Telugu Global
NEWS

కొత్త కలెక్టరేట్లకు ఈనెల 25లోగా మౌలిక సదుపాయాలు..

ఏపీలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ విషయంలో వడివడిగా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఇప్పటికే అభ్యంతరాల స్వీకరణ పూర్తయింది. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్ల ఏర్పాట్లకు సంబంధించి భవనాల పరిశీలన కూడా పూర్తయింది. తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న కలెక్టరేట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ఉన్నతాధికారులు డెడ్ లైన్ విధించారు ఈనెల 25లోగా ఆ పని పూర్తి చేయాలన్నారు. వారం లోగా కొత్త కలెక్టరేట్లలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం అందుబాటులోకి తేవాలన్నారు. ఈమేరకు సంబంధిత శాఖల కార్యదర్శులు, కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ […]

కొత్త కలెక్టరేట్లకు ఈనెల 25లోగా మౌలిక సదుపాయాలు..
X

ఏపీలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ విషయంలో వడివడిగా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఇప్పటికే అభ్యంతరాల స్వీకరణ పూర్తయింది. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్ల ఏర్పాట్లకు సంబంధించి భవనాల పరిశీలన కూడా పూర్తయింది. తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న కలెక్టరేట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ఉన్నతాధికారులు డెడ్ లైన్ విధించారు ఈనెల 25లోగా ఆ పని పూర్తి చేయాలన్నారు. వారం లోగా కొత్త కలెక్టరేట్లలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం అందుబాటులోకి తేవాలన్నారు. ఈమేరకు సంబంధిత శాఖల కార్యదర్శులు, కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణం, ఆర్డీవో, డీఎస్పీ, ఇతర కార్యాలయాల ఏర్పాటుకు అందుబాటులో ఉన్నభవనాలను గుర్తించి వినియోగించుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. రోడ్లు, భవనాల శాఖ నిర్దేశించిన ధరల ప్రకారం అద్దెకు తీసుకునే భవనాలకు రుసుం చెల్లించాలని ఆదేశించారు. ఐటీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ఈ-ఆఫీసు విధానం అమలయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

అభ్యంతరాల సంగతేంటి..?
ప్రభుత్వం స్పీడ్ చూస్తుంటే అభ్యంతరాల పరిశీలన, పరిగణన అనేది నామమాత్రమేనని తేలిపోతోంది. జిల్లా కేంద్రాల మార్పు, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల విలీనం, తొలగింపు అనే అంశాలపై ఇప్పటికే వివిధ జిల్లాలనుంచి కొన్ని అభ్యంతరాలొచ్చాయి. హిందూపురం జిల్లా విషయంలో టీడీపీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది, రాజంపేట జిల్లా విషయంలో అధికార పార్టీనుంచే నిరసన స్వరం వినిపించింది. అయితే రోజులు గడిచేకొద్దీ నిరసనకారులు కాస్త వెనక్కు తగ్గారు. దీంతో ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగానే జిల్లాల విభజనకు రెడీ అవుతోంది. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాలనుంచి పాలన మొదలు కావాలనేది ప్రభుత్వ లక్ష్యం. దానికి అనుగుణంగానే పనులు పూర్తవుతున్నాయి.

చివరిగా జగన్ సమీక్ష..
ఇప్పటికే జిల్లాల విభజనకోసం ఏర్పాటు చేసిన కమిటీ విడివిడిగా ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించింది. ఆ తర్వాత ఇప్పుడు సీఎస్ సమీర్ శర్మ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష చేపట్టారు. చివరిగా సీఎం జగన్ కూడా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, ఇతర అధికారులతో మాట్లాడతారని సీఎస్ తెలిపారు. సీఎం జగన్ సమీక్ష తో జిల్లాల విభజన ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్టవుతుంది.

First Published:  10 March 2022 8:30 PM GMT
Next Story