Telugu Global
NEWS

ప్రజల్లోకి వెళ్లండి.. ఎమ్మెల్యేలకు జగన్ పిలుపు..

వైసీపీ లేజిస్లేటివ్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు సీఎం జగన్. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లాలని, ప్రతి గడపా తొక్కాలని, ప్రజల కష్ట సుఖాలు అడిగి తెలుసుకోవాలని.. అలా చేస్తేనే మరో దఫా గెలుపు సాధ్యమని హితబోధ చేశారు. ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా, ఎమ్మెల్యేలకు ఎంతమంచి పేరున్నా ఇంటింటికీ వెళ్లకపోతే మాత్రం గెలుపు సాధ్యం కాదని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తోందని, ఇక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని […]

ప్రజల్లోకి వెళ్లండి.. ఎమ్మెల్యేలకు జగన్ పిలుపు..
X

వైసీపీ లేజిస్లేటివ్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు సీఎం జగన్. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లాలని, ప్రతి గడపా తొక్కాలని, ప్రజల కష్ట సుఖాలు అడిగి తెలుసుకోవాలని.. అలా చేస్తేనే మరో దఫా గెలుపు సాధ్యమని హితబోధ చేశారు. ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా, ఎమ్మెల్యేలకు ఎంతమంచి పేరున్నా ఇంటింటికీ వెళ్లకపోతే మాత్రం గెలుపు సాధ్యం కాదని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తోందని, ఇక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా అడుగులు వేయాలని చెప్పారు. ఎప్పటికప్పుడు తాను సర్వేలు తెప్పించుకుంటానని, సర్వేల్లో పేరు లేనివారికి టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

జిల్లా బాధ్యతలు..
మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు సీఎం జగన్. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతూనే.. కొంతమందికి స్థాన చలనం ఉండదని పరోక్షంగా హింట్ ఇచ్చారు. మంత్రి పదవులనుంచి బయటకొచ్చినవారికి పార్టీ పదవులిస్తామని, జిల్లాల్లో పార్టీని వారే ముందుండి నడపాలన్నారు. మరోసారి గెలిచి వస్తే మళ్లీ పదవుల్లోకి రావొచ్చని చెప్పారు. మంత్రి పదవి అయినా, పార్టీ పదవి అయినా ఒకేరకంగా పనిచేయాలని సూచించారు.

వలంటీర్ల సన్మాన కార్యక్రమాల్లో పాల్గొనాలి..
ఉగాది నుంచి ప్రతి సచివాలయం పరిధిలో వలంటీర్లకు సన్మానం చేస్తామని, ఆ కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు స్వయంగా హాజరవ్వాలని సూచించారు జగన్. మే నెల నుంచి ప్రతి నెలా ఒక్కో ఎమ్మెల్యే 10 సచివాలయాలు తిరగాలన్నారు. పార్టీ క్యాడర్ తో మమేకం కావాలన్నారు. బూత్ లెవల్ కమిటీలను ఏర్పాటు చేయాలని, అందులో సగం మంది మహిళలుండాలని సూచించారు జగన్.

జులై 8న పార్టీ ప్లీనరీ..
కొత్త జిల్లాలను పరిగణ లోకి తీసుకుని జిల్లా అధ్యక్షులను, రీజినల్‌ కో–ఆర్డినేటర్లను నియమిస్తామని చెప్పారు సీఎం జగన్. జులై 8న పార్టీ ప్లీనరీ నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్‌ 10 నాటికి గ్రామ స్థాయిలో ఉపాధిహామీ సహా అన్ని బిల్లులూ చెల్లిస్తామన్నారు జగన్. ఎమ్మెల్యేలు గ్రామాలకు వెళ్లేనాటికి బిల్లులన్నీ క్లియర్ చేస్తామన్నారు. ఎమ్మెల్యేలకు ఇచ్చే రూ.2 కోట్ల ప్రత్యేక నిధి ఏప్రిల్‌ 1 నుంచి యాక్టివేట్‌ అవుతుందని చెప్పారు జగన్.

ప్రత్యర్థులను గమనించండి..
మంచిని ప్రచారం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. పార్టీపై బురదజల్లేవారి మాటల్ని తిప్పి కొట్టడం కూడా అంతే ముఖ్యమన్నారు జగన్. మనం చేస్తున్న యుద్ధం కేవలం చంద్రబాబుతో కాదని, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటి ఉన్మాదులతో కూడా యుద్దంచేస్తున్నామన్నారు జగన్. ప్రతి గ్రామంలో 10 మంది కార్యకర్తలను యాక్టివ్‌ చేయాలని, నిజాలను, వాస్తవాలను వారికి చేరవేయాలని, తప్పుడు ప్రచారాలను కౌంటర్‌ చేసే ఆయుధాలను కార్యకర్తల చేతిలో పెట్టాలన్నారు.

First Published:  15 March 2022 8:54 AM GMT
Next Story