Telugu Global
Cinema & Entertainment

భీమ్లానాయక్ మూవీ రివ్యూ

నటీనటులు: పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్య మీనన్, సంయుక్త మీనన్, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి తదితరులు సంభాషణలు, స్క్రీన్ ప్లే : త్రివిక్రమ్ ఛాయాగ్రాహకుడు : రవి కె చంద్రన్ సంగీతం: తమన్ ఎడిటర్ : నవీన్ నూలి ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్ నిర్మాత: సూర్యదేవర నాగవంశీ దర్శకత్వం: సాగర్ కే చంద్ర రేటింగ్: 2.75/5 పవన్ కల్యాణ్ కు రీమేక్స్ […]

భీమ్లానాయక్ మూవీ రివ్యూ
X

నటీనటులు: పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్య మీనన్, సంయుక్త మీనన్, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి తదితరులు
సంభాషణలు, స్క్రీన్ ప్లే : త్రివిక్రమ్
ఛాయాగ్రాహకుడు : రవి కె చంద్రన్
సంగీతం: తమన్
ఎడిటర్ : నవీన్ నూలి
ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: సాగర్ కే చంద్ర
రేటింగ్: 2.75/5

పవన్ కల్యాణ్ కు రీమేక్స్ కొత్త కాదు. గతంలో చాలానే చేశాడు. కానీ ఈసారి వేరు. ఎందుకంటే, ఈ రీమేక్ అలాంటిలాంటిది కాదు. దాదాపు మల్టీస్టారర్ టైపు సినిమా ఇది. మలయాళంలో సూపర్ హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ ఇది. తెలుగులో కూడా చాలామంది చూసేసిన ఈ మలయాళ సినిమాను రీమేక్ చేయడం అంటే కత్తిమీద సామే. ఇలాంటి క్లిష్టమైన పనిని ఎంతో ఈజీగా పూర్తిచేసింది భీమ్లానాయక్ యూనిట్. ఈరోజు రిలీజైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం గ్యారెంటీ.

అయ్యప్పనుమ్ కోషియమ్ లో రెండు బలమైన పాత్రలుంటాయి. అహం దెబ్బతింటే ఆ పాత్రలు ఎలా రియాక్ట్ అవుతాయి, ఫైనల్ గా ఎలా తమ తప్పుల్ని తెలుసుకుంటాయనేది ఈ సినిమా కథ. నిజానికి ఇందులో హీరోలు అంటూ ఎవ్వరూ ఉండరు. కేవలం రెండు పాత్రలు ఉంటాయంతే. అయితే టాలీవుడ్ కు వచ్చేసరికి పవన్ కల్యాణ్ ట్రాక్ పైకి వచ్చారు. కచ్చితంగా హీరోయిజం పెట్టాల్సిందే. రెండో పాత్రను తగ్గించాల్సిందే. దీంతో రీమేక్ ఖూనీ అవ్వడం ఖాయం అని చాలామంది అనుకున్నారు. సరిగ్గా ఇక్కడే స్క్రీన్ ప్లే రైటర్ త్రివిక్రమ్, దర్శకుడు సాగర్ చంద్ర మేజిక్ చేశారు. ఒరిజినల్ మూవీని ఏమాత్రం చెడగొట్టకుండా, పవన్ కల్యాణ్ ఇమేజ్ ను తగ్గించకుండా, రెండో పాత్రను కుదించకుండా అద్భుతంగా మార్పుచేర్పులు చేశారు.

ఉదాహరణకు ఓ చిన్న సన్నివేశం గురించి చెప్పుకుందాం. పోలీస్ స్టేషన్ లో పవన్-రానా మధ్య ఓ బలమైన సన్నివేశం ఉంది. ఆ సీన్ లో రానా హైలెట్ అవుతాడు. ఆవేశంతో డైలాగ్స్ చెబుతాడు, పోలీస్ స్టేషన్ లో కుర్చీని తంతాడు. ఆ సీన్ లో పవన్ పాత్ర పూర్తిగా తగ్గిపోతుంది. కథ, సన్నివేశం అలాంటిది మరి. కానీ త్రివిక్రమ్-సాగర్ చంద్ర ద్వయం మాత్రం అక్కడ కూడా పవన్ ను తగ్గించలేదు. వెంటనే లాకర్ నుంచి గన్ తీసి టేబుల్ పై పెట్టే సీన్ యాడ్ చేశారు. ఇలా ఒరిజినల్ వెర్షన్ కు వీళ్లిద్దరూ కలిసి చేసిన మార్పులన్నీ బాగున్నాయి.

ఇక్కడ క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమాలో ఎన్నో మార్పులు చేసిన త్రివిక్రమ్-సాగర్ చంద్ర.. క్లైమాక్స్ ను మాత్రం పూర్తిగా మార్చేశారు. నిజంగా అది తేడాకొడితే తీవ్ర విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చేది. కానీ ఆ క్లైమాక్స్ అద్భుతంగా పండింది. సినిమా విజయానికి వెన్నెముక అదే. ఇక శుభం కార్డుకు ముందు పవన్-రానా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, అప్పుడు మందు ఎక్కువై పేరు చెప్పానని రానా చెప్పడం, అప్పుడు పొగరుతో పేరు చెప్పానని పవన్ చెప్పడం.. మంచి ముగింపునిచ్చింది.

ఇవి మాత్రమే కాదు.. సినిమా ఆద్యంతం ఇలానే సాగింది. కొన్ని చోట్ల త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్, సీన్ ను రక్తికట్టిస్తే.. మరికొన్ని చోట్ల డైలాగ్ కంటే సన్నివేశమే హైలెట్ గా నిలిచింది. ఈ రెండూ తగ్గిన చోటు తమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మేజిక్ చేశాడు. ఇలా ఈ ముగ్గురూ కలిసి భీమ్లానాయక్ ను విజయ తీరాలకు చేర్చారు.

ఒరిజినల్ వెర్షన్ లో ఉన్నట్టుగానే తెలుగులో కూడా భీమ్లానాయక్ సాదాసీదాగానే మొదలవుతుంది. అక్కడక్కడ బోర్ కొట్టినప్పటికీ, లోపలకు వెళ్లేకొద్దీ సినిమా చిక్కపడుతుంది. ఇంటర్వెల్ బ్యాగ్ టైమ్ కు పీక్ కు చేరుకున్న సినిమా, ఇక సెకెండాఫ్ నుంచి ఊపందుకుంటుంది. ఎక్కడా గ్యాప్స్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ మంచి సన్నివేశాలతో క్లైమాక్స్ కు తీసుకెళ్లిన విధానం బాగుంది. అయ్యప్పనుమ్ సినిమాలో ఉన్న సన్నివేశాలే ఇక్కడ కూడా కనిపిస్తాయి. కానీ పవన్-రానా ఎప్పీయరెన్స్, ఒరిజినల్ సన్నివేశానికి చేసిన చిన్న చిన్న మార్పులు.. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తాయి.

నటీనటుల గురించి చెప్పుకునే కంటే ముందు, ఈ సినిమాకు సంబంధించి టెక్నీషియన్స్ గురించి చెప్పుకోవాలి. తమన్ మరోసారి తన టాలెంట్ చూపించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లాడు. భీమ్లా టైటిల్ సాంగ్ కు థియేటర్లలో పూనకాలే. ఆ సాంగ్ పిక్చరైజేషన్ కూడా బాగుంది. ఇక త్రివిక్రమ్ తన పెన్ పవర్ తో పాటు స్క్రీన్ ప్లే టెక్నిక్స్ కూడా చూపించాడు. మంచి డైలాగ్స్ పడ్డాయి. క్లైమాక్స్ లో త్రివిక్రమ్ మార్క్ కూడా కనిపించింది. ప్రకాష్ ఆర్ట్ వర్క్, నవీన్ నూలి ఎడిటింగ్, రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అన్నీ బాగా సింక్ అయ్యాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా గ్రాండియర్ గా ఉన్నాయి.

సినిమాలో ఇన్ని పాజిటివ్ అంశాలు ఉన్నప్పటికీ కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఒరిజినల్ వెర్షన్ చూసిన కల్ట్ అభిమానులకు కొన్ని చోట్ల డిసప్పాయింట్ మెంట్ తప్పదు. మలయాళం వెర్షన్ లో హీరో బస్సు దిగి, రోడ్డుపై చెప్పుల వదిలి, బుల్డోజర్ తో హోటల్ కూర్చోసే సీన్ హైలెట్. ఆ సీన్ ను భీమ్లానాయక్ లో కామెడీ చేసి పడేశారు. మలయాళంలో ఆ సీన్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి సన్నివేశాన్ని తెలుగులో కామెడీ చేయడం ఏం బాగాలేదు. ఇక మలయాళం వెర్షన్ లో హీరోలిద్దరూ ఒకే బైక్ పై కలిసి ప్రయాణం చేసే సీన్ ఉంది. తెలుగుకు వచ్చేసరికి ఆ సన్నివేశాన్ని లేపేశారు. కేవలం పోస్టర్ కే ఆ సీన్ పరిమితం అవ్వడం బాధాకరం.

ఇలాంటి కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్, రానా తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు. వాళ్లిద్దరి నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది. బాహుబలి తర్వాత రానా చేసిన బెస్ట్ క్యారెక్టర్ ఇదే కాగా.. అటు పవన్ కల్యాణ్ కెరీర్ లో ది బెస్ట్ మూవీస్ లో ఒకటిగా భీమ్లానాయక్ నిలిచిపోతుంది. నిత్యామీనన్, సంయుక్త మీనన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేయగా.. మురళీశర్మ, రఘుబాబు, పమ్మి సాయి లాంటి నటులు తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు.

ఓవరాల్ గా భీమ్లానాయక్ సినిమాలో ఎత్తిచూపే లోపాల కంటే మెచ్చుకునే అంశాలే ఎక్కువగా ఉన్నాయి. అటు పవన్, ఇటు రానా ఇద్దరూ ఈ సినిమా సక్సెస్ ను క్లెయిమ్ చేసుకోవచ్చు.

First Published:  25 Feb 2022 7:51 AM GMT
Next Story