కాంగ్రెస్ లో చల్లారిన సంక్షోభం.. జి-23లో చీలిక..
కాంగ్రెస్ లో అంతర్గత సంక్షోభం సమసిపోయినట్టు తెలుస్తోంది. జి-23 నేతలు తిరుగుబాటు జెండా ఎగరేస్తారని అనుకున్నా.. చివరకు అంతా చల్లబడ్డారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని మార్చాలని తాము డిమాండ్ చేయలేదని ఆ పార్టీ సీనియర్ నేత, జి-23 వర్గం నాయకుడు గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన నాయకత్వ మార్పుపై చర్చ జరగలేదని, అసలు తాము నాయకత్వ మార్పు కోరుకోవట్లేదని స్పష్టం చేశారు. నాయకత్వం సమస్యే కాదని, […]
కాంగ్రెస్ లో అంతర్గత సంక్షోభం సమసిపోయినట్టు తెలుస్తోంది. జి-23 నేతలు తిరుగుబాటు జెండా ఎగరేస్తారని అనుకున్నా.. చివరకు అంతా చల్లబడ్డారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని మార్చాలని తాము డిమాండ్ చేయలేదని ఆ పార్టీ సీనియర్ నేత, జి-23 వర్గం నాయకుడు గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన నాయకత్వ మార్పుపై చర్చ జరగలేదని, అసలు తాము నాయకత్వ మార్పు కోరుకోవట్లేదని స్పష్టం చేశారు. నాయకత్వం సమస్యే కాదని, సోనియాను వైదొలగాలని ఎవరూ కోరలేదని, కొన్ని సూచనలను మాత్రమే ఆమె దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
వరుస భేటీలతో హడావిడి..
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక, జి-23 సభ్యులు వరుస భేటీతలో హడావిడి చేశారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఇరుకున పెడతారని అంతా అనుకున్నారు. కాంగ్రెస్ పై గాంధీ కుటుంబం పెత్తనం వద్దంటూ కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. చివరకు జి-23 నేతల ప్రత్యేక భేటీలతో కాంగ్రెస్ అధిష్టానం నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. జి-23లో కీలకంగా ఉన్న గులాంనబీ ఆజాద్ ని చర్చలకు సోనియా పిలిపించింది. అనంతరం ఆజాద్ వ్యాఖ్యలు పూర్తిగా అధిష్టానానికి అనుకూలంగా ఉండటంతో ఆ హడావిడి అంతా టీ కప్పులో తుపానేనని తేలిపోయింది.
కాంగ్రెస్ ఐకమత్యంగా ఉందని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అని, తామంతా కాంగ్రెస్ నాయకులం అని చెప్పుకొచ్చారు ఆజాద్. అంతర్గతంగా చేసిన సిఫారసులను ఇతరులతో బహిరంగంగా పంచుకోలేమని ఆయన మీడియాకు వివరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రస్తావన వచ్చిందని.. ప్రత్యర్థులను ఎలా ఓడించాలనే వ్యూహంపై సోనియాతో చర్చించానని తెలిపారు ఆజాద్.
జి-23లో చీలిక..
మరోవైపు జి-23నుంచి ఒక్కొక్కరే తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆజాద్ వ్యాఖ్యలు ఆ వర్గంలో అయోమయాన్ని కలిగించగా.. రెబెల్ వర్గానికి తాను దూరమని సీనియర్ నేత వీరప్ప మొయిలీ ప్రకటించారు. జి-23 సమాంతర కాంగ్రెస్ గా మారకూడదని.. ఏవైనా సమస్యలుంటే పార్టీ వేదికలపైనే మాట్లాడాలని మొయిలీ సూచించారు. సోనియాను విమర్శించడం ద్వారా కాంగ్రెస్ బలహీనపడుతుందని అన్నారు. జి-23ని ఓ వ్యవస్థగా మార్చకూడదని, ఆ గ్రూపుతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు వీరప్ప మొయిలీ.