Telugu Global
National

ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..??

ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. కమలదళం ఈ ఫలితాలతో సంబరపడిపోతుంటే.. కాంగ్రెస్ శిబిరం కుదేలైపోయింది. ఇక మూడో ప్రత్యామ్నాయానికి కీలకంగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో పాగా వేయబోతోందనే వార్త బీజేపీలో కాస్త కలవరం కలిగిస్తోంది. 2024లో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందు జరిగిన ఈ అసెంబ్లీల ఎన్నికలు మినీ సార్వత్రికంగా భావించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో బీజేపీపై ప్రజలకున్న నమ్మకం పెరిగిందా తరిగిందా, […]

ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..??
X

ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. కమలదళం ఈ ఫలితాలతో సంబరపడిపోతుంటే.. కాంగ్రెస్ శిబిరం కుదేలైపోయింది. ఇక మూడో ప్రత్యామ్నాయానికి కీలకంగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో పాగా వేయబోతోందనే వార్త బీజేపీలో కాస్త కలవరం కలిగిస్తోంది.

2024లో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందు జరిగిన ఈ అసెంబ్లీల ఎన్నికలు మినీ సార్వత్రికంగా భావించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో బీజేపీపై ప్రజలకున్న నమ్మకం పెరిగిందా తరిగిందా, కాంగ్రెస్ తన బలం పెంచుకోగలుగుతోందా లేదా అనేది ఈ ఫలితాలతో తేలిపోతుందనడంలో అతిశయోక్తి లేదు.

పట్టు నిలుపుకున్న బీజేపీ..
యూపీ సహా మణిపూర్, ఉత్తరాఖండ్, గోవాలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోబోతోందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. గోవాలో హంగ్ కి అవకాశాలున్నా.. బీజేపీ రాజకీయ చాణక్యం తెలిసినవారంతా అక్కడ ఆ పార్టీయే చక్రం తిప్పుతుందని అంచనా వేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లో యోగీకి పరాభవం గ్యారెంటీ అని ప్రతిపక్షాలు అంచనా వేసినా.. అక్కడ బీజేపీపై ప్రజలకున్న నమ్మకం తగ్గలేదని మరోసారి ఎగ్జిట్ పోల్స్ నిరూపిస్తున్నాయి. అక్కడ సమాజ్ వాదీ పార్టీ గణనీయంగా సీట్లు పెంచుకున్నా అధికారం మాత్రం బీజేపీదే అని తేలిపోతోంది.

కాంగ్రెస్ పరిస్థితి దారుణం..
ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దారుణమైన ఫలితాలొస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. యూపీలో ప్రియాంక గాంధీ ప్రచారం వృథా అని తేలిపోతంది. అక్కడ కాంగ్రెస్ స్థానాలు సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతాయని తెలుస్తోంది. ఇక పంజాబ్ లో కాంగ్రెస్ అధికారాన్ని దూరం చేసుకుంటోంది. అమరీందర్ ని సాగనంపడం, చన్నీ-సిద్ధూ మద్య అంతర్గత పోరు కాంగ్రెస్ కి శాపంగా మారింది. అదే సమయంలో ఇక్కడ బీజేపీ బలపడలేదు కానీ ఆమ్ ఆద్మీ చొచ్చుకుపోయింది. మొత్తమ్మీద పంజాబ్ వంటి పెద్ద రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేజార్చుకోవాల్సి రావడం ఆపార్టీకి మింగుడు పడని అంశం.

కేజ్రీవాల్ క్రేజ్ పెరుగుతుందా..?
2024 నాటికి బీజేపీకి ప్రత్యామ్నాయంగా థర్ట్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. కేజ్రీవాల్, మమతా బెనర్జీ, దక్షిణాది నుంచి కేసీఆర్ వంటి నేతలు కూడా మోదీపై సవాళ్లు విసురుతున్నారు. ఈ దశలో.. పంజాబ్ ని ఆమ్ ఆద్మీ హస్తగతం చేసుకోవడం కచ్చితంగా కేజ్రీవాల్ కి శుభపరిణామం. ఢిల్లీ, పంజాబ్.. ఇలా కేజ్రీవాల్ దండయాత్ర కొనసాగితే.. 2024 నాటికి మోదీకి ఆయన ప్రధాన ప్రత్యర్థిగా మారడం గ్యారెంటీ. అదే సమయంలో మమత, కేసీఆర్ వంటి నేతలు.. కేజ్రీవాల్ కి దారి వదలాల్సిందే. కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఎదుర్కోలేరు అని ఇన్నాళ్లూ చెబుతూ వచ్చిన హస్తం పార్టీ నేతలు.. ఇకపై ప్రేక్షక పాత్ర వహించాల్సిందే.

First Published:  7 March 2022 10:56 PM GMT
Next Story