండా స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. వార్షిక పరీక్షలకు కూడా వారు హాజరు కావడంలేదు. అయితే కర్నాటక ప్రభుత్వం హిజాబ్ కారణంగా పరీక్షలకు హాజరు కాలేకపోయిన విద్యార్థులకు మరోసారి అవకాశం కల్పించేది లేదని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుతో అయినా ఈ వివాదం సమసిపోతుందో లేదో చూడాలి.

First Published:  24 March 2022 4:53 AM GMT
Next Story