Telugu Global
NEWS

తెలంగాణలో భారీ ఉద్యోగ మేళా.. వయోపరిమితి భారీగా పెంపు..

తెలంగాణలో ఉద్యోగాల జాతరకు శంఖం పూరించారు సీఎం కేసీఆర్. ఏళ్ల తరబడి నిరుద్యోగుల్లో గూడుకట్టుకున్న నిరాశ, నిస్పృహలను ఒక్కసారిగా పారదోలేందుకు 80వేలకు పైగా ఖాళీలతో నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు ఈరోజే నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నామని అన్నారు. ఉదయం 10గంటలకల్లా టీవీల ముందు రెడీగా ఉండండి అంటూ నిన్నటి నుంచి కాస్త సస్పెన్స్ మెయింటెన్ చేసిన కేసీఆర్.. ఈరోజు నిరుద్యోగులకు నోటిఫికేషన్ల వరాలు ప్రకటించారు. వ్యతిరేకత […]

తెలంగాణలో భారీ ఉద్యోగ మేళా.. వయోపరిమితి భారీగా పెంపు..
X

తెలంగాణలో ఉద్యోగాల జాతరకు శంఖం పూరించారు సీఎం కేసీఆర్. ఏళ్ల తరబడి నిరుద్యోగుల్లో గూడుకట్టుకున్న నిరాశ, నిస్పృహలను ఒక్కసారిగా పారదోలేందుకు 80వేలకు పైగా ఖాళీలతో నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు ఈరోజే నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నామని అన్నారు. ఉదయం 10గంటలకల్లా టీవీల ముందు రెడీగా ఉండండి అంటూ నిన్నటి నుంచి కాస్త సస్పెన్స్ మెయింటెన్ చేసిన కేసీఆర్.. ఈరోజు నిరుద్యోగులకు నోటిఫికేషన్ల వరాలు ప్రకటించారు.

వ్యతిరేకత రాకుండా..
నిధులు, నీళ్లు, నియామకాలకోసం తెలంగాణ ఏర్పడినా.. నియామకాల విషయంలో తెలంగాణ ప్రజలు కాస్త అసంతృప్తిలో ఉన్నారన్నమాట వాస్తవం. ఇటీవల కాలంలో నిరుద్యోగుల ఆత్మహత్యల ఘటనలు కూడా అక్కడక్కడ వెలుగు చూశాయి. ప్రతిపక్షాలు కూడా ఉద్యోగ ప్రకటనలకోసం ఉద్యమాలు చేస్తున్నాయి. ఈ దశలో ఒక్కసారిగా అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేశారు కేసీఆర్. ఉద్యోగ నియామక ప్రకటనతోపాటు.. ఇప్పటి వరకూ ఉద్యోగాలకోసం వేచి చూసిన నిరుద్యోగుల్లో నిరాశ లేకుండా చేసేందుకు గరిష్ట వయోపరిమితిని భారీగా పెంచారు. ఓసీ అభ్యర్థులకు గరిష్టంగా 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లుగా గరిష్ట వయో పరిమితి నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. దివ్యాంగ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 54 ఏళ్లకు పెంచారు. ఎక్స్‌ సర్వీస్‌ మెన్ కేటగిరీకింద దరఖాస్తు చేసుకునేవారికి 47 ఏళ్లకు వయోపరిమితి పెంచారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలు. అంటే ఒక దివ్యాంగ అభ్యర్థి తన గరిష్ట పరిమితిని ఉపయోగించుకుని 54ఏళ్ల వయసులో ఉద్యోగం సంపాదిస్తే.. అతడు గరిష్టంగా 7ఏళ్లు మాత్రమే ఉద్యోగం చేసే అవకాశముంది.

ఒప్పంద ఉద్యోగులకు ఊరట.. స్థానికతకు పెద్దపీట..
తెలంగాణ వ్యాప్తంగా 11,103 పోస్టుల్లో ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు కేసీఆర్. 95శాతం స్థానికత కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామని అన్నారు. అటెండర్‌ నుంచి ఆర్డీవో వరకు 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వస్తాయన్నారు. 5 శాతం మాత్రమే స్థానికేతరులకు అవకాశం ఉందని చెప్పారు. నియామకాల్లో 95శాతం స్థానిక కోటా సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని చెప్పారు కేసీఆర్. శాఖల పరంగా చూస్తే.. హోం శాఖలో గరిష్టంగా 18,334 పోస్టులు భర్తీ చేస్తారు. అత్యల్పంగా కార్మిక ఉపాధి కల్పన శాఖలో 1221 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్ జిల్లాకు సంబంధించి గరిష్టంగా 5268 పోస్ట్ లు భర్తీ కావాల్సి ఉంది. వనపర్తి జిల్లాలో కనిష్టంగా 556 ఉద్యోగాలు భర్తీ చేస్తారు.

First Published:  9 March 2022 6:09 AM GMT
Next Story