Telugu Global
National

కాంగ్రెస్ పై 'గాంధీ' పెత్తనం వద్దు.. నేడే జీ-23 కీలక భేటీ..

ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీలో జోష్ నింపగా.. కాంగ్రెస్ లో మాత్రం కలతలు రేపాయి. పంజాబ్ లాంటి కీలక రాష్ట్రాన్ని చేజార్చుకోవడంతోపాటు.. మిగతా నాలుగు రాష్ట్రాల్లో కూడా అత్తెసరు సీట్లు సాధించడంతో కాంగ్రెస్ ని అందరూ కార్నర్ చేస్తున్నారు. అసలు బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదంటూ లెక్కలు వేస్తున్నారు. ఈ దశలో కాంగ్రెస్ అధినాయకత్వం ఇటీవల భేటీ అయినా ఏమీ తేల్చకుండా మీటింగ్ ముగించింది. సోనియానే పార్టీకి నాయకత్వం వహించాలంటూ అందరూ తమ విధేయత చాటుకున్నారు. కానీ […]

కాంగ్రెస్ పై గాంధీ పెత్తనం వద్దు.. నేడే జీ-23 కీలక భేటీ..
X

ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీలో జోష్ నింపగా.. కాంగ్రెస్ లో మాత్రం కలతలు రేపాయి. పంజాబ్ లాంటి కీలక రాష్ట్రాన్ని చేజార్చుకోవడంతోపాటు.. మిగతా నాలుగు రాష్ట్రాల్లో కూడా అత్తెసరు సీట్లు సాధించడంతో కాంగ్రెస్ ని అందరూ కార్నర్ చేస్తున్నారు. అసలు బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదంటూ లెక్కలు వేస్తున్నారు. ఈ దశలో కాంగ్రెస్ అధినాయకత్వం ఇటీవల భేటీ అయినా ఏమీ తేల్చకుండా మీటింగ్ ముగించింది. సోనియానే పార్టీకి నాయకత్వం వహించాలంటూ అందరూ తమ విధేయత చాటుకున్నారు. కానీ అసంతృప్త వర్గంగా భావిస్తున్న గ్రూప్ -23 మాత్రం మరోసారి అధినాయకత్వంతో విభేదించింది. కాంగ్రెస్ పార్టీని గాంధీ కుటుంబ సభ్యుల చేతుల్లోనుంచి తప్పించాలని సీనియర్ నేత కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. పార్టీలో నాయకత్వ మార్పుకి సమయం వచ్చిందన్నారాయన.

రాహుల్ పెత్తనమేంటి..?
అధ్యక్ష పదవిలో లేకపోయినా.. పార్టీపై రాహుల్‌ అధికారాన్ని చెలాయిస్తున్నారని మండిపడ్డారు సిబల్. సిబల్ వ్యాఖ్యలకు మరో సీనియర్ నేత సందీప్ దీక్షిత్ కూడా మద్దతు తెలిపారు. ఈ క్రమంలో జీ-23 నేతలు కపిల్ సిబల్ ఇంట్లో ఈరోజు భేటీ కాబోతుండటం విశేషం. వీరికి మరికొంతమంది అసంతృప్తులు జతకలిసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

ఘర్ కీ కాంగ్రెస్ వద్దు.. సబ్ కీ కాంగ్రెస్ కావాలి..
అందరి కాంగ్రెస్‌ (సబ్‌ కీ కాంగ్రెస్‌) కోసం పోరాడుతానంటున్న కపిల్ సిబల్.. కుటుంబ కాంగ్రెస్‌ (ఘర్‌ కీ కాంగ్రెస్‌)కు తాను వ్యతిరేకం అని అంటున్నారు. బీజేపీని వ్యతిరేకించే వాళ్లందరినీ ఏకంచేయడమే ‘సబ్‌ కీ కాంగ్రెస్‌’ ఉద్దేశమని పేర్కొన్నారాయన. ఇటీవల పంజాబ్ ఎన్నికలకు ముందు చరణ్‌ జీత్‌ సింగ్‌ చన్నీని రాహుల్ గాంధీ ఏకపక్షంగా సీఎం అభ్యర్థిగా ప్రకటించడాన్ని సిబల్ తప్పుబట్టారు. అధ్యక్ష హోదాలో లేనప్పటికీ, అన్ని నిర్ణయాలు ఆయనే తీసుకుంటున్నారని, కొత్తగా కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టాలని ఆయన్ని కొందరు కోరుతుండటం హాస్యాస్పదమని అన్నారు.

ప్రక్షాళణ మొదలైందా..?
పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవ్‌ జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ సహా ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులనుంచి అధిష్టానం రాజీనామాలు కోరింది. దీనికి ముందే పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తరాఖండ్‌ పీసీసీ చీఫ్‌ గణేష్ గోడియాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామాలతో సరిపెట్టకూడదని, పార్టీని పూర్తిగా ప్రక్షాళణ చేయాలంటున్నారు నాయకులు.

సిబల్ వ్యాఖ్యలపై నో కామెంట్..
కపిల్ సిబల్ నేరుగా రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేసినా అధిష్టానం దీనిపై ఇంకా స్పందించలేదు. అటు కొంతమంది వీర విధేయులు మాత్రం సిబల్ ని తప్పుబడుతున్నారు. బీజేపీతో చేతులు కలిపారని, ఎంపీ సీటు కావాలంటే నేరుగా బీజేపీలోనే చేరొచ్చని సలహా ఇచ్చారు. గాంధీ కుటుంబం చేతుల్లోనుంచి కాంగ్రెస్ ను బయటకు తీసుకురావడానికి ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్ర ఇదని, అందులో సిబల్ పావుగా మారారని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ లో రెండు వర్గాలు మాటల తూటాలు పేల్చుకుంటున్న ఈ దశలో ఈ రోజు జరగబోయే జీ-23 మీటింగ్ ఆసక్తిగా మారింది.

First Published:  15 March 2022 9:21 PM GMT
Next Story