Telugu Global
National

ఉక్రెయిన్ చదువు ఆగిపోయింది.. విద్యార్థుల భవిష్యత్తు ఏంటి..?

ఉక్రెయిన్ లో వైద్య విద్యకోసం వెళ్లిన విద్యార్థులంతా యుద్ధం కారణంగా తిరిగి భారత్ కి వచ్చేస్తున్నారు. భవిష్యత్తులో పరిస్థితులు చక్కబడిన తర్వాత వారు తిరిగి ఉక్రెయిన్ వెళ్లే అవకాశాలున్నాయా..? ఒకవేళ ఉన్నా తల్లిదండ్రులు సుముఖంగా ఉంటారా..? విద్యార్థులు మరోసారి ధైర్యం చేస్తారా అనేది ప్రశ్నార్థకమే. దాదాపుగా ఉక్రెయిన్ లో చదువుతూ తిరిగొచ్చిన వారందరి పరిస్థితి ఇదే. ఇప్పటికిప్పుడు ప్రాణాలతో బయటపడ్డాం సరే.. భవిష్యత్తు ఏంటనేది వారిని వెంటాడుతున్న ప్రశ్న. ఇప్పటి నిబంధనల ప్రకారం కష్టమే.. జాతీయ మెడికల్‌ […]

ఉక్రెయిన్ చదువు ఆగిపోయింది.. విద్యార్థుల భవిష్యత్తు ఏంటి..?
X

ఉక్రెయిన్ లో వైద్య విద్యకోసం వెళ్లిన విద్యార్థులంతా యుద్ధం కారణంగా తిరిగి భారత్ కి వచ్చేస్తున్నారు. భవిష్యత్తులో పరిస్థితులు చక్కబడిన తర్వాత వారు తిరిగి ఉక్రెయిన్ వెళ్లే అవకాశాలున్నాయా..? ఒకవేళ ఉన్నా తల్లిదండ్రులు సుముఖంగా ఉంటారా..? విద్యార్థులు మరోసారి ధైర్యం చేస్తారా అనేది ప్రశ్నార్థకమే. దాదాపుగా ఉక్రెయిన్ లో చదువుతూ తిరిగొచ్చిన వారందరి పరిస్థితి ఇదే. ఇప్పటికిప్పుడు ప్రాణాలతో బయటపడ్డాం సరే.. భవిష్యత్తు ఏంటనేది వారిని వెంటాడుతున్న ప్రశ్న.

ఇప్పటి నిబంధనల ప్రకారం కష్టమే..
జాతీయ మెడికల్‌ కమిషన్‌- NMC (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్షియేట్) – 2021 నిబంధనల ప్రకారం, విదేశాల్లో మెడిసిన్‌ చదివే విద్యార్థులు.. మొత్తం కోర్సుని అక్కడే పూర్తి చేయాలి. కోర్సుతోపాటు ఇంటర్న్‌ షిప్‌ కూడా అదే చోట పూర్తి చేయాలి. NMC నిబంధనల ప్రకారం మెడిసిన్‌ మధ్యలో ఆపేసి, స్వదేశానికి వచ్చి ఇక్కడ కోర్సు పూర్తి చేసేందుకు ప్రస్తుత నిబంధనలు అనుకూలించవు. దీంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది.

ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..
యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, ముగిసినా కూడా మునుపటిలాగా విద్యార్థులను ధైర్యంగా అక్కడికి పంపే సాహసం తల్లిదండ్రులు చేయరు. ప్రభుత్వం కూడా ఆ దిశగా అనుమతులిస్తుందా అనేది కూడా అనుమానమే. ఈ దశలో యుద్ధ బాధితులుగా మిగిలిన భారత విద్యార్థుల భవిష్యత్తుకోసం కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాలు అణ్వేషిస్తోంది. NMC నిబంధనలు సడలించడం, లేదా భారత్‌ లోనో, ఇతర దేశాల్లోనో వైద్య విద్యను పూర్తిచేసేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ప్రైవేటు కాలేజీల్లో ఏర్పాట్లు..
ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులు భారత్‌ లోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కోర్సు పూర్తిచేయడానికి, లేదా విదేశాల్లోని కాలేజీలకు బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ, జాతీయ మెడికల్‌ కమిషన్‌ చర్చలు జరుపుతున్నాయి. త్వరలో విదేశాంగ శాఖతోపాటు నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మానవతా దృక్పథంతో కోర్సు పూర్తయ్యేందుకు వెసులుబాటు కల్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

First Published:  4 March 2022 10:04 PM GMT
Next Story