Telugu Global
Others

జై కేసీఆర్..! జగ్గారెడ్డి మనసులోమాట అదేనా..?

ఆమధ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ హడావిడి చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్వతంత్రంగా రాజకీయాలు చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లకు హాజరవుతున్నా తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారికి చెమటలు పట్టిస్తున్నారు. పార్టీ ఆయన్ను బయటకు పొమ్మనలేక, ఆయన వాగ్బాణాలు తట్టుకోలేక సతమతం అవుతోంది. ఈ దశలో కేసీఆర్ జాబ్ మేళా, జగ్గారెడ్డికి ఓ ఆయుధంలా మారింది. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ గురించి అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేయడంపై వ్యక్తిగతంగా హర్షం […]

జై కేసీఆర్..! జగ్గారెడ్డి మనసులోమాట అదేనా..?
X

ఆమధ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ హడావిడి చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్వతంత్రంగా రాజకీయాలు చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లకు హాజరవుతున్నా తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారికి చెమటలు పట్టిస్తున్నారు. పార్టీ ఆయన్ను బయటకు పొమ్మనలేక, ఆయన వాగ్బాణాలు తట్టుకోలేక సతమతం అవుతోంది. ఈ దశలో కేసీఆర్ జాబ్ మేళా, జగ్గారెడ్డికి ఓ ఆయుధంలా మారింది.
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ గురించి అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేయడంపై వ్యక్తిగతంగా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు జగ్గారెడ్డి. సీఎంని నేరుగా కలసి అభినందనలు చెప్పేందుకు అపాయింట్ మెంట్ కోరానని చెప్పారు.

గతంలో టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా ఇలాగే.. దళితబంధు విషయంలో కేసీఆర్ ని ఆకాశానికెత్తేసి టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇప్పుడు జగ్గారెడ్డి కూడా జాబ్ మేళాని ఉపయోగించుకుని టీఆర్ఎస్ లోకి జంప్ అయిపోతారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నుంచి మోత్కుపల్లి కేసీఆర్ పై ఎలా విమర్శల దాడి చేసేవారో.. జగ్గారెడ్డి కూడా కాంగ్రెస్ తరపున కేసీఆర్ ని ఆ రేంజ్ లో టార్గెట్ చేసినవారే. మిగతావారిలా కాకుండా కేసీఆర్ ని ఓ రేంజ్ లో తిట్టినవారే ఇప్పుడు ఆయనకు దగ్గరవుతున్నారని అర్థమవుతోంది.

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత జగ్గారెడ్డి చాలా సార్లు తన అసంతృప్తి బయటపెట్టారు. పార్టీకి విధేయుడిని అంటూనే.. నిరసన స్వరం వినిపించేవారు. ఇటీవల కాంగ్రెస్ గుంపులోనుంచి బయటపడ్డానంటూ కలకలం రేపారు. అంతలోనే సీఎల్పీ మీటింగ్ కి హాజరై అందర్నీ ఆశ్చర్యపరిచారు. అక్కడితో ఆగకుండా వాకవుట్ చేసి తన మార్క్ చూపించారు. తీరా ఇప్పుడు ఉద్యోగాల నియామక నోటిఫికేషన్ల ప్రకటనపై టీఆర్ఎస్ నేతలకంటే ఎక్కువగా కేసీఆర్ ని పొగిడేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టుకునేవారికి 3లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తూ బడ్జెట్ లో నిధులు కేటాయించడాన్ని కూడా కేసీఆర్ తీసుకున్న మంచి నిర్ణయంగా చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. మరోవైపు కాంగ్రెస్ నాయకులంతా ఉద్యోగ ప్రకటనపై మూకుమ్మడిగా విమర్శలతో విరుచుకుపడుతున్న వేళ.. జగ్గారెడ్డి ఒక్కరే ప్లేటు ఫిరాయించారు. త్వరలోనే ఆయన గులాబీ జెండా మెడలో వేసుకోడానికి సిద్ధమవుతున్నాడని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

First Published:  9 March 2022 9:50 PM GMT
Next Story