Telugu Global
Cinema & Entertainment

హే సినామిక మూవీ రివ్యూ

నటీనటులు: దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావ్ హైదరీ, నక్షత్ర నగేష్ తదితరులు సంగీతం : గోవింద్ వసంత సినిమాటోగ్రఫీ : ప్రీతా జయరామన్ నిర్మాణం : జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్ దర్శకత్వం : బృందా రేటింగ్ : 1.5/5 హీరోహీరోయిన్ ఇద్దరూ భార్యాభర్తలు. హీరోయిన్ అంటే హీరోకు చాలా ప్రేమ. కానీ హీరోయిన్ ఆ ప్రేమను భరించలేదు, పట్టించుకోదు. హీరో తెచ్చే సంపాదనపైనే ఆమె దృష్టి. అదే టైమ్ లో మరో […]

హే సినామిక మూవీ రివ్యూ
X

నటీనటులు: దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావ్ హైదరీ, నక్షత్ర నగేష్ తదితరులు
సంగీతం : గోవింద్ వసంత
సినిమాటోగ్రఫీ : ప్రీతా జయరామన్
నిర్మాణం : జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్
దర్శకత్వం : బృందా
రేటింగ్ : 1.5/5

హీరోహీరోయిన్ ఇద్దరూ భార్యాభర్తలు. హీరోయిన్ అంటే హీరోకు చాలా ప్రేమ. కానీ హీరోయిన్ ఆ ప్రేమను భరించలేదు, పట్టించుకోదు. హీరో తెచ్చే సంపాదనపైనే ఆమె దృష్టి. అదే టైమ్ లో మరో హీరోయిన్ ఎంటర్ అవుతుంది. సదరు పెళ్లయిన హీరోను ప్రేమిస్తుంది. ఈ టైపు కథలు 90ల్లో బోలెడన్ని వచ్చాయి. ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి, ముత్యాల సుబ్బయ్య, రాఘవేంద్రరావు లాంటి ఎంతోమంది దర్శకులు ఈ టైపు కథల్ని సినిమాలుగా తీసేశారు. మరి ఈకాలం ఇలాంటి కథ మరోసారి తెరపైకొస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా హే సినామిక సినిమాలా ఉంటుంది.

2 దశాబ్దాల కిందటి కథల్ని కాపీ కొట్టడంలో తప్పులేదు. కానీ ఆ కథను ఇప్పటి జనరేషన్ టేస్ట్ కు తగ్గట్టు తీయకపోవడమే పెద్ద తప్పు. ఈ విషయంలో బృందా మాస్టర్ పూర్తిగా ఫెయిల్ అయింది. వందల సినిమాలకు కొరియోగ్రాఫీ అందించి, ఆ అనుభవంతో దర్శకురాలిగా మారిన మాస్టర్.. అప్పటి కాలంలోనే ఉండిపోయిందేమో అనిపిస్తుంది. పాత చింతకాయపచ్చడి లాంటి కథకు నీరసమైన స్క్రీన్ ప్లే, పేలవమైన డైలాగులు తోడవ్వడంతో హే సినామిక సినిమా చూస్తున్న ప్రేక్షకులు.. హే చాలిక అనాల్సిందే.

ఆర్యన్ (దుల్కర్ సల్మాన్), మౌన (అదితి రావు హైదరి) ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. కొత్త కాపురం మొదలుపెడతారు. అయితే కొన్ని రోజులకే మౌనకు ఆర్యన్ బోర్ కొట్టేస్తాడు. ఆర్యన్ అతి ప్రేమను మౌన తట్టుకోలేదు. విడాకులు కోరుకుంటుంది. ఈ క్రమంలో సైకాలజిస్ట్ మలార్ (కాజల్) ని సంప్రదిస్తుంది. మౌన చెప్పిన మాటలు విని, ఆర్యన్ ను చూసిన తర్వాత అతడితో ప్రేమలో పడుతుంది మలార్.
తన సమస్య పరిష్కారం కోసం వెళ్తే, మౌనకు ఇలా మరో కొత్త సమస్య ఎదురవుతుంది. అసలు మలార్, ఆర్యన్ ను ప్రేమించడం ఏమిటి? ఈ ముగ్గురి మధ్య ఏం జరిగింది.. చివరికి ఆర్యన్ ఎటువైపు అనేది ఈ సినిమా కథ.

ఇలా ఓ అవుట్ డేటెడ్ స్టోరీ ఎంచుకున్నప్పుడు కనీసం ట్రీట్ మెంట్ అయినా కొత్తగా ఉండేలా కేర్ తీసుకోవాలి. ఈ విషయంలో బృందా మాస్టర్ ఫెయిల్. స్లో నెరేషన్, ఆకట్టుకోలేని కథనంతో సినిమాను నడిపించారు. సినిమాలో ఆకట్టుకునే సన్నివేశాల్ని వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. చివర్లో వచ్చే ఓ 15 నిమిషాలు మినహాయిస్తే టోటల్ సినిమా మొత్తం బోర్ కొట్టేస్తుంది. రన్ టైం ఎక్కువ ఉండటంతో ప్రేక్షకుల అసహనానికి ఇది పెద్ద పరీక్ష. దుల్కర్ లాంటి పెర్ఫార్మర్, అదితి రావు , కాజల్ లాంటి ముద్దుగుమ్మలు ఉన్నప్పుడు.. బృందా మాస్టర్ ఏదైనా కొత్తగా ట్రై చేయాల్సింది. మళ్లీ కాల్షీట్లు దొరకవు, ఏదో ఒకటి హడావుడిగా తీసేద్దాం అనేలా ఉందీ సినామిక.

దీనికి తోడు ఇది డబ్బింగ్ వెర్షన్ అవ్వడం వల్ల మానసిక హింస ఇంకాస్త ఎక్కువైంది. తెలుగు డబ్బింగ్ అస్సలు కుదర్లేదు. ఆ పాత్రలకు పెట్టిన పేర్లు కూడా ఎబ్బెట్టుగా ఉన్నాయి. ఎడిటింగ్ మరో పెద్ద మైనస్.

ఉన్నంతలో ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు ఏమైనా ఉన్నాయంటే అది ఆ ముగ్గురే. దుల్కర్ ఎప్పట్లానే ది బెస్ట్ ఇచ్చాడు. కాకపోతే ఇలాంటి పాత్రలు అతడికి ఎక్కువైపోతున్నాయి. జాగ్రత్త పడకపోతే ఫ్లాపులు తప్పవు. కాజల్ అందంగా ఉంది. అదితికి మరోసారి నటించే అవకాశం దక్కింది. గోవింద్ వసంత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ పాటలు ఆకట్టుకోవు. ప్రీతా జయరామన్ కెమెరావర్క్ బాగుంది. ఎడిటింగ్ ఘోరంగా ఉంది.

ఓవరాల్ గా హే సినామిక సినిమా ఈ వారం స్కిప్ చేయదగ్గ సినిమాల్లో ఒకటి. భీమ్లా నాయక్ ఎఫెక్ట్ తో ఈ సినిమాకు తక్కువ థియేటర్లు దొరికాయి. అది ప్రేక్షకులకు ఓ వరం అనుకోవాలేమో.

First Published:  3 March 2022 5:27 AM GMT
Next Story