లంకేయుల వలసబాట.. పరిస్థితులు దారుణం..
శ్రీలంకలో ఈరోజు బియ్యం కేజీ 300 రూపాయలు, రేపటికి అది 500 రూపాయలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా అక్కడ ఉండాలని ఎందుకనుకుంటారు. అక్రమమో, సక్రమమో.. ఆలోచించకుండా వలసబాట పట్టారు. ఆహార కొరత, ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక ఉత్తర ప్రాంతాలైన జాఫ్నా, మన్నార్ నుంచి తమిళులు పెద్ద సంఖ్యలో భారత్ కు వలస వస్తున్నారు. శ్రీలంకకు చెందిన మత్స్యకారుల పడవల్లో కొంతమంది భారతీయ సముద్ర జలాల్లోకి ప్రవేశించారు. రామేశ్వరం తీరానికి సమీపంలోకి వచ్చిన వారిని భారతీయ […]

శ్రీలంకలో ఈరోజు బియ్యం కేజీ 300 రూపాయలు, రేపటికి అది 500 రూపాయలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా అక్కడ ఉండాలని ఎందుకనుకుంటారు. అక్రమమో, సక్రమమో.. ఆలోచించకుండా వలసబాట పట్టారు. ఆహార కొరత, ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక ఉత్తర ప్రాంతాలైన జాఫ్నా, మన్నార్ నుంచి తమిళులు పెద్ద సంఖ్యలో భారత్ కు వలస వస్తున్నారు. శ్రీలంకకు చెందిన మత్స్యకారుల పడవల్లో కొంతమంది భారతీయ సముద్ర జలాల్లోకి ప్రవేశించారు. రామేశ్వరం తీరానికి సమీపంలోకి వచ్చిన వారిని భారతీయ కోస్ట్ గార్డ్ సిబ్బంది కాపాడి, తమిళనాడు పోలీసులకు అప్పగించారు. అక్కడినుంచి శరణార్థి శిబిరానికి తరలించారు. తమ వద్ద ఉన్న డబ్బంతా వారు ఇలా వలస రావడానికి ఖర్చు చేశారట. మరింతమంది భారత్ కు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, అక్కడ అంతా ఆకలితో అలమటిస్తున్నారని శరణార్థులు చెబుతున్నారు.
తినడానికి తిండి లేదు, కొనడానికి డబ్బుల్లేవు..
శ్రీలంక పాలకులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే ఇప్పుడు ఆ దేశాన్ని ఆర్థిక కష్టాల్లోకి నెట్టాయని తెలుస్తోంది. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించే క్రమంలో రసాయనిక ఎరువుల దిగుమతులపై నిషేధం విధించడం, దేశంలోని అందరూ సేంద్రీయ వ్యవసాయమే చేయాలనే నిబంధనలు విధించడంతో ఉత్పత్తి తగ్గిపోయింది, రైతుల్లో అశాంతి నెలకొంది. క్రమంగా కూరగాయలు, ఆహార ధాన్యాల ధరలు పెరిగిపోయాయి. ప్రజల అవసరాలకోసం ఆహార ధాన్యాల దిగుమతులు మొదలు పెట్టినా ఆ వ్యూహం ఫలించలేదు. విదేశీ మారక ద్రవ్యం హరించుకుపోయింది. చివరకు శ్రీలంక అప్పులపాలైంది.
మోసం చేసిన చైనా..
జల రవాణాకోసం శ్రీలంకను వాడుకునేందుకు ఆ దేశానికి భారీగా అప్పులిచ్చిన చైనా ఇప్పుడు మొహం చాటేసింది. కనీసం రుణమాఫీకి హామీ ఇవ్వలేదు, కొత్తగా సాయం చేయలేదు. ఇటు భారత్ మాత్రం వ్యూహాత్మక అడుగు వేసింది. శ్రీలంకకు వెంటనే రూ.7,643 కోట్ల సాయం చేసింది. గతంలో శ్రీలంకకు ఇచ్చిన 90 కోట్ల డాలర్ల రుణాల చెల్లింపుని కూడా వాయిదా వేసింది. విదేశీ సాయం అందినా, దేశీయంగా రక్షణాత్మక చర్యలు చేపట్టినా ఇప్పటికిప్పుడు శ్రీలంక కోలుకునే పరిస్థితులు కనిపించడంలేదు. దీంతో చాలామంది వలసబాట పడుతున్నారు.