Telugu Global
NEWS

అసెంబ్లీ ఎన్నికలు అక్కడ.. ఆరోపణల వేడి ఇక్కడ..

దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రచారం, ర్యాలీలపై కొవిడ్ ఆంక్షలు ఉండటంతో.. అక్కడ పార్టీల హడావిడి కాస్త తక్కువ. కానీ ఎలాంటి ఎన్నికలు లేని తెలంగాణలో మాత్రం రాజకీయ వేడి అంతకంతకూ పెరిగిపోతోంది. తాజాగా జనగామ కలెక్టరేట్ కార్యాలయాన్ని, జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభలో బీజేపీపై దుమ్మెత్తిపోశారు. ఎన్నికల సభకంటే ఎక్కువగా సవాళ్లు విసిరారు. ఢిల్లీ కోటలు బద్దలు కొట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, […]

అసెంబ్లీ ఎన్నికలు అక్కడ.. ఆరోపణల వేడి ఇక్కడ..
X

దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రచారం, ర్యాలీలపై కొవిడ్ ఆంక్షలు ఉండటంతో.. అక్కడ పార్టీల హడావిడి కాస్త తక్కువ. కానీ ఎలాంటి ఎన్నికలు లేని తెలంగాణలో మాత్రం రాజకీయ వేడి అంతకంతకూ పెరిగిపోతోంది. తాజాగా జనగామ కలెక్టరేట్ కార్యాలయాన్ని, జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభలో బీజేపీపై దుమ్మెత్తిపోశారు. ఎన్నికల సభకంటే ఎక్కువగా సవాళ్లు విసిరారు. ఢిల్లీ కోటలు బద్దలు కొట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ప్రజలు మద్దతిస్తే జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి మోదీని దేశం నుంచి తరిమేస్తానని హెచ్చరించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకి యూపీఏ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. కానీ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ కూటమిలో ఇప్పుడు ఎవరున్నారు, ఎవరు లేరు అనేది లెక్కలు తేలడంలేదు. కాంగ్రెస్ సారధ్యంలో కేంద్రంలోని బీజేపీతో పోటీపడేందుకు ఎవరూ సాహసించడంలేదు. ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎవరికి వారే తమ నేతృత్వంలో కూటములకోసం కుమ్ములాడుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా నేషనల్ పాలిటిక్స్ లో ఎంటరవుతానంటూ ప్రకటించేశారు. కొన్నిరోజులుగా నర్మగర్భంగా వ్యాఖ్యలు చేస్తూ ఇతర రాష్ట్రాల సీఎంలు, ప్రతిపక్షనేతలు, వామపక్ష నేతలతో టచ్ లోకి వెళ్తున్న కేసీఆర్.. ఇప్పుడు మనసులో మాట బయటపెట్టారు. ప్రజలు మద్దతిస్తే జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రధాని మోదీని తరిమేస్తానంటున్నారు.

ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ ఉప్పునిప్పులా ఉన్నాయి. బీజేపీ నేతలు కూడా అరెస్ట్ లకు వెనకాడకుండా అడుగడుగునా ఆందోళనలు చేస్తున్నారు. టీఆర్ఎస్ తో తాడోపేడో తేల్చుకుంటామంటున్నారు. ఈ దశలో కేసీఆర్ నేరుగా కేంద్రాన్నే టార్గెట్ చేశారు. ఇటీవల తెలంగాణ విభజనపై రాజ్యసభలో మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. అంతకు ముందు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మొండిచేయి చూపించారంటూ మోదీ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు కేసీఆర్. వీటికి కొనసాగింపుగా ఇప్పుడు జనగామ బహిరంగ సభలో ఢిల్లీ కోటలు బద్దలు కొడతానంటూ వ్యాఖ్యానించారు. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అరంగేట్రం చేస్తారని, దక్షిణాది రాష్ట్రాల్లో తనకు అనుకూలంగా ఉన్న పార్టీలతో కలసి కూటమి ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఈ కూటమికి కేసీఆర్ నాయకత్వం వహిస్తారు సరే.. మరి శత్రువుకి, శత్రువుల్లా ఉన్న మమత, కేజ్రీవాల్ కూడా కేసీఆర్ తో చేతులు కలుపుతారా..? లేక తమ కూటమి, కుంపటి వేరుగా పెట్టుకుంటారా అనేది తేలాల్సి ఉంది. మొత్తమ్మీద జనగామలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి.

First Published:  11 Feb 2022 9:39 PM GMT
Next Story