Telugu Global
International

చైనాతోపాటు దక్షిణ కొరియానూ చుట్టేసిన కరోనా..

థర్డ్ వేవ్ భారత్ పై పెద్ద ప్రభావం చూపించకుండానే మాయమైంది. అంత మాత్రాన ఇక వైరస్ బలహీనపడిపోయిందని, భారత్ పై పెద్దగా ప్రభావం ఉండదని, ఇక్కడంతా వ్యాక్సిన్లు వేయించుకుని రోగనిరోధక శక్తిని పెంచుకున్నారని, మనకు ఇబ్బందేమీ లేదని అనుకోలేం. అదే సమయంలో కరోనా గురించి వచ్చే వార్తల్లో ఏది నిజం, ఎంత నిజం అనేది తేల్చుకోలేం. కానీ ప్రస్తుతం పరిస్థితి చాపకింద నీరులా ఉందనే విషయం మాత్రం స్పష్టమవుతోంది. ఇప్పటికిప్పుడు భారత్ కి వచ్చిన ముప్పేమీ లేదు […]

చైనాతోపాటు దక్షిణ కొరియానూ చుట్టేసిన కరోనా..
X

థర్డ్ వేవ్ భారత్ పై పెద్ద ప్రభావం చూపించకుండానే మాయమైంది. అంత మాత్రాన ఇక వైరస్ బలహీనపడిపోయిందని, భారత్ పై పెద్దగా ప్రభావం ఉండదని, ఇక్కడంతా వ్యాక్సిన్లు వేయించుకుని రోగనిరోధక శక్తిని పెంచుకున్నారని, మనకు ఇబ్బందేమీ లేదని అనుకోలేం. అదే సమయంలో కరోనా గురించి వచ్చే వార్తల్లో ఏది నిజం, ఎంత నిజం అనేది తేల్చుకోలేం. కానీ ప్రస్తుతం పరిస్థితి చాపకింద నీరులా ఉందనే విషయం మాత్రం స్పష్టమవుతోంది. ఇప్పటికిప్పుడు భారత్ కి వచ్చిన ముప్పేమీ లేదు కానీ.. ఇతర దేశాల్లో పరిస్థితి చూస్తే భారత్ జాగ్రత్త పడాల్సిన సమయం ఇదేనని అర్థమవుతోంది. విచ్చలవిడిగా అన్నిటికీ గేట్లు ఎత్తేయకుండా కొవిడ్ ప్రోటొకాల్ జీవన విధానంగా మార్చుకోవాల్సిందేనని తెలుస్తోంది.

వారం రోజులుగా చైనాలో భారీగా కొవిడ్ కేసులు పెరిగిపోయాయి, మూడు ప్రధాన నగరాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. 3 కోట్లమంది లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఇప్పుడు చైనాతోపాటు దక్షిణ కొరియాని కూడా కరోనా కమ్మేస్తోంది. బుధవారం ఒక్కరోజే 4 లక్షల మందికిపైగా దక్షిణకొరియా వాసులకు కొవిడ్ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ నగరం పరిధిలో ఒమెక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తోందని చెబుతున్నారు. కొత్తగా పాజిటివ్‌ నిర్ధారణ అయిన 4 లక్షల మందిలో 81,395 మంది సియోల్‌ వాసులే కావడం విశేషం. మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. గడచిన 24 గంటల్లో 164 మంది కరోనాతో మృతి చెందారని దక్షిణ కొరియా అధికారికంగా ధృవీకరించింది. విచిత్రం ఏంటంటే.. దక్షిణ కొరియాలో ఇప్పటికే 87.5 శాతం జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తికాగా, 62.7 శాతం మందికి బూస్టర్‌ డోసులు కూడా వేశారు. కానీ కరోనా విలయ తాండవం మాత్రం ఆగలేదు.

హాంగ్ కాంగ్ పై తీవ్ర ప్రభావం..
హాంగ్ కాంగ్ లో ఒక్క రోజులోనే 30వేల కొవిడ్ కేసులు నమోదు కాగా.. 228 మంది కొవిడ్ కారణంగా మరణించడం ఆందోళన కలిగించే విషయం. అయితే కొవిడ్‌ మృతుల్లో ఎక్కువమంది టీకా తీసుకోని వృద్ధులేనని హాంగ్ కాంగ్ అధికారవర్గాలు ప్రకటించాయి. గత వారం వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు 8 శాతం పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

భారత్ లో అప్రమత్తత..
చైనాతోపాటు తూర్పు ఆసియా దేశాల్లో కరోనా ఉధృతి నేపథ్యంలో భారత్ కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తతతో ఉండాలని, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌ సుఖ్‌ మాండవీయ సూచించారు. జీనోమిక్‌ సీక్వెన్సింగ్‌ ను పెంచాలని ఆదేశించారు. మధ్యప్రదేశ్‌ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 12-14 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభమైందని చెప్పారు. పిల్లల టీకాపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని చెప్పారు. ఇప్పటివరకు భారత్ లో 180 కోట్లకు పైగా టీకా డోసులు వేశామని తెలిపారు మన్ సుఖ్ మాండవీయ.

First Published:  16 March 2022 9:23 PM GMT
Next Story